1000 రోజుల రేవంత్ పాలన ఎలా ఉంది? సీఎం ఏమన్నారు.. జనం ఏం అంటున్నారు?
ఇక వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున సంబరాలు చేస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. 2023 నవంబరులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథాన నడిపిన రేవంత్ రెడ్డి ఆ ఏడాది డిసెంబరు 7న తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సెప్టెంబరు 2తో వెయ్యి రోజుల పాలన పూర్తికావడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున సంబరాలు చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలన ఒక రికార్డుగా అభివర్ణిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన నుంచి విపక్షంలోనే పోరాడిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలిసారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వాన్ని విజయవంతంగా నడుపుతున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు. సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన సమయంలో పాలనా అనుభవం లేకపోవడం, కలహాల కుంపటి వంటి కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడపడం సాధ్యమా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే తన సామర్థ్యంతో రేవంత్ రెడ్డి ఎటువంటి ఆటుపోట్లు లేకుండానే ప్రభుత్వాన్ని వెయ్యి రోజులు నడపడం అంటే సామాన్య విషయం కాదని అంటున్నారు.
ఇక వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున సంబరాలు చేస్తోంది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు గుప్పిస్తూ పోరుబాటు పట్టాయి. ఈ నేపథ్యంలో తన పాలన విజయాలను క్లుప్తంగా విరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. ‘‘జన ఆకాంక్షలే కేంద్రంగా.. త్యాగాల ఆశయాలే ఇంధనంగా’’ వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నట్లు సీఎం ట్వీట్ చేశారు. పేదల అవసరాల తీర్చేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రాష్ట్ర దీర్ఘకాలిక భవిష్యత్తు, యువతకు ఉపాధిని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, నెలవారీ రూ.2,500 నగదు ఇస్తామని ప్రకటించారు. సీఎం అయిన రెండు రోజులకే ఉచిత బస్సు పథకం అందుబాటులో తెచ్చారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నారని అంటున్నారు. కానీ, మహిళలకు రూ.2,500 నగదు మాత్రం ఇప్పటికీ అమలు చేయలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇక రైతులకు రుణమాఫీ చేసినా, ప్రభుత్వంపై ఆ వర్గంలో కొంత అసంతృప్తి ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చలేకపోయారని అంటున్నారు. కానీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాల భర్తీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక ఆర్థిక పరిస్థితులతో కొన్ని పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న విషయాన్ని పరిశీలకులు ఎత్తిచూపుతున్నారు.
రాజకీయంగా పైచేయి
కాంగ్రెస్ రాజకీయాలకు పూర్తిగా కొత్త అయినప్పటికీ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నాయకులను నడపడంలో రేవంత్ రెడ్డి విజయవంతం అయినట్లేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. భిన్నభిప్రాయాలు, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి మాటను కాదనే నాయకులు కనిపించకపోవడం ఆయనకు కలిసివస్తుందని అంటున్నారు. సీనియర్లతో సైతం సఖ్యతగా ఉంటూ రాజకీయ చాణక్యాన్ని రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. అయితే మంత్రి పదవి ఆశించి దక్కిన ఒకరిద్దరు నేతలు, కేబినెట్ లో ఉంటూ తరచూ వివాదాస్పద వైఖరితో రచ్చకెక్కుతున్న మంత్రి కొండా సురేఖ వంటి వారి వల్ల సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అటువంటి వారిని అదుపు చేయడంలో ఆయన నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఏదిఏమైనా వెయ్యి రోజుల పాలనలో రేవంత్ రెడ్డి ఆశించిన దానికంటే ఎక్కువగానే మార్కులు సంపాదించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.