ఎన్టీఆర్ తర్వాత.. విజయ్ రికార్డు.. ఏంటది?
తెలుగు నాట దివంగత ఎన్టీఆర్ సాధించిన ప్రభంజనం తర్వాత.. అంతే ప్రభంజనం.. ఇప్పుడు తమిళనాట విజయ్‌కే దక్కుతుందని అంటున్నారు పరిశీలకులు.;
తెలుగు నాట దివంగత ఎన్టీఆర్ సాధించిన ప్రభంజనం తర్వాత.. అంతే ప్రభంజనం.. ఇప్పుడు తమిళనాట విజయ్‌కే దక్కుతుందని అంటున్నారు పరిశీలకులు. దివంగత ఎన్టీఆర్.. 1982లో తెలుగు దేశం పార్టీని ప్రారంభించి.. కేవలం ఏడాది కాలంలో 1983లో జరిగిన ఉమ్మడి ఏపీ ఎన్నికల్లో 201 స్థానాల్లో విజయం దక్కించుకుని భారీ ప్రభంజనాన్ని, ఓట్ల సునామీని సృష్టించారు. ఆ తర్వాత.. తాజాగా తమిళనాడులో తమిళ వెట్రి కళగం(టీవీకే)పేరుతో పార్టీ పెట్టిన రెండేళ్లలో విజయ్ అంతే ప్రభంజనం సృష్టించారని పరిశీలకులు చెబుతున్నారు.
తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే మెజారిటీ మార్కుకు దగ్గరవుతున్న తరుణంలో, ఆ పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌కి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినీ దిగ్గజం ఎన్టీఆర్‌కి మధ్య ఒక ప్రత్యేకమైన సారూప్యత ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు తర్వాత, తన సొంత పార్టీని స్థాపించిన రెండేళ్లలోనే ఎన్నికల విజయం సాధించిన రెండవ వ్యక్తిగా విజయ్ నిలిచారు.
తమిళనాట.. దివంగత ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ 1972లో తన సొంత పార్టీ అయిన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కగళంఏఐఏడీఎంకే)ను స్థాపించినప్పటికీ, ఆయన 1977లో అధికార పీఠాన్ని అధిష్టించారు. అంటే దాదాపు ఐదేళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చింది. కానీ, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ, తన ప్రత్యర్థులైన డీఎంకే, ఏఐఏడీఎంకేల వంటి బలమైన పార్టీలను పక్కకు తోసి.. ముందంజలో దూసుకుపోయారు. 234 మంది సభ్యులున్న సభలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీకి 118 మంది ఎమ్మెల్యేలు అవసరం.టీవీకే సొంతంగా 111 మంది సభ్యులను గెలుచుకుంది.
తన పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే, ఎన్టీఆర్ అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 1983 అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించి, 27 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికారు. 1983 జనవరి 9న ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. రెండేళ్ల క్రితం తన పార్టీని స్థాపించిన విజయ్ దాదాపు అదే ఫలితాన్ని అందుకున్నారని పరిశీలకులు చెబుతున్నారు. కానీ, అదే తమిళనాడులో విజయ్ కంటే ముందు అనేక మంది సినీ నటులు పార్టీ పెట్టినా.. ఇటువంటి విజయాన్ని సాధించలేకపోయారు.
దక్షిణాది రాష్ట్రాల్లో సినీ నటులు రాజకీయాల్లోకి ప్రవేశించడం అసాధారణమేమీ కాదు. అయితే, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చాలా మంది నటులు ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. సూపర్‌స్టార్ చిరంజీవి 2008లో తన సొంత పార్టీ 'ప్రజా రాజ్యం'ను ప్రారంభించగా, అది 2011లో కాంగ్రెస్‌లో విలీనమైంది. ప్రజా రాజ్యం 2009 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి 18 స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత, చిరంజీవి క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.
తమిళనాడులో సీనియర్ నటుడు కమల్ హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యం(ఎం.ఎన్.ఎం)ను స్థాపించారు. ఆయన 2021 అసెంబ్లీ ఎన్నికలలో కోయంబత్తూరు సౌత్ నుండి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత, ఆయన డీఎంకేతో పొత్తు పెట్టుకుని 2025లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 'కెప్టెన్'గా పేరుగాంచిన మరో ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ 2005లో దేశీయ మురపోక్కు ద్రవిడ కళగం(డీఎండీకే)ను స్థాపించారు. మరుసటి సంవత్సరం జరిగిన తన తొలి ఎన్నికల బరిలో, డీఎండీకే మంచి పోటీ ఇచ్చినా.. విజయకాంత్ మాత్రమే వృద్ధాచలం నుండి గెలుపొందారు. ఇతర నేతలు ఓడిపోయారు.