భక్తులకూ దేవాలయ కమిటీల్లో చోటు...భేషైన నిర్ణయం !
భగవంతునికి భక్తుడు ఎదురుగా ఉండాలి. వారిద్దరి బంధం ఆధ్యాత్మిక పరమైనది. అలాంటి భక్తులనే భగవంతుడి సేవలో మరింతగా నిమగ్నం చేస్తే ఎలా ఉంటుంది.
భగవంతునికి భక్తుడు ఎదురుగా ఉండాలి. వారిద్దరి బంధం ఆధ్యాత్మిక పరమైనది. అలాంటి భక్తులనే భగవంతుడి సేవలో మరింతగా నిమగ్నం చేస్తే ఎలా ఉంటుంది. అది భేషైన నిర్ణయంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఇపుడు ఆ ప్రతిపాదనను సీరియస్ గానే పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, టీటీడీ ఆధ్వర్యంలోని ధార్మిక విద్య వైద్య సేవలపై నిర్వహించిన సమీక్షలో ఈ ఈ కీలక ప్రతిపాధన వచ్చింది. భక్తులు శ్రీవారి సేవకులతో ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని దేవాదాయ శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. దాంతో రానున్న రోజులలో ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే భక్తులకు కూడా ఆలయ కమిటీల్లో చోటు లభిస్తుందని అంటున్నారు.
కొత్తగా వేలాది ఆలయాలు :
రాష్ట్రంలో కొత్తగా అయిదు వేల వరకూ వేల దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కూడా చంద్రబాబు టీటీడీని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 161 నియోజకవర్గాల నుంచి 4 వేల 192 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు ఇప్పటికే టీటీడీకి అందాయి. వాటిలో కూడా ఇప్పటికే 967 ఆలయాల నిర్మాణం పూర్తయింది. దాంతో మిగిలిన వాటిని కూడా వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. మూడు కేటగిరీలుగా ఆలయాలను నిర్మించేలా ప్రణాళిక రూపొందించామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. వీటిలో కూడా ఎస్సీ ఎస్టీ కాలనీలు మత్స్యకార ప్రాంతాలు బలహీన వర్గాల కాలనీలతో పాటు సాధారణ ప్రాంతాల్లోనూ టీటీడీ దేవాలయాలు నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
వారి సేవలు మరింతగా :
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఏకంగా 11.8 లక్షల మంది శ్రీవారి సేవకులు ఉన్నారని టీటీడీ చెబుతోంది. దాంతో వారి సేవలను కొత్తగా నిర్మించే ఆలయాలలోనూ వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆలయాల నిర్మాణంతో పాటు వాటి నిర్వహణలో భక్తుల భాగస్వామ్యాన్ని పెంచాలని ఆయన సూచించడం విశేషం. అలాగే బోర్డు సభ్యులు, భక్తులు, శ్రీవారి సేవకులతో ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేసే అంశాన్ని సీరియస్ గానే పరిశీలించాలని బాబు ఆదేశించారు. ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల రాజధానులలో కూడా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. మారిషస్ వంటి దేశాలు కూడా శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని కోరుకుంటున్నాయని బాబు చెప్పుకొచ్చారు.
దివ్యక్షేత్రంగా తిరుపతి అభివృద్ధి :
తిరుమలతో పాటు దిగువన ఉన్న తిరుపతిని సంపూర్ణ దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలని బాబు టీటీడీకి దేవాదాయ శాఖకు సూచించారు. శ్రీవారి సంప్రదాయాలకు అనుగుణంగా కల్యాణాలు నిర్వహించుకునే వేదికగా తిరుపతిని అభివృద్ధి చేయాలని కోరారు. ఆధ్యాత్మికత, పవిత్రత ప్రతిబింబించేలా ప్రత్యేక ఎకోసిస్టమ్‌ను రూపొందించాలని చెప్పారు. నిపుణులైన భక్తుల భాగస్వామ్యంతో టీటీడీ సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరేలా చూడాలని బాబు దిశా నిర్దేశం చేశారు. ఏపీలో కేవలం టీటీడీ ఆలయాలతో పాటు ఇతర దేవాయాలు శక్తి పీఠాలతో ఆధ్యాతిక హబ్ గా కూడా రూపొందించేలా చూడాలని ప్రభుత్వం అధికారులను కోరుతోంది. ఆ దిశగా కార్యాచరణను చేపట్టాలని సూచిస్తోంది.