హస్తినలో పేలిన 'కొండా' బాంబు !
బీసీలకు ఒక న్యాయం, ఇతర వర్గాలకు ఒక న్యాయం ఉంటుందా ?’ అని మంత్రి కొండా సురేఖ ఢిల్లీలో మీడియా చిట్ ఛాట్ లో వ్యాఖ్యానించారు. దీంతో కొండా మాటల వెనక అంతర్యం ఏమిటి అన్న చర్చ మొదలైంది.
‘నా మీద చర్యలు తీసుకోవాలి అనుకుంటే ముందుగా సీఎం రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. పదేళ్లపాటు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటి వరకూ నన్ను రాజీనామా చేయాలని ఎవరూ అడగలేదు. అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. బీసీలకు ఒక న్యాయం, ఇతర వర్గాలకు ఒక న్యాయం ఉంటుందా ?’ అని మంత్రి కొండా సురేఖ ఢిల్లీలో మీడియా చిట్ ఛాట్ లో వ్యాఖ్యానించారు. దీంతో కొండా మాటల వెనక అంతర్యం ఏమిటి అన్న చర్చ మొదలైంది.
కొండా సురేఖ కూతురు సుష్మిత రేవంత్ రెడ్డి మీద చేసిన ఆరోపణల నేపథ్యంలో క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు ఇవ్వడం, కొండా సురేఖ దానికి బదులు ఇవ్వడం, కొండా సురేఖను పదవి నుండి తప్పించాలని క్రమశిక్షణ సంఘం పార్టీ అధిష్ఠానానికి సిఫారసు చేయడంతో వ్యవహారం ఢిల్లీకి చేరింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిసేందుకు కొండా అనుమతి కోరగా వెంటనే ఢిల్లీకి రావాలని చెప్పడంతో నిన్న సురేఖ ఢిల్లీకి వెళ్లింది. నిన్న రేవంత్ రెడ్డితో గంట పాటు భేటీ అయిన కేసీ వేణుగోపాల్ సురేఖతో మాట్లాడలేదు. ఈ రోజు ఆయనతో కొండా సురేఖ భేటీ అవుతారని అందరూ భావించారు.
అయితే కేసీ వేణుగోపాల్ తో భేటీకి ముందే కొండా సురేఖ రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు, బీసీలకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం ఉంటుందా ? అని చేసిన వ్యాఖ్యలతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పరోక్షంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని సంకేతాలు వచ్చిన నేపథ్యంలోనే ఆమె చిట్ చాట్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు కొండా సురేఖ దంపతులు తమ కూతురు చేసిన వ్యాఖ్యలతో తమకేం సంబంధం అని చెబుతూ వస్తున్నారు. కొండా సురేఖ క్రమశిక్షణ సంఘానికి ఇచ్చిన సంజాయిషీలోనూ తన కూతురు వ్యాఖ్యలపై తనను సమాధానం చెప్పాలని అడగడం భావ్యం కాదన్నారు. అదే సమయంలో కొండా మురళి మాట్లాడుతూ ‘ నా కూతురుకు 38 ఏళ్లు. ఆమెకు 12 ఏళ్ల బిడ్డ. ఆమె ఏం మాట్లాడుతుంది అన్నది మేము చెప్పాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.
ఇప్పటి వరకు బిడ్డ చేసిన వ్యాఖ్యలకు తన మీద చర్యలు ఎలా తీసుకుంటారు అంటూ వస్తున్న కొండా సురేఖ అధిష్టానంతో భేటీకి ముందే నేరుగా రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం అంటే పదవి నుంచి తప్పుకోవాలన్న సంకేతాలు అందడమే అన్న వాదన వినిపిస్తున్నది. ఈ పరిణామాల బట్టి అసలు అధిష్టానం కొండా సురేఖను కలుస్తుందా ? పదవికి రాజీనామా చేయాలని అదేశిస్తుందా ? ఒకవేళ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే కొండా సురేఖ ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది ? అన్న చర్చ మొదలైంది.,