తమిళ పాలిటిక్స్ లో పవర్ స్టార్.. దళపతి విజయ్ తో కీలక మంత్రాంగం?

తమిళనాడులో అధికార డీఎంకే, విపక్షం అన్నాడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటములు ప్రధానంగా తలపడనున్నాయని చెబుతున్నారు.;

Update: 2026-03-09 14:45 GMT

ఎన్నికల వేళ తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో సినీ నటుడు విజయ్ కొత్తగా ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని ఎన్డీఏ కూటమిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని, ఇటు ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, అన్నాడీఎంకే, అటు టీవీకే విజయ్ తో పవన్ ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఎ అధికారంలో భాగస్వామ్యం కావాలంటూ గతంలో విజయ్ చేసిన ప్రకటనతో కూటమి కట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని అనుకున్నారు. అయితే ఆ తర్వాతి పరిణామాల్లో తాను ఒంటరిగానే పోటీ చేస్తానని విజయ్ ప్రకటించారు. ఈ గందరగోళం మధ్య తాజాగా విజయ్ ఎన్డీఏలో చేరనున్నారంటూ మళ్లీ విస్తృత ప్రచారం జరగడం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది.

తమిళనాడులో అధికార డీఎంకే, విపక్షం అన్నాడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటములు ప్రధానంగా తలపడనున్నాయని చెబుతున్నారు. ఈ రెండు పార్టీలకు దీటుగా దళపతి విజయ్ పార్టీ టీవీకే నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అధికార డీఎంకేను గద్దె దించి ప్రభుత్వాన్ని స్థాపించాలని భావిస్తున్న ఎన్డీఏ కూటమికి విజయ్ పార్టీ గుబులు పుట్టిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి డీఎంకే లాభపడుతుందనే అనుమానం ఎన్డీఏ కూటమి పార్టీలను ఆందోళనకు గురిచేస్తున్నాయని అంటున్నారు. విజయ్ టీవీకే పార్టీ పెట్టిన కొత్తలో కూటమి రాజకీయాలకు సై అన్నారు. ఆ సమయంలో డీఎంకే కూటమిలోని కాంగ్రెస్, కమ్యూనిస్టులు విజయ్ పార్టీతో జట్టుకట్టే సంకేతాలు ఇవ్వడంతో ఎన్డీఏ కూటమి హ్యాపీగా ఫీలైందని అంటున్నారు.

అయితే డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యూహాత్మకంగా పావులు కదిపి విజయ్ ను రాజకీయంగా ఒంటరిని చేశారని అంటున్నారు. కాంగ్రెస్ కు అదనంగా మూడు సీట్లు ఇచ్చి కూటమి నుంచి జారిపోకుండా కాపాడుకున్నారని చెబుతున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకే అసంతృప్త నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వంటివారిని పార్టీలోకి ఆహ్వానించి పట్టు పెంచుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తమ కూటమిని బలోపేతం చేయడానికి ఎన్డీఏ నేతలు టీవీకే పార్టీపై ఫోకస్ చేశారని అంటున్నారు.

ఎన్డీఏ కూటమిలో విజయ్ ను చేర్చుకోవడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికకు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారు. దీంతో విజయ్ తో మంతనాలు సాగించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను రంగంలోకి దించినట్లు తమిళ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ సిని నటులే కావడం, రాజకీయంగా సొంత పార్టీలు పెట్టుకుని సొంతంగా ఎదిగే భావజాలం ఉన్నవారు కావడంతో వారి మధ్య చర్చలు మంచి ఫలితం ఇచ్చేవిగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పవన్, విజయ్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయని, తుది నిర్ణయం తీసుకోవడానికి దళపతి కొంత సమయం అడిగారని అంటున్నారు.

ఇదే సమయంలో కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి సీబీఐ నోటీసులు జారీ చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారమే ఢిల్లీ రమ్మంటూ విజయ్ కు సీబీఐ నోటీసులు పంపగా, బిజీ షెడ్యూల్ వల్ల పది రోజులు సమయం కావాలంటూ విజయ్ విన్నవించారని చెబుతున్నారు. ఆయన వినతిపై సీబీఐ కూడా సానుకూలంగా స్పందించిందని, ఇవన్నీ పరిశీలిస్తే విజయ్-బీజేపీ మధ్య సహృద్భావ వాతావరణం నెలకొనే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఎన్డీఏలో విజయ్ చేరనున్నారనే ప్రచారంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కొట్టిపడేస్తున్నారు. తమ రెండు పార్టీల మధ్య ఎటువంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News