చిన్ని Vs నాని... బ్రదర్స్ మధ్య మళ్లీ లొల్లి!

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆయన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) మధ్య మళ్లీ ట్వీట్ వార్ మొదలైంది.

Update: 2026-06-05 11:13 GMT

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆయన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) మధ్య మళ్లీ ట్వీట్ వార్ మొదలైంది. దాదాపు ఏడాది విరామం తర్వాత ఈ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు చేసుకుంటుండగా, వారి సన్నిహితులు కూడా పరుష వ్యాఖ్యలతో కామెంట్లు పెడుతూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఎంపీ చిన్న అనుచరుల మధ్య అక్రమ సంపాదన విషయమై గొడవలు జరుగుతున్నాయని, ఓ వ్యక్తి చేతులపై యాసిడ్ తో దాడి చేశారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ నాని అనుచరుడు పెట్టిన వాట్సాప్ సందేశం తీవ్ర రచ్చకు దారితీసిందని చెబుతున్నారు. ఇదే వ్యవహారంపై జాతీయ మానవహక్కుల సంఘంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీ నాని.

ఎంపీ చిన్ని, మాజీ ఎంపీ నాని సొంత అన్నదమ్ములే అయినప్పటికీ, రాజకీయంగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని అంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. కానీ, తమ్ముడు, ఎంపీ చిన్నిని టార్గెట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఏం అయిందో కానీ, నాని కొన్నాళ్లుగా సైలెంటు అయ్యారు. దాదాపు ఏడాది క్రితం ఎంపీ చిన్ని టార్గెట్ గా వరుస ట్వీట్ లు పెడుతూ తమ్ముడిని గుక్క తిప్పుకోనీయకుండా చేశారని అంటున్నారు. ఇదే సమయంలో ఎంపీ చిన్ని కూడా అదే స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య ఫైట్ తో విజయవాడ రాజకీయం వాడివేడిగా ఉండేది.

ఇక ఏడాదిగా ఇద్దరి మధ్య డైలాగ్ వార్ కు విరామం వచ్చిందని అంటున్నారు. ఇదే సమయంలో ఎంపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ కేశినేని నాని అనుచరుడిపై ఎంపీ చిన్ని అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం మధ్యాహ్నం మాజీ ఎంపీ అనుచరుడి నుంచి ఎంపీ చిన్ని అనుచరుడికి వాట్సాప్ లో ఓ సందేశం వచ్చినట్లు చెబుతున్నారు. అందులో రూ.27 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించి ఆరోపణలు చేయడంతోపాటు ఓ వ్యక్తిపై యాసిడ్ దాడి జరిగిందని, దీనికి సంబంధించి కొందరు వ్యక్తులు పరారీలో ఉన్నారని ఆ సందేశంలో పేర్కొన్నారు.

ఈ విషయం ఎంపీ దృష్టికి వెళ్లడంతో వాట్సాప్ లో సందేశం పంపిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్నాళ్లుగా సైలెంటుగా ఉన్న మాజీ ఎంపీ నాని రంగంలోకి దిగారని చెబుతున్నారు. నా చిన్ననాటి స్నేహితుడిపై తప్పుడు ఆరోపణలతో క్రిమినల్ కేసులు పెడుతున్నారని, ముందస్తు సమాచారం లేకుండా ఆయన ఇంటిలో పోలీసులు తనఖీలు చేస్తున్నారని మండిపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును ట్యాగ్ చేస్తూ జాతీయ మానవహక్కుల కమిషన్ కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మరో పోస్టు చేస్తూ ఎంపీ అక్రమ సంపాదనపై తీవ్ర ఆరోపణలు చేశారు.

దీంతో స్పందించిన ఎంపీ చిన్న ఘాటుగా స్పందించారు. ‘కొందరు తమ జీవితాలను పుకార్లు సృష్టించడంలో ఇతరులను రెచ్చగొట్టడంలో ప్రతికూలతలను వ్యాప్తి చేయడంలో అవే అబద్దాలను పదేపదే చెప్పడంలో గడిపేస్తారు. నేను నా జీవితాన్ని నిర్మాణానికి సేవ చేయడానికి ఫలితాలను అందించడానికి విజయవాడను ముందుకు నడిపించడానికి కేటాయించాలని ఎంచుకున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ఎంపీకి మద్దతుగా ఆయన అనుచరులు సైతం భారీగా ట్వీట్ చేశారు. అటు మాజీ ఎంపీ అనుచరులు సైతం అంతే దీటుగా స్పందించడంతో గురువారం రోజంతా ఇద్దరి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు హోరెత్తాయి.




Tags:    

Similar News