అన్నా డీఎంకేతోనే విజయ్ కి సేఫ్ !

విజయ్ రాజకీయ అనుభవం కేవలం రెండేళ్ళు మాత్రమే. ఆయన విశేషమైన ప్రజాదరణ ఉన్న వారే కావచ్చు.;

Update: 2026-05-05 18:11 GMT

విజయ్ రాజకీయ అనుభవం కేవలం రెండేళ్ళు మాత్రమే. ఆయన విశేషమైన ప్రజాదరణ ఉన్న వారే కావచ్చు. కానీ ప్రభుత్వం నడపడం అన్నది అంత ఈజీ కాదు. పాలన వేరు. ఇక తొలిసారిగా అధికారంలోకి వచ్చిన వారికి పాలన పట్ల పట్టు పెంచుకోవాలీ అంటే రాజకీయంగా ఇబ్బందులు ఉండకూడదు. అంటే కంఫర్టబుల్ గా సంఖ్యా బలం ఉండాలి. రాజకీయంగా స్టెబిలిటీ ఉంటే పాలనలో మెల్లగా మెరుగులు దిద్దుకుంటూ అడుగులు వేయవచ్చు. లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు వస్తాయి. వైసీపీకి 2019లో 151 సీట్లతో ప్రజలు భారీ ఆధిక్యత ఇచ్చారు కాబట్టి పూర్తిగా తాము అనుకున్నట్లుగా చేయగలిగింది. అలాగే తమిళనాడులో ఎంజీఅర్ అయినా జయలలిత అయినా పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు.

విజయ్ పరిస్థితి వేరు :

ఇపుడు చూస్తే విజయ్ పరిస్థితి అలా కాదు, ఆయనను ప్రజలు అధికారం ముంగిట పెట్టారు. నిజానికి సీట్ల సంఖ్య తక్కువ పడితే ప్రభుత్వం నడపడం ఒక విశేషమైన అనుభవం ఉన్న వారికే సాధ్యం. తొలిసారిగా వచ్చిన వారికి అలాంటి కఠిన పరీక్షలు పెట్టడం సుతరామూ తప్పే అవుతుంది. కానీ విజయ్ కి ఆ పరీక్ష ముందే వచ్చింది. అయితే విజయ్ ఇక్కడ తాను నమ్మిన సిద్ధాంతాలు అని ఊగిసలాడుతున్నారు. అన్నా డీఎంకేకి దూరం పాటించాలని అనుకుంటున్నారు. చిన్న పార్టీలతో చెలిమి చేస్తే మంచిది అని కూడా లెక్క వేసుకుంటున్నారు. కానీ విజయ్ పార్టీకి కనీసంగా కావాల్సింది 10 మంది ఎమ్మెల్యేలు అయినా స్పీకర్ గా ఒకరిని ఎన్నుకోవాలి. దాంతో స్పీకర్ ఓటు పోతుంది,

టఫ్ టాస్క్ తోనే :

అలాగే విజయ్ రెండు చోట్ల గెలిచారు. దాంతో మరో సీటు పోతుంది. నికరంగా ఉన్నవి 106 సీట్లు మాత్రమే. అంటే అక్కడికి 12 మంది ఎమ్మెల్యేలు తక్కువ అవుతారు. వారిని ఏదో విధంగా చిన్న పార్టీల అండతో తెచ్చి నిలుపుకున్నా ఏ ఒక్కరో రేపటి రోజున అలిగి జారుకున్నా లేక జంప్ అయినా మొత్తం ప్రభుత్వానికే ముప్పు అవుతుంది. అది దిన దినగండంగా మారుతుంది. అపుడు పాలన గురించి ఫోకస్ కాదు ఎవరూ గూటి నుంచి జారకుండా వారి మీదనే ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. విజయ్ వంటి ఔత్సాహీకుడికీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారికీ ఈ పరీక్షలు చాలా టఫ్ గా మారుతాయని అంటున్నారు.

అన్నా డీఎంకేతో చెలిమి :

ఇదిలా ఉంటే విజయ్ అన్నా డీఎంకేతో చెలిమి చేస్తే కనుక అక్కడి అనుభవం అక్కరకు వస్తుంది. పైగా 51 మంది ఎమ్మెల్యేలు హ్యాపీగా ఈ వైపుకు వస్తారు. దాంతో బలం కాస్తా 108 ప్లస్ 51 అంటే 159 మంది బ్రహ్మాండంగా ఉంటుంది. రాజకీయంగా పూర్తి స్థిరత్వం ఉంటుంది. మెజారిటీ వైపు అసలు చూసుకో నక్కరలేదు. అదే సమయంలో పాలన మీద కూడా బాగా దృష్టి పెట్టవచ్చు. ఇక జనాలు పూర్తి మెజారిటీ ఇవ్వలేదు, విజయ్ పోరాడింది కూడా అధికార డీఎంకేతో. దాంతో విపక్షంలో ఉన్న మరో పక్షాన్ని కలుపుకుని పోవడం తప్పు కానే కాదు అని అంటున్నారు.

పవర్ షేరింగ్ అడిగితే :

అయితే అన్నా డీఎంకేలో మాజీ సీఎం పళని స్వామి ఉన్నారు. ఆయన తనకు కనీసంగా రెండేళ్ళు అయినా సీఎం గా చాన్స్ ఇవ్వమని పొత్తు కండిషన్లు పెట్టొచ్చు అన్న చర్చ ఉంది. ఒకవేళ అలా కాకపోయినా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక శాఖలను కూడా ఇవ్వమని కోరవచ్చు. అది కొంత చికాకు పెట్టే విషయమే. అన్నా డీఎంకే తో కలిస్తే తాజాదనం విజయ్ ప్రభుత్వానికి కొంత తగ్గవచ్చు. వారి ప్రభావం పడవచ్చు. కానీ ఏదో కాడికి అన్నా డీఎంకేతో పొత్తులను తేల్చుకుని ఉప ముఖ్యమంత్రి పదవి అయినా వారికి ఇచ్చి కలుపుకుంటే ప్రభుత్వం ముందు స్థిరంగా ఉంటుంది. ఆనక మంచి పాలన గురించి ఆలోచన చేయవచ్చు. ఇది అంతా అంటున్న విషయం. మరి విజయ్ ఏ విధంగా ఆలోచిస్తారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News