ఆర్ క్రిష్ణయ్య మాదిరిగానే విజయసాయికి కూడానా ?

బీజేపీ స్ట్రాటజీ బాగుంది. పార్టీలో చేరే వారు ఎవరైనా తమ పదవులు వదులుకుని వస్తే వారికే తిరిగి పార్టీ ఖాతా ద్వారా వచ్చే పదవులు అందించడం అన్నది బీజేపీ వ్యూహంగా ఉంది.;

Update: 2025-04-02 11:30 GMT

బీజేపీ స్ట్రాటజీ బాగుంది. పార్టీలో చేరే వారు ఎవరైనా తమ పదవులు వదులుకుని వస్తే వారికే తిరిగి పార్టీ ఖాతా ద్వారా వచ్చే పదవులు అందించడం అన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. ఏపీలో చూస్తే కనుక వైసీపీ నుంచి ఇప్పటికి నలుగురు ఎంపీలు రాజ్యసభ పదవులు వదులుకున్నారు అయితే అందులో మూడు ఖాళీలు భర్తీ జరిగాయి. ఒక్క మోపిదేవి వెంకట రమణ సీటు తప్ప మిగిలిన రెండు సీట్లూ ఎవరైతే వైసీపీ నుంచి ఎంపీలుగా పొందారో వారికే తిరిగి దక్కాయి.

అలా బీద మస్తాన్ రావు వైసీపీ నుంచి ఎంపీ అయి తిరిగి టీడీపీలో చేరి అదే పదవి దక్కించుకున్నారు. అలాగే వైసీపీ నుంచి రాజ్యసభకు నెగ్గిన ఆర్ క్రిష్ణయ్య బీజేపీలో చేరి అదే పదవిని దక్కించుకున్నారు. మోపిదేవి పదవి మాత్రం సానా సతీష్ కి వెళ్ళింది ఇక ఇపుడు చూస్తే వైసీపీలో దిగ్గజ నేతగా ఉన్న వి విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అలాగే వైసీపీ నుంచి కూడా తప్పుకున్నారు.

దాంతో ఇపుడు ఆయన బీజేపీలో చేరితే ఏపీలో ఖాళీ అయిన ఆ ఒకే ఒక సీటు ఆయనకే తిరిగి ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. మరి కొద్ది రోజులలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో ఈ ఖాళీకి సంబంధించి భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది అని అంటున్నారు.

అలా చూసుకుంటే ఈ ఖాళీ బీజేపీకే ఇస్తారు అన్నది ఇప్పటిదాకా వినిపిస్తున్న మాట. ఈ సీటు మీద టీడీపీ జనసేన చూపు ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి రాజీనామా చేసినది కావడం ఆయన బీజేపీ పెద్దలకు అత్యంత సన్నిహితులు కావడంతో ఆ సీటు తామే ఉంచుకోవాలని తమ వారినే పెద్దల సభకు పంపించాలని బీజేపీ ఆలోచిస్తోంది అని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో చూస్తే కనుక అనేక పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఈ ఎంపీ సీటు ఇస్తారని అనుకున్నారు. అలా కాదు అని విశాఖకు చెందిన మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకి ఇస్తారు అని కూడా అనుకున్నారు. కానీ ఇపుడు మరో కొత్త ప్రచారం ఏమిటి అంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సీటు తిరిగి ఆయనే ఇచ్చి రాజ్యసభకు పంపుతారు అని.

అందుకే బీజేపీలోకి విజయసాయిరెడ్డి చేరుతున్నారని అది కూడా ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే అన్నది ఢిల్లీ వర్గాల ద్వారా వినిపిస్తున్న విషయం. అయితే విజయసాయిరెడ్డి అభ్యర్ధిత్వాన్ని టీడీపీ కూటమి ఆమోదిస్తుందా అన్నదే చర్చగా ఉంది. విజయసాయిరెడ్డి నిన్నటి దాకా ప్రత్యర్ధి. జగన్ తరువాత అంతలా ఆయన మీద విమర్శలు చేస్తూ వచ్చిన టీడీపీ ఇపుడు తమ మద్దతుతో ఆయనను పెద్దల సభకు పంపుతుందా అన్నదే చర్చ.

అయితే విజయసాయిరెడ్డి జగన్ అండ్ కోటరీ మీద విమర్శల జోరుని పెంచడం ద్వారా కూటమి పెద్దల మనసు చూరగొన్నారని కూడా అంటున్నారు. ఒక ఏపీలో లిక్కర్ స్కాం విషయంలో తెర వెనక పెద్దలు ఎవరో ఆయన చూచాయగా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారని అంటున్నారు. అలా ఆయనను కనుక కూటమి వైపు తెచ్చుకుంటే వైసీపీ ఒంటి స్తంభం మేడను ష్యూర్ గా గురి పెట్టి కొట్టవచ్చు అన్న లెక్కలు కూడా ఉన్నాయని అంటున్నారు.

ఇక చూస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసిన సందర్భంలో విజయసాయిరెడ్డి తనకు చంద్రబాబుతో వ్యక్తిగతంగా ఏమీ లేదని చెప్పేశారు. రాజకీయంగానే విమర్శలు తప్ప తమ మధ్య ఏమీ లేదని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తనకు స్నేహితుడని ఆయన చెప్పుకున్నారు.

సో ఆ విధంగా చూసుకుంటే కనుక విజయసాయిరెడ్డి ఎంపీ అభ్యర్ధిత్వానికి ఎవరికీ అభ్యంతరాలు ఉండవనే అంటున్నారు. ఇక బీజేపీ ఆర్ క్రిష్ణయ్యకు ఎంపీ పదవి ఇచ్చింది తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయడానికి బీసీలను ఆకట్టుకోవడానికి అన్నది తెలిసిందే.

విజయసాయిరెడ్డికి పదవి ఇస్తే కనుక ఏపీలో బీజేపీ పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుందని పైగా ఆయన వైసీపీలో నిన్నటిదాకా ఉన్నారు కాబట్టి అటు నుంచి చేరికలకు మార్గం సుగమం అవుతుందని లెక్కలు కూడా ఉండొచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో ఖాళీ అవుతున్న విజయసాయిరెడ్డి సీటు తిరిగి ఆయనకే దక్కే సూచనలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.

Tags:    

Similar News