కవితకు కౌంటర్ ఇచ్చిన వేముల !

‘నాకు, నా తండ్రి కేసీఆర్ మధ్య విభేదాలు సృష్టించారు. ఈ విషయంలో ఆయన శకుని పాత్ర పోషించాడు.

Update: 2026-09-02 03:43 GMT

‘నాకు, నా తండ్రి కేసీఆర్ మధ్య విభేదాలు సృష్టించారు. ఈ విషయంలో ఆయన శకుని పాత్ర పోషించాడు. భవిష్యత్తులో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులను క్షమించినా, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మాత్రం క్షమించను. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపాడు’ అని మాజీ ఎంపీ, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో తీవ్ర ఆరోపణలు చేశారు.

తనను తీహార్ జైలుకు పంపడం, అక్కడ తాను పడ్డ ఇబ్బందులు, కుటుంబంతో విబేధాలు, రాజకీయంగా ఒంటరిని చేశారని ఆ సభలో కవిత ఆవేదన వ్యక్తం చేసింది. వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ల మీద కవిత పలు ఆరోపణలు చేసింది. అంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావు తన తండ్రి కేసీఆర్ ఆరోగ్యం బాగుండకూడదని క్షుద్రపూజలు చేస్తున్నట్లు ఆరోపించింది.

అయితే తాజాగా కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించాడు. ‘నేను, నా తండ్రి దివంగత వేముల సురేందర్ రెడ్డి ఇద్దరమూ పార్టీ వ్యవస్థాపక సభ్యులం. కవిత పార్టీలోకి మధ్యలో వచ్చింది. మధ్యలోనే తిరిగి వెళ్లింది. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి నేను మొదటి నుండి విధేయుడిని. కవిత వ్యాఖ్యలను ఆమె జ్ఞానానికి వదిలేస్తున్నాను‘ అని అన్నారు.

‘పార్టీని, కేసీఆర్ ను కష్టకాలంలో వదిలి వెళ్లింది కవితనా ? నేనా ? కాంగ్రెస్ తో నేను సంప్రదింపులు జరిపాను అని కవిత ఆరోపించడం అన్నది బేస్ లెస్. కాంగ్రెస్ నేతలతో చర్చలు జరపలేదని కవిత చెప్పగలదా ? కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే వివిధ జిల్లాల బీఆర్ఎస్ నాయకులను కవిత టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తుందని’ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించిన నేపథ్యంలో కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీని ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా నిజామాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కవిత మెట్టినిల్లు కాగా, ఆమె అక్కడి నుండి 2014లో ఎంపీగా ఎన్నికై 2019 వరకు కొనసాగారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా అక్కడి నుండే ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల మీద చేసిన ఆరోపణలు చర్చకు దారితీశాయి.

Tags:    

Similar News