ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్.. కేవలం ఆయిల్ మీదే కాదు అంతకు మించి !
అమెరికా, ఇజ్రాయిల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యతో ఇరాన్ ప్రతీకారేచ్చతో రగులుతోంది.;
అమెరికా, ఇజ్రాయిల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యతో ఇరాన్ ప్రతీకారేచ్చతో రగులుతోంది. అమెరికాను నేరుగా టార్గెట్ చేయకుండా.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ లపైన దాడులు చేస్తోంది. ఫలితంగా యూఏఈ, సౌదీఅరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతర్ లాంటి దేశాల్లో యుద్ధ వాతావారణం నెలకొంది. అమెరికా- ఇరాన్ వార్ కారణంగా భారతదేశం ఇబ్బందులను ఎదుర్కోక తప్పదన్న వాదన ఉంది. ఈ ఇబ్బందులు కేవలం ఆయిల్ దిగుమతులకు మాత్రమే పరిమితం కాదని, మరికొన్ని కీలక అంశాల్లో భారత్ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్న విశ్లేషణ ఉంది.
ద్విముఖ వ్యూహం :
భారతదేశానికి అవసరమైన ఆయిల్ లో 80 శాతం దిగుమతులు నుంచి వస్తుంది. అందులో ప్రధాన భాగం ఇరాన్ పక్కనే ఉన్న హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించి భారత్ కు చేరుకుంటుంది. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ ఆంక్షలు విధించింది. కీలకమైన హార్మూజ్ జలసంధి నీటి అడుగు భాగంలో మైన్స్ అమర్చినట్టు ప్రకటించింది. అదే సమయంలో పలు నౌకలపై దాడి చేసింది. దీంతో నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు సాధారణంగా రిస్క్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారీగా పెరిగాయి. ఇన్సూరెన్స్ సంస్థలు ఇన్సెరెన్స్ కవర్ చేయడానికి వెనకడుగు వేస్తున్నాయి. దీంతో ముడి చమురు దిగుమతులు ఇబ్బందికరంగా మారుతాయి.
మరోవైపు ఇరాన్ వ్యూహాత్మకంగా అమెరికాకు మద్దతుగా ఉన్న గల్ఫ్ దేశాలపై దాడి చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ అయిన సౌదీ ఆరామ్కో పై దాడి చేయడంతో కంపెనీని తాత్కాలికంగా మూతవేశారు. ఒకవైపు హార్మూజ్ జలసంధిలో ఆంక్షలు, మరోవైపు గల్ఫ్ దేశాల్లో దాడులతో చమురు సరఫరా వ్యవస్థను ఇరాన్ టార్గెట్ చేసింది. దీని ఫలితంగా భారత్ లో పెట్రోలియం, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఇది కేవలం పెట్రోల్, డీజిల్ కు పరిమితం కాదు. ముడి చమురు ద్వారా దాదాపు 5000 ఉప ఉత్పత్తులు తయారవుతాయన్నది ఒక అంచనా. ఆ ఉప ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. దీంతో అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇది ఆర్బీఐపై ఒత్తిడిని పెంచుతుంది.
ఎగుమతులపై ప్రభావం
భారత దేశానికి సౌదీ అరేబియా కీలక వాణిజ్య భాగస్వామి. దాదాపు రూ. 2లక్షల కోట్ల ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు గల్ఫ్ మార్కెట్ పై ఆధారపడి ఉంటాయి. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షల కారణంగా ఎగుమతులు ఆలస్యం అవుతాయి. ఆలస్యమైతే ఖర్చు పెరుగుతుంది. మరోవైపు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుంది. ఫలితంగా లాభాలు తగ్గుతాయి. లాభాలు తగ్గితే ఫారిన్ రిజర్వ్స్ తగ్గుతాయి. ఇప్పటికే భారత్ వద్ద తగినన్ని ఫారిన్ రిజర్వ్స్ ఉన్నప్పటికీ ముడి చమురు ధరలు పెరిగితే, డాలర్ రిజర్వులు తగ్గుతాయి. అదే సమయంలో డాలర్ బలపడుతుంది. ఆయిల్ ధరలు పెరిగే కొద్దీ డాలర్ కు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఆయిల్ దిగుమతులన్నీ డాలర్ తో నడుస్తాయి. డాలర్ డిమాండ్ పెరిగితే రూపాయి విలువ తగ్గుతుంది. ఇప్పుడు 90 రూపాయలకు అటు ఇటు ఉన్న విలువ.. 100కు చేరే అవకాశం ఉందన్న చర్చ ఉంది.
గల్ఫ్ లోని భారతీయులపై ఎఫెక్ట్
గల్ఫ్ దేశాలకు, ఇరాన్ కు మధ్య ఎలాంటి యుద్ధం లేకపోయినప్పటికీ, గల్ఫ్ దేశాలు అమెరికాకు మద్దతు ఇస్తున్నాయన్న కారణంగా ఇరాన్ శత్రువుగా చూస్తోంది. వ్యూహాత్మకంగా గల్ఫ్ దేశాలపై దాడి చేస్తే అది చమురు సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తుందని, ఫలితంగా చమురు ధరలు పెరిగి ప్రపంచ దేశాలన్నింటి మీద ద్రవ్యోల్భణం ఒత్తిడి పడుతుందన్న ఆలోచనతో గల్ఫ్ దేశాలను ఇరాన్ టార్గెట్ చేసింది. దీని ఫలితంగా గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న 90 లక్షల మంది భారతీయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడుతాయి. అప్పుడు వారి నుంచి భారత్ కు వచ్చే ఫారిన్ రిజర్వ్స్ పడిపోతాయి.
ఎరువుల భారం
ఖతర్ దేశం నుంచి భారత్ పెద్ద ఎత్తున ఎల్ ఎన్ జీ గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. హార్మూజ్ జల సంధి వద్ద ఆంక్షలు సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా గ్యాస్ ధరలు పెరుగుతాయి. గ్యాస్ ధరలు పెరిగితే యూరీయా తయారీ ఖర్చు పెరుగుతుంది. యూరియా తయారీలో ఎల్ ఎన్జీ గ్యాస్ కీలకం. ఇప్పటికే ప్రభుత్వం ఎరువులపై భారీగా సబ్సీడీ ఇస్తోంది. ఈ భారం మరింత పెరగనుంది.
గోల్డ్ భారం
ప్రభుత్వం గతంలో సావరిన్ గోల్డ్ బాండ్స్ ను ఇష్యూ చేసింది. ప్రజలు ఆ బాండ్స్ కొనుగోలు చేశారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో గోల్డ్ ధర భారీగా పెరిగింది. ప్రభుత్వం ఈ పరిస్థితిని ముందే అంచనా వేయలేకపోయింది. ఇప్పుడు ఆ బాండ్స్ ను రిడంమ్ప్షన్ చేసుకుంటే ప్రజలకు ఇప్పుడున్న ధరల మేరకు ప్రభుత్వం చెల్లించాలి. దీని ఫలితంగా ప్రభుత్వంపై భారీగా భారం పడనుంది.
ఇన్ని సమస్యల మధ్య ఉపశమనం ఏంటంటే కేవలం ఇరాన్ నుంచి మాత్రమే కాకుండా రష్యా నుంచి కూడా ఆయిల్ దిగుమతులు చేసుకోవడం. ఇప్పటికే కొంత నిల్వలు భారత్ వద్ద ఉండటం. విదేశీ మారక నిల్వలు కూడా తగినంత ఉండటం మరికొంత ఊరటనిచ్చే అంశం. అదే సమయంలో ఇరాన్ టార్గెట్ చేసిన గల్ఫ్ దేశాలు సాధారణంగా యుద్ధ పిపాసులు కాదు. యుద్ధానికి దూరంగా ఉంటాయి. అందుకే ఆ దేశాలు ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్నాయి. ఇరాన్ దాడి నేపథ్యంలోనే రియాక్ట్ అవుతున్నాయి. వీలైనంత వరకు యుద్ధం చేయకుండా ఉండాలని గల్ఫ్ దేశాలు భావిస్తాయి. యుద్ధం చేయకపోవడం గల్ఫ్ దేశాలకున్న అడ్వాంటేజ్.