స్టాలిన్ హెచ్చరికలే నిజమవుతాయా? దళపతి సర్కారు మూన్నాళ్ల ముచ్చటేనా?!
ప్రధానంగా ఇటీవల ఇండియా టుడే వెలువరించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఫలితాలు టీవీకే-కాంగ్రెస్ మధ్య అగాథానికి దారితీసినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
తమిళనాడులో దళపతి విజయ్ సర్కారు మనుగడపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి, విపక్ష డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గతంలో చేసిన హెచ్చరికలు నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్ ప్రభుత్వానికి కీలక మద్దతుదారు కాంగ్రెస్ పార్టీతో అప్పుడే విభేదాలు రాజుకుంటుండటంతో మున్ముందు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనే ఉత్కంఠ రేకెత్తుతోంది. ప్రభుత్వాన్ని నడుపుతున్న టీవీకే నేతలు అవగాహన రాహిత్యంతో మిత్రపక్షాలతో సంబంధాలు బెడిసికొడుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా ఇటీవల ఇండియా టుడే వెలువరించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఫలితాలు టీవీకే-కాంగ్రెస్ మధ్య అగాథానికి దారితీసినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇండియా టుడే సర్వేలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని అభ్యర్థిగా 9 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. కొత్తగా రాజకీయాల్లోకి రావడం, వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని స్థాపించడం ద్వారా విజయ్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు ఆయన సినీ గ్లామర్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని అభ్యర్థుల్లో ఆయన ఒకరుగా నిలిచారని అంటున్నారు. అయితే టీవీకే మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా, మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా విజయ్ ఫర్ పీఎం అంటూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు వేసి హడావుడి చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే అభ్యంతరం చెబుతున్నారు.
ప్రధాని అభ్యర్థిగా హుల్ గాంధీకి మద్దతు ఇస్తామంటేనే తాము టీవీకే పార్టీకి సపోర్టు చేస్తామని, లేనిపక్షంలో వెంటనే మద్దతు ఉపసంహరించుకుంటామని తమిళనాడు కాంగ్రెస్ నేతలు చేస్తున్న హెచ్చరికలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలకే ఈ పరిణామం జరగడం, కాంగ్రెస్ నేతలను సర్దిచెప్పేలా ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకోకపోవడంతో మున్ముందు పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో విపక్షాలకు కేటాయించిన వరుసలో సీట్లు కేటాయించడం కూడా హీటెక్కిస్తోంది.
టీవీకేతో విభేదాల వల్లే కాంగ్రెస్ సభ్యులకు విపక్షం వరుసలో సీట్లు కేటాయించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ పక్ష నేత కుత్ బర్ట్ మాత్రం ఈ మార్పును తేలిగ్గా తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం తమకు సీట్లు కేటాయించారని స్పీకర్ ను వెనకేసుకు వస్తున్నారు. అయితే ఇటీవల మంత్రి రాజేశ్ కుమార్ చేసిన హెచ్చరికలతోనే ఈ మార్పు జరిగిందా? అన్న అనుమానాలు మాత్రం రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్-టీవీకే మధ్యలో ఏదో జరుగుతుందనే సందేహాలు మాత్రం బలంగా వ్యాపిస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి విజయ్ జోక్యం కోసం ఎదురుచూస్తున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ చుట్టూ అనుభవం లేని వారే ఉండటంతో ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయనే అంటున్నారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే మున్ముందు ఈ సమస్య పెను తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చిరిస్తున్నారు. మరోవైపు విజయ్ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదు అంటూ గతంలో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన హెచ్చరికలను అంతా గుర్తుచేస్తున్నారు. స్టాలిన్ చెప్పిన గడువుకు రెండు నెలలు మందుగానే విభేదాలు బయటపడటం ఆసక్తిరేపుతోంది.