ఇది కదా.. బిజినెస్: బిగ్ మార్కెట్ నుంచి 'ఐస్‌క్రీమ్' వరకు రిలయెన్స్!
గనులు, విద్యుత్ ప్రాజెక్టులు, భారీ మొబైల్ సమాచార వ్యవస్థ.. ఇలా రిలయెన్స్ పేరుకు ఒక భారీ ఇమేజ్ ఉంది.
గనులు, విద్యుత్ ప్రాజెక్టులు, భారీ మొబైల్ సమాచార వ్యవస్థ.. ఇలా రిలయెన్స్ పేరుకు ఒక భారీ ఇమేజ్ ఉంది. ఈ సంస్థ చేసే వ్యాపాలకు ఒక బ్రాండ్ ఉంది. అయితే.. కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్నట్టుగా.. ఈ బిగ్ బిజినెస్ టైకూన్ ఇప్పుడు.. సాధారణ `ఐస్‌క్రీమ్` బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. నిజానికి బడా కంపెనీలు అంటే.. బడా బడా వ్యాపారాలే చేస్తాయని అనుకుంటాం. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆలోచన వచ్చిందే తడవుగా సామాన్యులను సైతం వ్యాపారానికి కనెక్ట్ చేసేస్తున్నారు. ఎంత పెద్ద టాటా కంపెనీ.. ఉప్పు వ్యాపారం చేస్తోంది కదా!.
ఎంత పెద్ద గాడ్రెజ్ కంపెనీ.. బాత్ రూంలో వినియోగించే లిక్విడ్ వరకు .. అన్నింటినీ ఒడిసి పట్టింది కదా!. ఇప్పుడు రిలయన్స్ కూడా అంతేనన్నమాట. ఏ చిన్న వ్యాపారాన్ని వదిలి పెట్టడం లేదు. ఇది ఒకరకంగా ప్రజలకు చేరువ కావడమే కాదు.. తమ వ్యాపార సామ్రాజ్యాలను మరింత విస్తరించుకునే ప్రణాళికలు కూడా. నిజానికి ఒకప్పుడు ఐస్ క్రీమ్ అంటే.. విదేశాలపై ఆధారపడి ఉండి ఉన్న అతిపెద్ద మార్కెట్. ఆ తర్వాత.. మన దేశంలోనే అనేక కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు రిలయన్స్ వచ్చింది. త్వరలోనే ‘బాంబే క్రీమరీ’ బ్రాండ్ తో దేశవ్యాప్తంగా అందరి నోళ్లను ఊరించనుంది.
తాజాగా ‘బాంబే క్రీమరీ’ బ్రాండ్‌ను రిలయెన్స్ కంపెనీ ఆవిష్కరించింది. రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(ఆర్ సీ పీ ఎల్) ఇప్పటికే గృహోపకరణాలు, నిత్యావసర సరుకుల బిజినెస్‌ను ప్రారంభించింది. ఇక, ఇదే వేదిక నుంచి బాంబే క్రీమరీ పేరుతో సరికొత్త ఐస్ క్రీమ్ బిజినెస్‌ను ప్రారంభించనుంది. ఇది విదేశీ బ్రాండ్లకు భారీ పోటీ ఇస్తుందన్నది కంపెనీ చెబుతున్న మాట. అయితే.. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒకప్పుడు స్థానికంగా పుల్ల ఐస్ క్రీమ్‌లను విక్రయించుకుని జీవితాలను పోషిం చుకునే వారు.. ఇప్పుడు దాదాపు కనుమరుగయ్యారు. ఇక, బడా పరిశ్రమలు ఈ రంగంలోకి వస్తుండడంతో సాధారణ పరిశ్రమల సంగతేంటన్నది ప్రశ్న.
10 రూపాయల నుంచే..
తాజాగా బాంబే క్రీమరీ ద్వారా ఐస్ క్రీమ్ రంగంలోకి అడుగు పెడుతున్న రిలయెన్స్ కంపెనీ.. 10 రూపాయల ఉత్పత్తుల నుంచే ప్రజలను ఆకర్షించడం ప్రారంభించనుంది. తమ ఉత్పత్తులు 10 రూపాయల నుంచి మొదలు కానున్నాయని సంస్థ వెల్లడించిం ది. సో.. ఆలోచన ఉండాలే కానీ.. వ్యాపారాలు చేసేందుకు మార్గాలు అనేకం అనేది రిలయెన్స్ మరోసారి నిరూపించింది. మరి ఈబ్రాండ్ ఎలాఉంటుంది? ఎంత మందిని ఎట్రాక్ట్ చేస్తుందన్నది చూడాలంటే కొంత సమయం పట్టనుంది. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్నారట. తర్వాత.. దక్షిణాది, ఉత్తరాది వైపు వ్యాపారాలను విస్తరించనున్నారట.