నితీష్ కుమార్ రాజకీయ వారసుడు ఎంట్రీ ?

రెండు రోజుల క్రితం తన 75వ పుట్టిన రోజును జరుపుకున్న బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాజకీయ వారసుడిని కూడా తెర మీదకు తెస్తున్నారు;

Update: 2026-03-03 13:30 GMT

రెండు రోజుల క్రితం తన 75వ పుట్టిన రోజును జరుపుకున్న బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాజకీయ వారసుడిని కూడా తెర మీదకు తెస్తున్నారు. ఇప్పటి రెండున్నర దశాబ్దాలుగా సుదీర్ఘమైన ముఖ్యమంత్రిత్వం నెరుపుతున్న నితీష్ కుమార్ రానున్న కాలంలో తన వారసత్వాన్ని జేడీయూ నాయకత్వాన్ని అందుకునే విధంగా ఏకైక కుమారుడు నిశాంత్ కుమార్ ని రాజకీయ తెర మీదకు తెస్తున్నారు. నిశాంత్ కుమార్ ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఆయన ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేసుకుంటున్నారు. నితీష్ కూడా తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తేవాలని ఎన్నడూ అనుకోలేదు.

జేడీయూ నుంచి ఒత్తిడి :

అయితే జేడీయూ నేతల నుంచి క్యాడర్ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. నితీష్ కుమార్ తరువాత పార్టీని నడిపించాలంటే నిశాంత్ ని రాజకీయాల్లోకి తీసుకుని రావాలని వారంతా డిమాండ్ చేస్తూ వచ్చారు. దాంతో ఎట్టకేలకు నితీష్ కుమార్ కూడా అంగీకరించారని అంటున్నారు. దాంతో తన కుమారుడిని ప్రత్యక్ష రాజకీయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే జేడీయూ తరఫున రాజ్యసభకు నిశాంత్ కుమార్ ని పంపుతారు అని పార్టీ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తోంది.

అన్ని సీట్లూ ఎన్డీయేకే :

ఇదిలా ఉంటే బీహార్ లో 2025 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే స్వీప్ చేసింది. మొత్తం అసెంబ్లీలో 200 కి పైగా సీట్లు సాధించింది. ప్రతిపక్షానికి పెద్దగా చోటు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో త్వరలో వస్తున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అన్ని సీట్లను గెలుచుకుంటుందని అంటున్నారు. ఈ సీట్లను బీజేపీ జేడీయూ కలసి పంచుకుంటాయి. జేడీయూ సీట్లలో ఒకటి నితీష్ కుమార్ రాజకీయ వారసుడిగా ఉన్న నిశాంత్ కుమార్ కి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది. తన తండ్రికి సాయంగా రాజకీయాల్లోకి వచ్చేందుకు నిశాంత్ కుమార్ సైతం ఉత్సాహంగా ఉన్నారని అంటున్నారు.

పార్టీ బాధ్యతలు కూడా :

అంతే కాదు జేడీయూ పార్టీ బాధ్యతలను సైతం నిశాంత్ కుమార్ కి అప్పగిస్తారు అని అంటున్నారు. ఆయనకు ప్రముఖ స్థానంలో కూర్చోబెట్టడానికి రంగం సిద్ధం అయింది అని అంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన పేరు ప్రకటించవచ్చు అని ఊహాగానాలు సాగుతున్నాయి. జేడీయూ పూర్తిగా కొనసాగాలి అంటే కనుక నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి రావడం అనివార్యం అని జేడీయూ నేతలు అభిప్రాయపడుతున్నారు. నితీష్ కుమార్ ది అయిదు దశాబ్దాల రాజకీయ జీవితం. బీహార్ ప్రజలకు అభిమాన నేతగా ఆయన బలమైన ముద్ర వేశారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటే కనుక బీజేపీ అక్కడ పూర్తి ఆధిపత్యం చలాయించేందుకు వీలు అవుతుందని ఇంతకాలం భావించారు. కానీ ఇపుడు నితీష్ రాజకీయ వారసుడు రంగ ప్రవేశం చేయడంతో రానున్న రోజులలో ఏమి జరుగుతుంది అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలలో రాజకీయ వారసత్వం అన్నది పెద్ద విషయం కాదు, దాంతో నితీష్ వారసుడు కూడా వస్తున్నారు అని అంటున్నారు. అయితే అది ఆలస్యంగా జరుగుతోంది అని మాత్రమే అంతా వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News