కొత్త ముఖ్యమంత్రి ‘కోమటిరెడ్డి’

మా ఇంట్లో నుండి మమ్మల్నే వెల్లగొంటాలని చూస్తున్నారా ? నేను మాత్రం చూస్తూ ఊరుకోను’ అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Update: 2026-09-02 13:27 GMT

‘కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని పార్టీలో ఉన్న అసలైన నేతలను పక్కన పెడుతున్నారు. ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కొందరు నేతలు పార్టీని కబ్జా చేస్తున్నారు. మా ఇంట్లో నుండి మమ్మల్నే వెల్లగొంటాలని చూస్తున్నారా ? నేను మాత్రం చూస్తూ ఊరుకోను’ అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన స్వగ్రామం బ్రాహ్మణవెల్లెంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరే సమయంలో, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నాకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. కానీ నెరవేరలేదు అని రాజగోపాల్ రెడ్డి అన్నాడు. మంత్రి పదవి కోసం గత కొన్నాళ్ళుగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

అదే సమయంలో ‘నాకు పదవుల మీద ఆశలేదని, సమయం వచ్చినప్పుడు అవే వెతుక్కుంటూ వస్తాయని, తాను భవిష్యత్తులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానాన్ని అధిగమిస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పదవుల కంటే రాజకీయాల్లో, ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు రావడం ముఖ్యమని, పేద ప్రజల సమస్యలు పక్కనపెట్టి, సొంత ప్రయోజనాల కోసం పనిచేసే సంస్కృతి మారాలని, అభివృద్ధి పనులు నిలిచిపోయిన విషయంలో తాను గళం విప్పుతూనే ఉంటానని రాజగోపాల్ రెడ్డి అన్నాడు.

రాజగోపాల్ రెడ్డి ఒక వైపు పదవులు అడగను అంటూనే అధిష్టానం ఇవ్వడం లేదని లేదా సమయం వచ్చినప్పుడు అవే వస్తాయని, మంత్రి కాదు ఏకంగా ముఖ్యమంత్రి అవుతానని అంటున్నాడు. కొండా సురేఖ అంశం ఢిల్లీలో అధిష్టానం ముందు పరిశీలనలో ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ఆయన గతంలోనూ బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం పెరిగిందని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వారు కీలక పదవుల్లో ఉన్నారని, నిజమైన ఉద్యమకారులు అణచి వేయ బడుతుందని, మునుగోడు అభివృద్ధికి నిధులు ఇవ్వకుంటే బాంబు పేలుస్తానని, యాదాద్రి ఆలయ బోర్డు ఏర్పాటుపై తనను సంప్రదించలేదని అన్నారు.

రెండు రోజుల క్రితం ఎక్స్ స్పేస్ లో తెలంగాణలో కొత్త రాజకీయ శక్తి వస్తుందని, అందులో తన పాత్ర కీలకంగా ఉంటుందని, తమిళనాడు మాదిరిగా తెలంగాణ రాజకీయాలు మారాలని, అవినీతి గ్రామీణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వ్యాపించిందని, రాజకీయ నాయకుల ఆలోచన విధానం మారాలని అనడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుంది ? కోమటిరెడ్డి మంత్రి పదవి కల నెరవేరుతుందా ? అన్నది వేచిచూడాలి.

Tags:    

Similar News