విజయ్ ను లాగేసే పనిలో అమిత్ షా.. తమిళనాట సరికొత్త రాజకీయం

తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ రాజకీయాలకు సవాల్ విసిరేలా అమిత్ షా తాజా పర్యటన సాగింది.;

Update: 2026-01-06 06:42 GMT

తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ రాజకీయాలకు సవాల్ విసిరేలా అమిత్ షా తాజా పర్యటన సాగింది. ఒకవైపు అధికార డీఎంకే, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే మధ్య నలుగుతున్న తమిళ రాజకీయాల్లోకి మూడో ప్రత్యామ్మాయంగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే నటుడు విజయ్ రాకను బీజేపీ ఒక అవకాశంగా మలుచుకోవాలని చూస్తోంది.

ద్రావిడ కోటకు బీటలు వేసే ‘ష్యా’ వ్యూహం

బీజేపీ అగ్రనేత అమిత్ షా తన పర్యటనలో రాష్ట్ర నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కేవలం హిందూత్వ కార్డుతోనే కాకుండా.. యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ వంటి నేతలను కలుపుకొని వెళ్లడం ద్వారా ద్రావిడ పార్టీల ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చని బీజేపీ యోచిస్తోంది. యువత, తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు ఈ ప్లాన్ చేస్తోంది.. ఎన్డీఏ కూటమిని విస్తరించి విజయ్ ను కీలక భాగస్వామిని చూస్తోంది.

మెల్లగా మెత్తబడుతున్న విజయ్?

విజయ్ తన రాజకీయ ప్రవేశంలో బీజేపీ, డీఎంకే రెండింటినీ విమర్శించారు. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవన్నది అనుభవజ్ఞుల మాట. అమిత్ షా పర్యటన తర్వాత బీజేపీ అధిష్టానం విజయ్ టీమ్‌తో టచ్‌లోకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ మాత్రం తన పార్టీ స్వతంత్రతను కాపాడుకోవాలని భావిస్తున్నారు. పొత్తు జరిగితే అది కేవలం సీట్ల సర్దుబాటుకే పరిమితమవుతుందా? లేక అధికార భాగస్వామ్యానికి దారితీస్తుందా? అన్నది కీలక ప్రశ్నగా మారింది.

బీజేపీతో కలిసి వెళ్తే విజయ్‌కు జాతీయ స్థాయిలో మద్దతు లభించే అవకాశం ఉంది. అయితే తమిళనాడులో బలమైన ద్రావిడ సెంటిమెంట్ కారణంగా మైనారిటీ, సెక్యులర్ ఓట్లపై ప్రభావం పడే ప్రమాదమూ ఉంది. ఈ రెండింటినీ తూకం వేసుకుంటూ విజయ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్?

ఢిల్లీ పెద్దలతో విజయ్ భేటీ కాబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ పొత్తు కుదిరితే విజయ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి కూడా బీజేపీ వెనకాడకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తద్వారా అన్నాడీఎంకే ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవచ్చని కమలనాథుల లెక్క.

భవిష్యత్తు ఏంటి?

ప్రస్తుతానికి విజయ్ ఒంటరిపోరు అని చెబుతున్నా.. అమిత్ షా మార్క్ రాజకీయ చాణక్యం ముందు ఆయన ఎంతకాలం నిలబడుతారనేది ఆసక్తికరం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తమిళనాడులో డీఎంకే కూటమి వర్సెస్ ఎన్డీఏ విజయ్ తో కలిపి అన్నట్లుగా పోరు మారే సూచనలు కనిపిస్తున్నాయి.

అమిత్ షా వ్యూహాలు, విజయ్ క్రేజ్ కలిస్తే తమిళనాడులో కొత్త చరిత్ర లిఖించబడుతుందా? లేక ద్రావిడ భావజాలం ముందు ఈ కొత్త ప్రయోగాలు విఫలమవుతాయా? అన్నది కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News