ఉత్తరాంధ్ర గోదారమ్మ రాక...జల సిరులతో కొత్త కళ
వడి వడిగా దూకుడుగా గోదారమ్మ ఉత్తరాంధ్రాలోకి అడుగు పెడుతోంది. బిర బిరా సాగుతూ బీడు భూములలో పరవళ్ళు తొక్కనుంది.
వడి వడిగా దూకుడుగా గోదారమ్మ ఉత్తరాంధ్రాలోకి అడుగు పెడుతోంది. బిర బిరా సాగుతూ బీడు భూములలో పరవళ్ళు తొక్కనుంది. తాను పరవశిస్తూ ప్రవహించిన ప్రాంతంగా పచ్చదనం చేయనుంది. ఎక్కడ గోదావరి ఎక్కడ ఉత్తరాంధ్ర. కానీ సాధ్యపడింది. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటిని మళ్లించి ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆచరణలో అమలు కానుంది. ఆ శుభ ముహూర్తం కూడా రానే వచ్చింది. సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట వద్ద గోదావరి జలాలను అనకాపల్లికి పంపించే కార్యక్రమం లాంచనంగా ప్రారంభించనున్నారు.
పోలవరం ఎడమ కాలువ ద్వారా :
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదారమ్మ ఉత్తరాంధ్ర వైపు పరుగులు పెట్టనుంది. ఏకంగా నాలుగు నదుల్ని దాటుకుంటూ తూర్పు కనుమలలో దారి చేసుకుంటూ గోదావరి ఉత్తరాంధ్ర ప్రాంతానికి కదలి రానుంది. పోలవరం ఎడమ కాలువపై నిర్మించిన రెగ్యులేటర్ ను ముఖ్యమంత్రి ఆన్ చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు విడిచి పెట్టనున్నారు. ప్రస్తుతం ఎడమ ప్రధాన కాలువ ద్వారా విడిచి పెడుతున్న నీటి ద్వారా మొత్తం నాలుగు జిల్లాల పరిధిలోని 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని అధికారులు చెబుతున్నారు. దీని వల్ల 5.23 లక్షల మంది దాహార్తి కూడా తీరనుంది. ఎడమ కాలువ నిర్మాణం కోసం ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం రూ.4,192 కోట్ల ఖర్చు చేసిందని అధికారులు వివరించారు.
తరలించేందుకు సైఫన్ నిర్మాణం :
ఇదిలా ఉండా ఏలేరు నది బెడ్ లెవల్ కు దిగువన గోదావరి జలాలను తరలించేందుకు సైఫన్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. పోలవరం ఎడమ కాలువ ద్వారా ప్రవహిస్తున్న గోదావరి జలాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న పంపా, తాండవ, వరాహ, శారద నదుల్ని దాటుకుని ఏలేరు కాలువ తూర్పు కనుమలపై సంక్లిష్టమైన నిర్మాణాల మీదుగా ఉత్తరాంధ్రకు చేరుకోనున్నాయి. పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో భాగంగా వివిధ నదీ ప్రవాహాల వద్ద సైఫన్లు, అక్విడెక్టులను రాష్ట్ర జలవనరుల శాఖ నిర్మించింది. ఈ నదుల ప్రవాహానికి కొన్ని చోట్ల ఎగువన ఇంకొన్ని చోట్ల ప్రవాహానికి దిగువ నుంచి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణం జరిగింది. ఇక పంపా నది ఎగువ నుంచి అక్విడక్ట్ నిర్మించి పోలవరం ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలకు ఇంజనీర్లు మార్గం సుగమం చేశారు. పంపా నదిపై అక్విడెక్ట్ నిర్మాణానికి 30 మీటర్ల లోతు వరకు 312 పైల్స్‌తో పునాదుల వేసి అక్విడెక్ట్ ను నిర్మించారు. 10,634 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని తట్టుకునేలా తాండవ నదిపై 6 వెంట్లతో 447 మీటర్ల పొడవున అక్విడక్ట్ నిర్మాణం జరిగిందని అధికారులు చెప్పారు.
తక్షణ ప్రయోజనం :
ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా విడుదల చేస్తున్న గోదావరి జలాలతో అనకాపల్లి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలగనుంది. తాజాగా విడుదల చేయనున్న గోదావరి జలాలు అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా జలవనరుల శాఖ ప్రణాళిక చేసింది. గోదావరి జలాలతో పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80 వేల ఎకరాలు, పంపా కింద 12 వేల ఎకరాలు, తాండవ, వరహా, మామిడి గెడ్డ ఆయకట్టు పరిధిలో ఉన్న 46,620 ఎకరాల స్థిరీకరణ జరగనుంది. మొత్తంగా 23.44 టీఎంసీల గోదావరి జలాలు సాగు తాగు నీటితో పాటు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక అవసరాలకు వినియోగించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానించేలా 213 కిలోమీటర్ల పొడవున పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది.
ఎనిమిది లక్షల ఎకరాలు లక్ష్యం :
ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం ద్వారా అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎగువ ప్రాంతాలకు గోదావరి నీరు తరలించేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. తద్వారా ఎడమ ప్రధాన కాలువ సహా ఉత్తరాంధ్రలో జిల్లాల్లో మొత్తం 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఆ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. మొత్తం మీద రెండు దశాబ్దాల కల ఈ విధంగా నెరవేరనుంది. దంతో ఉత్తరాంధ్ర వాసులకు ప్రత్యేకించి అనకాపల్లి ప్రాంతానికి సెప్టెంబర్ 2 చరిత్రలో గుర్తుండి పోయే రోజుగా మిగిపోనుంది.