పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ వ్యక్తి దుర్మరణం.. అభిమానం ప్రాణాల మీదకొస్తోందా?
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ యువకుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో భాగంగా ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ యువకుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అమలాపురంలో ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్:
అమలాపురంలోని ఒక కళాశాల సమీపంలో మంగళవారం రాత్రి ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల కోసం అభిమానులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్లెక్సీని అమరుస్తుండగా ప్రమాదవశాత్తు అది సమీపంలోని విద్యుత్ వైర్లకు తగిలింది. కరెంట్ షాక్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చి దుర్మరణం:
విద్యుత్ షాక్‌తో మృతి చెందిన యువకుడిని బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ప్రేమ్ కుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను స్వగ్రామంలోని స్నేహితులతో కలిసి ఎంతో ఘనంగా నిర్వహించాలనే ఉత్సాహంతో ఊరికి వచ్చాడు. అంతలోనే ఈ ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబంలో తీరని శోకం మిగిలింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నేతలు:
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదం ఎలా జరిగిందో పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ విషాద వార్త తెలిసిన వెంటనే బీజేపీ నేత యాళ్ల దొరబాబు, జనసేన నాయకులు నల్లా శ్రీధర్, ఏడిద శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు:
ఉద్యోగం చేస్తూ ఉన్నతంగా ఎదుగుతాడనుకున్న కుమారుడు పండుగలా జరుపుకోవాల్సిన వేడుకల వేళ శవమై తేలడంతో ప్రేమ్ కుమార్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక స్నేహితుడిని కళ్ల ముందే కోల్పోవడంతో తోటి యువకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామమంతటా విషాద వాతావరణం అలుముకుంది.
పండగలా జరగాల్సిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ప్రేమ్ కుమార్ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టే సమయంలో విద్యుత్ వైర్ల పట్ల తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతాయని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. ఇక మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మరొకవైపు ఇదే విషయంపై మరో చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అభిమానం ఉండాలి కానీ ప్రాణాలు మీదకు వచ్చేలా ఆ అభిమానాన్ని చూపించుకోవాల్సిన అవసరం లేదని .. కుటుంబంలో ఒకరిని కోల్పోతే ఆ కుటుంబానికే ఆ బాధ తెలుస్తుంది కానీ ఇతరులకు కాదు అంటూ హెచ్చరిస్తున్నారు.