విజయసాయిరెడ్డి యూటర్న్.. రాజీనామా స్థానం నుంచి మళ్లీ రాజ్యసభకు?
రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్వయంగా ప్రకటించిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ పునరాగమనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.;
వైసీపీ మాజీ నేత వి.విజయసాయిరెడ్డి యూటర్న్ తీసుకుంటున్నారా? రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన విజయసాయిని.. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దక్షిణ భారతదేశంలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఏపీలో వీలైనంత ఎక్కువ మందిని సమీకరించుకోవాలని ప్లాన్ చేస్తోందని చెబుతున్నారు. దీంతో వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకుని ఆయన రాజీనామా చేసిన స్థానం నుంచే మళ్లీ రాజ్యసభకు పంపాలని ప్లాన్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది.
రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్వయంగా ప్రకటించిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ పునరాగమనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న విజయసాయిరెడ్డి ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే ఆయనను బీజేపీలో చేర్చుకుని ఏపీలో వైసీపీ అసమ్మతి నేతలను ఆకర్షించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని దక్షిణాదికి ఇవ్వాలని భావిస్తున్న బీజేపీ, ఈ ప్రాంతంలో పలుకుబడి ఉన్న నేతలను పార్టీలో చేర్చుకుని వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన పోటీదారుగా అవతరించాలని ప్రణాళిక రచిస్తోందని అంటున్నారు.
వైసీపీ ఆవిర్భావం నుంచి కొనసాగిన విజయసాయిరెడ్డి కొద్దినెలల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. వైసీపీలో నెంబర్ 2 పొజిషనులో పనిచేసిన ఆయన రాజకీయాల నుంచే వైదొలగుతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో నాలుగేళ్లు పదవీ కాలం ఉంటుండగా, రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగుతుందని ప్రచారం జరుగుతున్న వేళ.. విజయసాయిరెడ్డి రాజకీయ పునరాగమనంపై చర్చ మొదలైంది. వాస్తవానికి వైసీపీకి రాజీనామా చేసిన సమయంలోనే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన అప్పట్లో ఆ ప్రచారాన్ని ఖండించారు. అయితే రాజకీయాల్లో ఔనంటే కాదని.. కాదంటే ఔననే అర్థంగా అభివర్ణిస్తున్న విశ్లేషకులు విజయసాయిరెడ్డి-బీజేపీ మధ్య ఏదో జరుగుతోందని అనుమానిస్తున్నారు.
వైసీపీలో ఉండగా, విజయసాయిరెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా లిక్కర్ స్కాంతోపాటు, కాకినాడ సీపోర్టు వాటాల బదిలీపై విజయసాయిరెడ్డిపై అనుమానాలు ఉన్నాయి. కాకినాడ సీపోర్టు విషయంలో ఆయనపై సీఐడీ విచారణ కూడా జరుగుతోంది. ఇదే సమయంలో లిక్కర్ స్కాంలో తనకు సంబంధం లేదని, ఆ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా వైసీపీ నేత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ బాంబు పేల్చారు విజయసాయిరెడ్డి. ఆయన ఇలా వైసీపీ నేతలను ఇరికించేలా ప్రకటనలు చేయడం వెనుక వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న కుంభకోణాలపై తాను సహకరిస్తానని కూటమి ప్రభుత్వానికి సంకేతాలు పంపడంతోపాటు తాను బీజేపీలో చేరేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూసుకోవడమే వ్యూహం అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి పునరాగమనంపై జరుగుతున్న ప్రచారం ఆసక్తిరేపుతోంది. ఇది నిజమో? కాదో? విజయసాయిరెడ్డి క్లారిటీ ఇవ్వాల్సివుందని అంటున్నారు.