ఉదయనిధి ఎఫెక్ట్.. సీఎం విజయ్ పై ట్రోలింగ్

ప్రధానంగా విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ శాసనసభలో ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలను సీఎం విజయ్ లైట్ గా తీసుకున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

Update: 2026-05-12 14:30 GMT

తమిళనాడు రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి క్లీన్ ఇమేజ్ తో ముఖ్యమంత్రి అయిన దళపతి విజయ్ బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ప్రధానంగా విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ శాసనసభలో ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలను సీఎం విజయ్ లైట్ గా తీసుకున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఒక మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉదయనిధి మాట్లాడితే, సభలోనే ఉన్న విజయ్ సరిగా స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తమ అసమ్మతిని బాహటంగా వ్యక్తం చేస్తున్న నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లతో సీఎం విజయ్ తీరును ఎండగడుతున్నారు.

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై మంగళవారం తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో సభలో సీఎం విజయ్ ఉన్నప్పటికీ మౌనంగా ఉన్నారని, ఉదయనిధి మాట్లాడుతుండగా రెండు చేతులతో దండం పెట్టి చూస్తూ ఉండిపోయారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయనిధి తీరును ఓ వర్గం వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో సైతం విస్తృత చర్చ జరుగుతోంది. ఉదయనిధి కామెంట్స్ పై సరిగా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం విజయ్ ను భారీ ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు.

ఉదయనిధి ప్రసంగం ముగిసిన వెంటనే మాట్లాడిన సీఎం విజయ్ విపక్ష నేత తీరును తప్పుపట్టకపోవడం, ఆయన వ్యాఖ్యలను దాటవేసే ప్రయత్నం చేశారని నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. ఉదయనిది వ్యాఖ్యలను ఖండించాల్సిందిపోయి దండం పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిస్టియానిటీని నిర్మూలించాలని డిమాండ్ చేస్తే ఇలానే మౌనంగా ఉండిపోతారా? అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. దీంతో ఉదయనిధి వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగుతోందని అంటున్నారు.

ఉదయనిధి తీరును తప్పు పట్టడమే కాకుండా, సీఎం మౌనంగా ఉండటాన్ని నిరసిస్తూ ‘ఎక్స్’లో ఓ నెటిజన్ ఆసక్తికరంగా కామెంట్ చేశాడు. నటనకు, నాయకత్వానికి చాలా తేడా ఉందని చెబుతూ, ‘‘సినిమాల్లో అన్యాయంపై గొంతె ఎత్తే పాత్రల్లో చూసి మురిసిపోయాం, కానీ, అసెంబ్లీలో కోట్లాది మంది మనోభావాలను కించపరుస్తుంటే రెండు చేతులు జోడించి మౌనంగా ఉండటం చూస్తుంటే ఇది రీల్ లైఫ్ కాదు రియల్ లైఫ్ అని అర్థమవుతోంది. మౌనం అంటే అంగీకరించడమేనా సీఎం గారూ?’’ అంటూ ప్రశ్నించాడు.

ఇక మరో యూజర్ ఫేస్‌బుక్‌లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఉదయనిధి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు విజయ్ దండం పెడుతూ ఉండిపోయారు. ఆ దండం సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ పెట్టిందా? లేక మిత్రపక్షాన్ని నొప్పించకూడదని భయంతో పెట్టిందా? ఈ మౌనం వెనుక ఉన్న రాజకీయం ప్రజలకు అర్థం కాదనుకోవడం మీ భ్రమ.’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకప్పుడు తన మాటలతో సభను ఉర్రూతలూగించిన నాయకుడు, నేడు వివాదాస్పద వ్యాఖ్యలను ఆపలేక కేవలం ఒక ప్రేక్షకుడిలా మిగిలిపోవడం విచారకరం. ముఖ్యమంత్రిగా అందరి మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత మీపై లేదా?’ అంటూ మరో యూజర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాజకీయాల్లోకి వస్తే మార్పు వస్తుందని ఆశించిన అభిమానులకు ఇది పెద్ద షాక్ అంటూ మరో అభిమాని రాసుకొచ్చాడు. ‘ఉదయనిధి గీత దాటుతున్నప్పుడు వారించాల్సిన బాధ్యత మీది. అలా కాకుండా దండం పెట్టి చూస్తూ ఉండిపోవడం మీ అసమర్థతను సూచిస్తోంది.’ అంటూ సోషల్ మీడియాలో సీఎం విజయ్ ని భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు.



Tags:    

Similar News