ఖజానా ఖాళీ...కొత్త సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు !
తమిళనాడుకు కొత్త సీఎం గా సి జోసెఫ్ విజయ్ బాధ్యతలు స్వీకరించారు. రాజకీయాల్లో అనుభవం లేదు, రాజకీయ పార్టీలతో సాన్నిహిత్యం లేదు, రాజకీయ కుటుంబం అంతకంటే కాదు.;
తమిళనాడుకు కొత్త సీఎం గా సి జోసెఫ్ విజయ్ బాధ్యతలు స్వీకరించారు. రాజకీయాల్లో అనుభవం లేదు, రాజకీయ పార్టీలతో సాన్నిహిత్యం లేదు, రాజకీయ కుటుంబం అంతకంటే కాదు. కేవలం రెండేళ్ళ క్రితం ఒక పార్టీని పెట్టుకుని జనం ముందుకు వచ్చిన విజయ్ ఈ రోజు ఎనిమిది కోట్ల మంది ఉన్న తమిళనాడు వంటి దక్షిణాదిన అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన ద్రవిడ వాదానికి ఆ ముఖ్యమంత్రుల పరంపరంకు చెక్ పెడుతూ విజయ్ సరికొత్త రాజకీయం ఆరంభించారు. తాను సామాన్యుడిని అని సీఎం అంటే కామన్ మ్యాన్ అంటూ ఒక కొత్త అర్ధం విజయ్ చెప్పారు.
ఘాటు విమర్శలు :
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించింది అని విజయ్ ముఖ్యమంత్రిగా తన తొలి ప్రసంగంలో ఘాటు విమర్శలు చేశారు. తమిళనాడు రాష్ట్రం అప్పు ఏకంగా పది లక్షల కోట్ల దాకా ఉంది అని ఆయన చెప్పారు. ఖజానా అంతా ఖాళీ చేసి పెట్టారని కూడా అన్నారు. అందుకే తాను తొందరలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తాను అని విజయ్ ప్రకటించారు.
హామీలను నెరవేస్తాను :
అదే సమయంలో విజయ్ మరో విషయంలో స్పష్టత ఇచ్చారు. తాను హామీలు అన్నీ నెరవేరుస్తాను అన్నారు. తనకు కొంత వ్యవధి కావాలని ఆయన కోరారు. అయితే సీఎం గా ఆయన ప్రమాణం చేసిన వెంటనే తొలి హామీ ఉచిత విద్యుత్ ని నెరవేరుస్తూ మొదటి సంతకం చేశారు. దీని వల్ల పేదలకు నెలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. దాంతో హామీల పర్వంలో విజయ్ తన నిజాయితీని చాటుకున్నట్లు అయింది. అదే సమయంలో తాను చెప్పిందే చేస్తాను తప్ప మోసం చేయను అని అన్నారు. తాను ఎక్కడ నుంచి దిగి రాలేదని ప్రజల నుంచే వచ్చాను అని ఆయన చెప్పారు.
అన్ని మతాలు ఒక్కటే :
కుల మతాల విషయంలో టీవీకే ఫిలాసఫీని ముఖ్యమంత్రిగా విజయ్ మరో సారి వినిపించారు, తనకు అన్ని మతాలు కులాలు ఒక్కటే అన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ముఖమే విజయ్ ముఖమని ఆయన పేర్కొన్నారు. అలాగే నిజమైన లౌకిక, సామాజిక న్యాయం తో కూడిన కొత్త యుగం ఈ రోజు నుంచే తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభమైందని ఆయన చెప్పుకొచ్చారు.
సుస్థిర ప్రభుత్వమే :
విజయ్ టీవీకే పార్టీకి మెజారిటీ లేదు, చిన్న పార్టీలతో కలిపి కూడి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీని మీద ప్రజలకు ఆయన సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. తన ప్రభుత్వం రాజకీయంగా సుస్థిరమైనది అన్నారు. ఎలాంటి డౌట్లు ఎవరూ పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన భోరసా ఇచ్చారు. ఇలా చెప్పడం ద్వారా అయిదేళ్ళ పాటు టీవీకే ప్రభుత్వం కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు అన్న మాట. అధికార కేంద్రం ఒక్కటే అని విజయ్ మరో విషయం స్పష్టం చేశారు.
శతృవులు లేరు :
తనకు గిట్టని వారు కానీ శతృవులు కానీ ఎవరూ లేరని విజయ్ మరో క్లారిటీ ఇచ్చారు. అంటే రాజకీయంగా ప్రతీకారాలు ఉండవని ఆయన భరోసా ఇచ్చినట్లు అయింది. ప్రభుత్వం ప్రజల కోసం అని పేద వారి సంక్షేమం కోసమని విజయ్ చెబుతున్నారు. పేదల ఆకలి తనకు తెలుసు తనది కూడా సామాన్యమైన కుటుంబమే అని ఆయన వివరించారు. తాను చేయగలిగిందే చెబుతాను తప్ప ఎవరినీ మోసం చేయను అని ఆయన అన్నారు. చీకటి రాజకీయలు అంతకంటే చేయను అన్నారు. ఏది అయినా ప్రజలతోనే నేరుగా పంచుకుంటాను అని చెప్పారు. ఇక మహిళా భద్రతకు ప్రధమ ప్రాధాన్యత అని ఆయన చెప్పారు. తనను అన్నగా మామగా ఆదరించిన యువత డ్రగ్స్ బారిన పడకుండా ఈగిల్ లాంటి ఒక కఠినమైన చట్టాన్ని తీసుకుని వస్తామని విజయ్ పేర్కొన్నారు.