విజయసాయిరెడ్డిని కొడితే మీడియాకు తెలియదా ?
పెద్దాయన మాజీ వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డిని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామక్రిష్ణారెడ్డి కొట్టారు అన్నది ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
పెద్దాయన మాజీ వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డిని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామక్రిష్ణారెడ్డి కొట్టారు అన్నది ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీతో విభేదించి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి కొత్తగా పార్టీని ఏర్పాటు చేస్తాను ఇటీవలనే ప్రకటించారు. ఆ వెంటనే ఒక బహిరంగ లేఖ రాస్తూ తనను సజ్జల కొట్టారని షాకింగ్ కామెంట్స్ చేశారు. దానికి టీడీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అదే నిజమంటూ గట్టిగా చెప్పారు. దాంతో అసలు ఏమి జరిగింది అన్న చర్చ అయితే అంతటా సాగుతోంది. అయితే దీని మీద రకరకాలైన విశ్లేషణలు కూడా వస్తున్నారు. జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే ఎపుడో అయిపోయిన విషయం ఇపుడే ఎందుకు ముందుకు తెస్తున్నారు అన్నదే అసలైన పాయింట్ గా అంతా చూస్తున్నారు.
ఎప్పటి విషయం ఇది :
విషయానికి వస్తే 2022లో జరిగిన ప్లీనరీలో కొట్టినట్లుగా విజయసాయిరెడ్డి అలాగే కోటం రెడ్డి ఇలాంటి వాళ్ళు అంతా కన్ ఫర్మ్ చేసేశారు. అయితే ఇక్కడ లాజిక్ ని అంతా మిస్ అవుతున్నారు. నిజంగా విజయసాయిరెడ్డిని కొట్టారు అంటే అంత పబ్లిక్ ప్లేస్ లో అది జరిగితే నాలుగేళ్లకు పైగా జరిగినా బయటకు రాకుండా ఉంటుందా అన్నదే ఈ లాజిక్ పాయింట్. చూడబోతే విజయసాయిరెడ్డి ఎంపీగా కీలక స్థానంలో ఉన్నారు, అలాంటి ఆయన్ని కొడితే అక్కడ వైసీపీ శ్రేణులు ఫోటోలు వీడియోలు తీయరా అన్న ప్రశ్న వస్తోంది. అంతే కాదు సహజంగా వైసీపీ మీటింగుల మీద ప్రత్యర్ధి పార్టీల కన్ను ఉంటుంది. నిఘా భారీ ఎత్తున కూడా ఉంటుంది. ఏ చిన్నది నెగిటివ్ గా వచ్చినా వెంటనే దానికి మోసేసి నానా విధాలుగా హడావుడి చేసేసే మీడియాకు కొదవ లేదు కదా అని అంటున్నారు.
గోల్డెన్ చాన్స్ కదా :
విజయసాయిరెడ్డి వంటి పెద్ద మనిషిని కొట్టారు అంటే అది కూడా సొంత పార్టీ మీటింగులోనూ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ప్లీనరీలోనూ జరిగింది అంటే టీడీపీ అనుకూల మీడియా ఇదంతా చూస్తూ ఊరుకుంటుందా అన్నది మరో చర్చ. గోల్డెన్ చాన్స్ గా భావించి డిబేట్ల మీద డిబేట్లు పెట్టి మరి వైసీపీని టార్గెట్ చేయకుండా ఉంటారా అన్నది కూడా ఇక్కడ మరో పాయింట్. అంతే కాదు వైసీపీకి ఆనాడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీలు 30 మంది దాకా ఉన్నారు. ఎంపీలు 22 మంది ఉన్నారు. రాజ్యసభ సభ్యులు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇంకా చెప్పాలీ అంటే పెద్ద నాయకులు ఎంతో మంది ఉన్నారు, మరి వారికి అయినా ఈ విషయం తెలిస్తే ఆ నోటా ఈ నోటా బయటకు పొక్కకుండా ఉంటుందా అన్నది కూడా పెద్ద డౌట్ కదా అంటున్నారు. ఎవరో ఒకరి ద్వారా అది మీడియాకు కూడా ఏనాడో బహిర్గతం అయిపోయేది కదా అని అంటున్నారు. ఇక్కడ మరో తమాషా ఉంది. కోటం రెడ్డి లాంటి ఒక సాధారణ ఎమ్మెల్యేకే విజయసాయిరెడ్డిని కొట్టారు అన్న సంగతి తెలిస్తే ఆయన కంటే ఎంతో మంది పెద్ద నాయకులు బిగ్ షాట్స్ మంత్రులు ఉన్న చోట ఈ విషయం ఆనాడే ఎవరికి ఎందుకు తెలియలేదు అన్నది.
డిజిటల్ మీడియా యుగంలో :
ఇది పాత కాలం కాదు, ఎక్కడ ఏమి జరిగినా క్షణాలలో ప్రపంచానికి తెలిసిపోయే డిజిటల్ యుగంలో ఉన్న వేళ ఒక ఎంపీగా కీలక బాధ్యతలలో ఉన్న విజయసాయిరెడ్డిని ప్లీనరీలో కొట్టిన విషయం ఇప్పటిదాకా బయటకు రాలేదు అంటే అది మీడియా ఫెయిల్యూర్ కింద భావించాలా లేక వైసీపీ ప్లీనరీ అంతలా కంచుకోటల మధ్య జరిగిపోయింది అని అనుకోవాలా అన్నదే మరో ప్రశ్న. పైగా అదే ప్లీనరీలో జరిగిన అనేక విషయాలు మినిట్ టూ మినిట్ బయటకు వచ్చాయి. జనాలు ఎంత మంది వచ్చారు ఎవరేమిటి మాట్లాడారు, ఎవరు ఎపుడు వచ్చి ఎపుడు వెళ్ళారు ఇవన్నీ మీడియాలో వచ్చిన వార్తలు అయితే హైలెట్ గా నిలిచే విజయసాయిరెడ్డి మీద దాడి వార్త ఎందుకు బయటపడలేదు అన్నది చూస్తే మాత్రం ఆలోచించాల్సిందే అని అంటున్నారు.
భౌతిక దాడి పెద్ద విషయం :
నిజానికి తన మీద భౌతిక దాడి జరిగింది అని విజయసాయిరెడ్డి చెప్పేసినంత చిన్న మ్యాటర్ కానే కాదని అంటున్నారు. ఎందుకంటే అది చాలా పెద్ద ఇష్యూ, ఇంకా చెప్పాలీ అంటే ఆనాటి అధికార పార్టీని కుదిపేసే మ్యాటర్ కూడా. ఒక అధికార పార్టీ మీటింగులో ఎంపీ మీద దాడి అంటే సాధారణమైనది కానే కాదు, నిజంగా జరిగి ఉంటే అటూ ఇటుగా మ్యాటర్ లీక్ అయి మొత్తం ఏపీ పాలిటిక్స్ అట్టుడికి పోయి ఉండేదని అంటున్నారు. విజయసాయిరెడ్డి సజ్జల మధ్య మాటల దాడి జరిగి ఉండొచ్చు అని కొందరు అంటున్నా కూడా అలాంటిది కూడా జరగకపోవచ్చు అనే వారూ ఉన్నారు. ఇద్దరు కీలక నాయకులు ప్లీనరీ వేదిక రెస్ట్ రూం లో వాదులాడుకున్నారు అన్నా కూడా అది ఎంతటి రాజకీయ మసాలాను అందిస్తుందో వేరేగా చెప్పాల్సింది లేదు, ఇక విజయసారెడ్డి విషయం చూస్తే జగన్ దగ్గర ఆయనకు మంచి పలుకుబడి ఉందని కూడా పార్టీలో సన్నిహితంగా చూసిన వారు చెబుతున్న మాట.
పబ్లిసిటీ కోసమేనా :
ఇక్కడ మరో విషయం ఉంది. గత కొద్ది రోజులుగా ఇదే టాపిక్ జనంలోకి వెళ్తోంది. దాంతో పాటుగా విజయసాయిరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అంటే ఆయనకు పబ్లిసిటీ ఈ విధంగా వచ్చింది అని అంటున్న వారు ఉన్నారు. సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసమే ఈ విధంగా మాట్లాడారా అన్నది ఒక సందేహంగా ఉందని అంటున్నారు. అదే నిజం అనుకుంటే ఆయన ఇంతలా దిగజారాలా అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇక విజయసాయిరెడ్డి జగన్ ని నంబర్ టూ అన్నంతగా ఘాటు విమర్శ చేయడం వెనక కూడా వ్యూహం ఉందని అంటున్నారు. సజ్జల మీద కోపంతో జగన్ ని సొంత పార్టీలోనే వెనక్కి నెట్టేలా కామెంట్స్ చేశారని అంటున్నారు. ఈ విధంగా విజయసాయిరెడ్డి లేఖ రాసి సంచలనం రేకెత్తించడం ద్వారా వైసీపీలో కోటరీ నిజం అని జనాలకు చెప్పాలన్నది ఒక ప్రయత్నంగా వైసీపీ నుంచి వినిపిస్తోంది.
నంబర్ టూ లేనే లేదు :
నిజానికి వైసీపీలో నంబర్ టూ ప్లేస్ అన్నది లేనే లేదని అంటున్నారు. సజ్జల రామక్రిష్ణారెడ్డికి జగన్ పార్టీ బలోపేతం విషయంలో బాధ్యతలు అప్పగించారు అని వైసెపీ వారు కొందరు గుర్తు చేస్తున్నారు. ఇక సజ్జల విషయం తీసుకుంటే ఆయనకు వైసీపీలో ఎలాంటి అధికార హోదా లేదు, అయిదేళ్ల పాటు అధికారంలో పార్టీ ఉన్నపుడు సజ్జల అధికార దాహంతో వ్యవహరించి పదవి కోరుకుంటే ఆయనే రాజ్యసభకు వెళ్లేవారు కదా అని కూడా గుర్తు చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ అయినా తీసుకునే వారు కదా అని అంటున్నారు. కేవలం సజ్జల జగన్ కి నమ్మిన బంటుగా వ్యవహరిస్తున్నారు అన్నది పార్టీలో అంతా దగ్గర నుంచి చూసిన వారి మాటగా ఉంది. ఇక విజయసాయిరెడ్డి వైసీపీని వీడిపోతూ నాలుగు రాళ్ళు వేయడం ద్వారా ఫ్యాన్ పార్టీలో గందరగోళం క్రియేట్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే తనను కొట్టారు అని ఒక జీవిత కాలం లేటుగా విజయసాయిరెడ్డి చెప్పినా దాని ఇంపాక్ట్ ఏదీ ఆయనకు సానుభూతిని కురిపించే చాన్సే లేదని అంటున్నారు. ఎందుకంటే రాజకీయాలో ఎప్పటి లెక్క అపుడే ఉంటుంది కాబట్టి.