సినీ దర్శకుడి పొలిటికల్ ఎంట్రీకి దళపతి చెక్! సీఎం విజయ్ అనూహ్య నిర్ణయం

తమిళ రాజకీయాలతో సినీ రంగానికి విడదీయరాని అనుబంధం. ఆ రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల్లో సినీ నేపథ్యం ఉన్న కుటుంబాలదే హవా.

Update: 2026-08-20 08:30 GMT

తమిళ రాజకీయాలతో సినీ రంగానికి విడదీయరాని అనుబంధం. ఆ రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల్లో సినీ నేపథ్యం ఉన్న కుటుంబాలదే హవా. అధికార టీవీకే పార్టీని స్థాపించిన స్టార్ హీరో దళపతి విజయ్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే రికార్డును తిరగరాసి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న రెండు పార్టీల్లో డీఎంకే పార్టీది సుదీర్ఘ చరిత్ర. ఈ పార్టీకి దశాబ్దాలుగా నాయకత్వం వహించిన కరుణానిధి రచయితగా సినీ రంగంలో మంచి తెచ్చుకున్నవారే. ఇక ఇంకో ప్రతిపక్షం అన్నాడీఎంకే సైతం సినీ ప్రముఖుడు ఎంజీఆర్ స్థాపించగా, సినీ కథానాయికగా పనిచేసిన జయలలిత సుదీర్ఘ కాలం నాయకత్వం వహించారు. ఈ విధంగా తమిళనాడులో ప్రతి పార్టీకి సినీ పరిశ్రమతో అనుబంధం ఉందని చెబుతారు. ఇక ప్రస్తుత ప్రభుత్వంలో కూడా సినీ ప్రముఖులకు పెద్దపీట వేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ స్థాపించిన టీవీకే తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ దర్శకుడు ఆసక్తి చూపగా, సీఎం విజయ్ తిరస్కరించారని సమాచారం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.

ముఖ్యమంత్రి దళపతి విజయ్ కి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే బస్సీ ఆనంద్ కథనం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ తరఫున పోటీకి ప్రముఖ దర్శకుడు ఆసక్తి చూపారట. అయితే అప్పటికే ఆయన పోటీ చేయడానికి ముందుకు వచ్చిన నియోజకవర్గంలో ఒక నాయకుడు రెండేళ్లుగా పనిచేస్తుండటంతో అధినేత విజయ్ ఆ దర్శకుడికి టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పారని అంటున్నారు. దీంతో ఆ దర్శకుడు ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారని బుస్సీ ఆనంద్ చెప్పారు. ఈ విధంగా తన సన్నిహితులు కంటే కార్యకర్తలు, పార్టీ కోసం కష్టపడిన నాయకులకే దళపతి విజయ్ ప్రాధాన్యమిస్తారని ఎమ్మెల్సీ బుస్సీ ఆనంద్ చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యే కథనం ప్రకారం ముఖ్యమంత్రి దళపతి విజయ్ పార్టీ నడపడంలో నిబద్ధత గల కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తారని చెప్పుకున్నా, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి చాన్స్ దొరకని దర్శకుడు ఎవరు? అంటూ పెద్ద చర్చే జరుగుతోంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి విజయ్ తన సన్నిహితులకు అనేక పదవులు ఇస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ముందుగా ప్రముఖ జ్యోతిషుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ ను ఓఎస్డీగా నియమించారు. అయితే ఈ నియామకంపై విమర్శలు చెలరేగడంతో వెంటనే రద్దు చేశారు. ఆ తర్వాత సీఎం సన్నిహితుడు ప్రముఖ కొరియాగ్రాఫర్, నటుడు రాఘవేంద్ర లారెన్స్ కూడా రాజకీయాల్లోకి వస్తానని స్వయంగా ప్రకటించారు. అయితే ఆయన విషయంలోనూ సీఎంపై విమర్శలు రావడంతో లారెన్స్ రాజకీయ ప్రవేశం వాయిదా వేసుకున్నారు. అదేవిధంగా జననాయగన్ నిర్మాతను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడం కూడా వివాదాస్పదమైందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో తన సన్నిహితుడైన దర్శకుడు రాజకీయాల్లోకి వస్తానన్న దళపతి తిరస్కరించారనే సమాచారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎంతో మందికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడిన దర్శకుడికి ఏ కారణంతో అవకాశం ఇవ్వలేకపోయారనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది. అదే సమయంలో ఎమ్మెల్యేగా పోటీకి ఆసక్తి చూపిన ఆ నేత ఎవరనేది తెలుసుకోడానికి నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు బుస్సీ ఆనంద్ వ్యాఖ్యలను పోస్టు చేసిన వీడియో కింద పలువురి పేర్లను కామెంట్ చేస్తున్నారు. ఇందులో లోకేశ్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, హెచ్.వినోద్ వంటివారి పేర్లను ఊహిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన వారు సీనియర్ దర్శకుడు అయి వుంటారని, ప్రస్తుతం కెరీర్ విజయవంతంగా నడుస్తున్న యువ దర్శకులు అలాంటి ఆలోచన చేసి ఉండే అవకాశం లేదని అంటున్నారు. మొత్తానికి రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన తన సన్నిహిత దర్శకుడిని వద్దని విజయ్ వారించినట్లు జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోందని అంటున్నారు.

Tags:    

Similar News