ఒక్క చీర 21 మందిని కాపాడింది !

కైలాస మానస సరోవర యాత్రలో మంచు కొండల్లో భక్తి పారవశ్యంలో సాగిపోతున్న భక్తులకు హఠాత్తుగా సంభవించిన వరదలు వారు ప్రయాణిస్తున్న బస్సును ముంచెత్తాయి.

Update: 2026-09-02 07:30 GMT

కైలాస మానస సరోవర యాత్రలో మంచు కొండల్లో భక్తి పారవశ్యంలో సాగిపోతున్న భక్తులకు హఠాత్తుగా సంభవించిన వరదలు వారు ప్రయాణిస్తున్న బస్సును ముంచెత్తాయి. అయితే వారితో పాటు ఉన్న ఒక మహిళ చీర ఆ ప్రమాదంలో చిక్కుకున్న 21 మంది ప్రాణాలను కాపాడింది. ఆమె సమయస్ఫూర్తి వారి ప్రాణాలను నిలిపింది.

మానస సరోవరం యాత్రకు వెళ్లిన 21 మంది తమిళనాడు యాత్రికులకు ఈ ప్రమాదం ఎదురైంది. నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో రసువా ప్రాంతంలో టిప్పర్ - స్యాబ్రుబేసి వైపు ప్రయాణిస్తుండగా ఇది జరిగింది. పైకి చేరిన పూంగోడి అనే యాత్రికురాలు స్వెటర్ వేసుకొని తన చీరను కిందకు వదిలింది.

ఆ చీరతో పాటు పక్కనే ఉన్న కేబుల్ సాయంతో 21 మంది ప్రాణాలు కాపాడుకున్నారు. ఒక మహిళ ఎక్కడానికి ఇబ్బంది పడితే చీరను నడుముకు కట్టి పైకి లాగారు. ఈ సమయంలో ఆమె భర్త రత్నకుమార్ కిందకు వెళ్లి సాయం చేశాడు. ప్రమాదం నుండి బయటపడిన వీరంతా భారత్ కు చేరుకున్న తర్వాత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ వారిని కలిశారు.

గత నెల ఆగస్టు 26న నేపాల్ లో ఆకస్మిక వరదల్లో ఇప్పటివరకు 1127 మంది మరణించారు. దాదాపు 4858 మంది గల్లంతయ్యారు. ఇందులో విదేశీయులు, హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లోని కార్మికులు ఉన్నారు. ప్రమాదంలో చిక్కుకుపోయిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.

ఇప్పటివరకు 6,541 మందిని రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా రక్షించారు. హైడ్రో పవర్ టన్నెల్స్ చిక్కుకున్న వారి కోసం భారత్, చైనాల సహాయంతో నేపాల్ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. 1113 మృతదేహాలకు గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. 911 గుర్తించలేని మృతదేహాల వివరాలను పోలీస్ వెబ్ సైట్లో పెట్టారు. ప్రధానంగా చిత్వాన్, నవల్ పరాసి, నువా కోట్, గోర్ఖా, ధాడింగ్, రసువా, తనాహున్ జిల్లాలు వరదల్లో ప్రభావితం అయ్యాయి. టిబెట్ వైపు కూడా 16 మంది మరణించగా, 546 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. కానీ కేవలం చీర సాయంతో 21 మంది ప్రాణాలు దక్కించుకోవడం గమనార్హం.

Tags:    

Similar News