పట్టపగలు.. నడిరోడ్డు మీద భార్యను కత్తితో చంపేశాడు

అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్నభార్యను కసిగా చంపేసి వైనం షాక్ కు గురి చేసిన దారుణం విజయవాడలో చోటు చేసుకుంది.;

Update: 2025-11-14 09:30 GMT

అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్నభార్యను కసిగా చంపేసి వైనం షాక్ కు గురి చేసిన దారుణం విజయవాడలో చోటు చేసుకుంది. పట్టపగలు.. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే పదునైన కత్తితో భార్య గొంతు కోసేశాడో కసాయి భర్త. అతడ్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన జనాల్ని బెదిరించటమేకాదు.. ముందుకు వస్తే చంపేస్తానని వార్నింగ్ ఇవ్వటంతో చేష్టలుడిగిపోయిన దారుణం విజయవాడలోని సూర్యారావుపేటలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

విజయవాడలోని దుర్గా అగ్రహానికి చెందిన 40 ఏళ్ల విజయ్ నూజివీడుకు చెందిన 30 ఏళ్ల సరస్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2022లో వీరి వివాహం జరిగింది. విజయ్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో టెక్నీషియన్ గా.. సరస్వతి సూర్యారావుపేటలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. వీరికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు.

కొంతకాలంగా భార్యభర్తల మధ్య విభేదాలు అంతకంతకూ పెరగటంతో ఏడాదిన్నరగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు. దీంతో ఆమె తన తల్లిదండ్రుల ఊరైన నూజివీడుకు వెళ్లిపోయింది. ప్రతి రోజు అక్కడి నుంచే సూర్యారావుపేటలోని ఆసుపత్రికి వచ్చి విధులు నిర్వర్తిస్తోంది. ఎప్పటిలానే గురువారం కూడా డ్యూటీ కింద ఉదయం 8 గంటలకు వచ్చిన ఆమె.. మధ్యాహ్నం రెండు గంటల వరకు విధులు నిర్వర్తించారు.

ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన సరస్వతిపై కత్తితో మెడ మీదా.. గొంతు మీద పొడిచారు. తీవ్రగాయాలైన ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో భార్య విలవిల్లాడుతుండగా.. ప్రాణాలు విడిచే వరకూ భర్త విజయ్ అక్కడే ఉండిపోయాడు. ఆమెను కాపాడేందుకు ముందుకు వచ్చిన వారిని చంపుతానని బెదిరించటంతో వారెవరూ ముందుకు రాని పరిస్థితి.

ఈ దారుణ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సూర్యారావుపేట సీఐ అహ్మద్ అలీ.. ఇతర పోలీసు సిబ్బంది విజయ్ ను మాటల్లో పెట్టి ఒక్కసారిగా చుట్టుముట్టారు. స్థానికులు స్పందించి అతడి చేతిలో ఉన్న కత్తిని లాక్కున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లైన నాటి నుంచి భార్య సరస్వతి మీద అనుమానంతో తరచూ గొడవకు దిగటంతో విసుగు చెందిన ఆమె పుట్టింట్లో ఉంటోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

Tags:    

Similar News