వైఎస్సార్ లేకుండా 17 ఏళ్ళు... ఆ రోజు ఏమి జరిగింది ?

వైఎస్సార్ అన్న మూడు అక్షరాలు తెలుగు వారి జీవితాలతో ఎంతగానో పెనవేసుకుని పోయాయి.

Update: 2026-09-02 05:29 GMT

వైఎస్సార్ అన్న మూడు అక్షరాలు తెలుగు వారి జీవితాలతో ఎంతగానో పెనవేసుకుని పోయాయి. అచ్చంగా మూడు దశాబ్దాల పాటు వైఎస్సార్ కూడా తన రాజకీయ జీవితం ప్రజా రంజకంగా కొనసాగించారు. ఎక్కడ మొదలెట్టారో కానీ సరిగ్గా మూడు దశాబ్దాల తర్వాత యాధృచ్చికంగా రాజశేఖరెడ్డి రాజకీయ జీవితం ముగిసింది. ఆయన తరచూ అనే మాట ఒకటి ఉండేది. అరవై ఏళ్ళు వచ్చిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటాను స్వచ్చందంగా పదవీ విరమణ చేస్తాను అని. ఆయన ఏ ముహూర్తాన ఆ మాట అన్నారో కానీ అది అలాగే జరిగిపోయింది. ఆయన అరవై ఏళ్ళ పుట్టిన రోజు జరుపుకున్న రెండు నెలలకే ఈ భువిని వీడి దివికి పయనం అయ్యారు. ఆ రోజు సెప్టెంబర్ 2. ఇక 2009 సంవత్సరం. అది తెలుగు వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అ రోజున రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాకు వెళ్ళే క్రమంలో దారిలోనే ప్రమాదం జరిగి దుర్మరణం పాలు అయ్యారు.

పెను విషాదంగానే :

వైఎస్సార్ ఈ లోకం వీడి సరిగ్గా పదిహేడేళ్ళు అవుతోంది. కాలం లెక్కలో ఇది పెద్దగా గణించతగినది కాదు, కానీ మానవ జీవితంలో ఈ పదిహేడేళ్ళు ఎంతో విలువైనవి. ఎంతో ముఖ్యమైనవి. అంతే కాదు కచ్చితంగా ఎంతో సుదీర్ఘమైనవి కూడా అని చెప్పాల్సి ఉంది. అయితే ఇదే కాలం చేసే మాయాజాలంలో ఈ పదిహేడేళ్ళు కూడా కరిగిపోతున్నాయి. నిన్నా మొన్నా జరిగినట్లుగానే ఆ దుర్ఘటన ఉంది. వైఎస్సార్ మన మధ్య లేడు అని ఎవరూ అనుకోకుండా ఉండలేని పరిస్థితి. అలాగే ఆయన దూరం అయ్యారని తలచుకుని ఆ విషాదాన్ని వీడలేని దుస్థితి. ఇలా రెండు రకాలైన భావజాలంతో సతమతం అవడం వైఎస్సార్ విషయంలోనే జరిగింది. ఎందుకంటే ఆయన మరణం మిగిల్చిన విషాదం మామూలుది కాదు. ప్రతీ కుటుంబంలోనూ తమ వారికి పోగొట్టుకున్నామన్న బాధతో విలవిలలాడిన సందర్భం అది. వైఎస్సార్ మరణ వార్త వినగానే ఎంతో మంది తమ ప్రాణాలను వదిలారు. అలా వందల మంది మరణించడం కూడా ఒక చరిత్ర మిగిల్చిన గుర్తుగానే చూడాలి.

చరిత్రలో చేదు పేజీ :

నిజానికి చూస్తే 2009 సెప్టెంబర్ 2న ఏమి జరిగింది అన్నది కూడా ఒక్కసారి గతాన్ని నెమరేసుకుంటే పెను విషాదానికి ముందు వైఎస్సార్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సెప్టెంబర్ 2న ఉదయాన్నే ముఖ్యమంత్రిగా ఆయన దిన చర్య మొదలైంది. చిత్తూరు జిల్లలో రచ్చ బండ కార్యక్రమానికి వైఎస్సార్ వెళ్లాల్సి ఉంది. ఉదయం 8:38 గంటలకు వైఎస్సార్ బేగంపేట విమానాశ్రయం నుండి వైఎస్సార్ ట్విన్ ఇంజన్ బెల్ 430 హెలికాప్టర్‌లో చిత్తూరు జిల్లా నల్లగండ్ల గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరారు. ఇక ఆయన వెంట ఐఏఎస్ అధికారులు పి. సుబ్రమణ్యం, కెఎస్. సి రఘువీంద్రనాథ్, పైలట్లు ఎస్. కె భాటియా, ఎంఎస్ రెడ్డి ఉన్నారు. కొంత దూరం హెలికాప్టర్ ప్రయాణించి కర్నూలు దాటిన తర్వాత సమయం సరిగ్గా 9:12 గంటల ప్రాంతంలో చూస్తే హెలికాప్టర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో పూర్తిగా సంబంధాలను కోల్పోయింది.

కుప్ప కూలిన వైనం :

అలా 2009 సెప్టెంబర్ 2న ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల అడవుల్లో కూలిపోయి ఆయనతో పాటు మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఇక ఆ సమయంలో వాతావరణం కూడా ఇబ్బందికరంగా ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షంతో పాటు దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దాంతోనే ఈ పెను ప్రమాదం జరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కనిపించకపోవడం అంటే అది దేశవ్యాప్తంగా కాదు అంతర్జాతీయంగా సంచలనం అయింది. ఆ వెంటనే గాలింపు చర్యలు మొదలయ్యాయి. ఇక ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా హెలికాప్టర్ అదృశ్యమైనట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఆ వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుఖోయ్ విమానాలు ఇస్రో ఉపగ్రహాలు గ్రేహౌండ్స్ దళాలు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాయి. ఆ భారీ కసరత్తు మధ్య మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 3న ఉదయానికి కర్నూలుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పావురాల గుట్టపై హెలికాప్టర్ శకలాలు లభ్యమయ్యాయి. వైఎస్సార్ తదితరులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కొండను బలంగా ఢీకొనడంతో వైఎస్సార్ సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించినట్లు రక్షణ దళాలు ధృవీకరించాయి. దాంతో ఉమ్మడి ఏపీ వ్యాప్తంగానే కాదు దేశమంతా శోకతప్త అయింది. వైఎస్సార్ అభిమానులు అయితే తట్టుకోలేక పెద్ద ఎత్తున ప్రాణాలు విడిచారు.

రాజన్నగా గుర్తుంటారు :

అయితే వైఎస్సార్ మరణించి ఇన్నేళ్ళు గడుస్తున్నా ఆయన జ్ఞాపకాలు అయితే అలాగే సజీవంగా ఉన్నాయి. ఆయన పాలించినది స్వల్పకాలం అయినా బడుగులకు పేదలకు ఆయన చేసిన మేలుని జనాలు ఇప్పటికీ తలచుకుంటూనే ఉంటారు. ఈ దేశంలోనూ అలాగే ఉమ్మడి ఏపీలో ఎందరో ముఖ్యమంత్రులు పాలించారు. ఎందరో ప్రజాకర్షణ నేతలు కూడా ఏలికలు అయ్యారు. అయితే ఎవరికీ దక్కని ఒక అదృష్టం వైఎస్సార్ కి దక్కింది. ఆయన జనం గుండెలలో శాశ్వతంగా గూడు కట్టుకున్నారు. అందుకే వైఎస్సార్ మరణించి పదిహేడేళ్ళు అంటే అపుడేనా అన్నది వైఎస్సార్ అభిమానులతో పాటు తెలుగు వారి మాట.

Tags:    

Similar News