లోకేశ్ ‘జీరో రైస్’ ఫిట్‌నెస్.. ఎన్ని కిలోలు తగ్గారంటే..?

తన వెయిట్ లాస్ సీక్రెట్ ను యువనేత తాజాగా బయటపెట్టారు. దీంతో జంక్ ఫుడ్, ఊబకాయం సమస్యలతో సతమతమవుతున్న యువతీయువకులు లోకేశ్ డైట్ సీక్రెట్ గురించి విస్తృతంగా చర్చించుకుంటున్నారు.

Update: 2026-06-05 10:45 GMT

తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ లుక్‌లో ఊహించని మార్పు కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉండగా చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు ముందు నుంచే బాడీ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన లోకేశ్, ఈ మధ్య మరీ స్లిమ్‌గా మారిపోయారని అంటున్నారు. అంతేకాదు మునుపటి కంటే చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు. ఒకప్పుడు చాలా బొద్దుగా ఉండే లోకేశ్ ఏకంగా 30 కిలోల బరువు తగ్గారు. దీనికోసం ఆయన సెపరేట్ డైట్ ప్లాన్ చేసుకున్నారు. తన వెయిట్ లాస్ సీక్రెట్ ను యువనేత తాజాగా బయటపెట్టారు. దీంతో జంక్ ఫుడ్, ఊబకాయం సమస్యలతో సతమతమవుతున్న యువతీయువకులు లోకేశ్ డైట్ సీక్రెట్ గురించి విస్తృతంగా చర్చించుకుంటున్నారు.

లోకేశ్ కామెంట్స్ వైరల్

సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు అన్నం పరిమాణాన్ని తగ్గిస్తారు. కానీ లోకేశ్ ఏకంగా రైస్‌కు పూర్తిగా దూరమయ్యారు. తాజాగా తన డైట్ ప్లాన్‌పై స్పందించిన లోకేశ్.. "నేనసలు రైస్ తినను, జీరో రైస్" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నం తన ఆహార జాబితా నుంచి పూర్తిగా తొలగించడమే తన తాజా వెయిట్ లాస్ వెనుక ఉన్న ముఖ్య కారణమని ఆయన స్పష్టం చేశారు. అధిక బరువు సమస్యను ఎప్పుడో అధిగమించినప్పటికీ, ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలనే ఆలోచనతోనే ఆయన ఈ సరికొత్త ‘జీరో రైస్’ డైట్‌ను ఫాలో అవుతున్నట్లు చెబుతున్నారు.

‘వన్‌ మీల్ ఏ డే’ ఫార్ములా

లోకేశ్ తన బరువును, ఫిట్‌నెస్‌ను అదుపులో ఉంచుకోవడానికి కొన్నాళ్లుగా 'ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్' అనే ప్రసిద్ధ పద్ధతిని అనుసరిస్తున్నారు. తన బిజీ షెడ్యూల్‌ను బట్టి ఆయన రోజులో 16:8 లేదా 18:6 ఫాస్టింగ్ పద్ధతులను పాటిస్తున్నారని చెబుతున్నారు. అంటే రోజులో 16 నుంచి 18 గంటల పాటు ఏమీ తినకుండా కఠినమైన ఉపవాసం ఉంటూ, మిగిలిన 6 నుంచి 8 గంటల వ్యవధిలో మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఇందులో భాగంగానే ఆయన 'వన్‌ మీల్ ఏ డే' విధానాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. రోజుకు కేవలం ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకుంటూ తన బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)ను సమతుల్యంగా ఉంచుకుంటున్నారు. అయితే, ఆ ఒక్క పూట తినే భోజనంలో రైస్ లేకుండా చూసుకుంటూ.. శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉండేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారని చెబుతున్నారు.

నిపుణులు ఏమంటున్నారు?

ఇక లోకేశ్ డైట్ ప్లాన్ పై నిపుణులు కూడా పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, జీరో రైస్ డైట్ వల్ల శరీరంలో మెటబాలిజం అద్భుతంగా మెరుగుపడుతుందని, బరువు తగ్గడానికి ఇది అత్యంత వేగవంతమైన, సురక్షితమైన మార్గమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, రోజుకు ఒక్క పూటే భోజనం చేసేటప్పుడు ఆ ఆహారంలో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలని, లేదంటే నీరసం లేదా పోషకాహార లోపం వచ్చే ప్రమాదం ఉంటుందని సూచిస్తున్నారు.

Tags:    

Similar News