90 సెకన్ల ఇంటర్వ్యూ.. ఒక్క ప్రశ్నతో యూఎస్ వీసా రిజెక్ట్.. భారతీయుడి అనుభవం వైరల్

ముంబైలోని అమెరికా కాన్సులేట్‌లో కేవలం 90 సెకన్లలో ముగిసిన ఇంటర్వ్యూలో ఒక్క ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోవడమే ఈ నిరాకరణకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.

Update: 2026-09-02 13:29 GMT

అమెరికా వెళ్లాలనేది చాలామంది భారతీయుల కల. అయితే ఎంతటి మంచి ఉద్యోగం, అర్హతలు ఉన్నప్పటికీ వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేయడం మాత్రం పెద్ద సవాలుగానే మిగిలిపోతోంది. తాజాగా 34 ఏళ్ల ఒక భారతీయ ఐటీ ప్రొఫెషనల్ అనుభవించిన అమెరికా బీ1/బీ2 టూరిస్ట్ వీసా రిజెక్షన్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముంబైలోని అమెరికా కాన్సులేట్‌లో కేవలం 90 సెకన్లలో ముగిసిన ఇంటర్వ్యూలో ఒక్క ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోవడమే ఈ నిరాకరణకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.

ఈ బాధితుడు సెప్టెంబర్ 1న రెడిట్ వేదికగా తన ఇంటర్వ్యూ అనుభవాన్ని పంచుకున్నాడు. తన ప్రొఫైల్ వివరాల ప్రకారం.. అతడు డిజిటల్ ప్రొడక్ట్ మేనేజర్‌గా స్థిరమైన ఉద్యోగం చేస్తున్నాడు. వైవాహికంగా అవివాహితుడు. సుమారు మూడు వారాల పాటు చికాగో, మిచిగాన్, నయాగరా జలపాతాలను సందర్శించాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ పర్యటనకు అయ్యే ఖర్చులన్నింటినీ తానే భరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇది అతడికి మొదటి అంతర్జాతీయ ప్రయాణం కావడం గమనార్హం.

ఆగస్టు 25న బయోమెట్రిక్స్ పూర్తి చేసుకుని.. సెప్టెంబర్ 1న ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. కాన్సులర్ అధికారి మొదట కొన్ని సాధారణ ప్రశ్నలు అడిగారు. భారత్‌లో లేదా తిరిగి వెళ్లే సమయంలో ఏదైనా ప్రమాదం ఉందా అని అడగ్గా 'లేదు' అని సమాధానం ఇచ్చాడు. ఆపై అతడి వృత్తి, అమెరికాలో ఒక స్నేహితుడు ఉన్న విషయాన్ని ధృవీకరించుకున్నారు.

అయితే ఇంటర్వ్యూ చివరగా అధికారి అడిగిన ప్రశ్నే మొత్తం ఆటను మార్చేసింది. "మీ మొదటి అంతర్జాతీయ గమ్యస్థానంగా అమెరికానే ఎందుకు ఎంచుకున్నారు?" అని అధికారి ప్రశ్నించారు. దానికి సమాధానంగా అతడు చికాగో స్కైలైన్, నయాగరా ఫాల్స్ చూడాలనుకుంటున్నానని.. తన మూడు వారాల ట్రిప్‌కు ఈ ప్రదేశాలు సరిపోతాయని చెప్పాడు. ఈ సమాధానం ఇచ్చిన కొద్దిసేపటికే వీసా నిరాకరిస్తున్నట్లు తెలియజేస్తూ సెక్షన్ 214(బీ) కింద రిఫ్యూజల్ నోటీసును చేతిలో పెట్టారు.

వీసా తిరస్కరణ తర్వాత తన దరఖాస్తును విశ్లేషించుకున్న అతడు కొన్ని కీలక విషయాలను అంగీకరించాడు. 'అమెరికాకు ఎందుకు?' అనే ప్రశ్నకు సాధారణ పర్యాటక ప్రాంతాల పేర్లు చెప్పడం కంటే భారత్‌లో తనకున్న ఉద్యోగ బాధ్యతలు, కంపెనీ ఇచ్చిన లీవ్ అప్రూవల్, పర్యటన ముగిశాక తిరిగి రావాల్సిన బలమైన కారణాలను స్పష్టంగా వివరించి ఉంటే బాగుండేదని భావించాడు. అంతేకాకుండా మొదటిసారి విదేశీ ప్రయాణం కావడం.. పెళ్లి కాకపోవడం, అక్కడ స్నేహితుడు ఉండటం వంటి అంశాలు కూడా అధికారికి అనుమానాన్ని కలిగించి ఉండవచ్చని తెలుసుకున్నాడు.

ఈ ఘటన అమెరికా బీ1/బీ2 వీసా కోసం దరఖాస్తు చేసే వారికి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతోంది. కేవలం మంచి ఉద్యోగం లేదా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండటం మాత్రమే వీసాను గ్యారెంటీ చేయవు. పర్యటన పూర్తయ్యాక స్వదేశానికి తప్పక తిరిగి వస్తామనే నమ్మకాన్ని కాన్సులర్ అధికారికి కలిగించడమే అత్యంత కీలకమైన అంశం.

Tags:    

Similar News