జైపూర్ విమానాశ్రయంలో వేధింపులు.. కారణం రోలెక్స్ వాచ్!
విదేశాల్లోని విమానాశ్రయాల్లో పలుమార్లు అవమానాలకు, వేధింపులకు గురైన భారతీయ ప్రముఖుల సంగతి తెలిసిందే.;
విదేశాల్లోని విమానాశ్రయాల్లో పలుమార్లు అవమానాలకు, వేధింపులకు గురైన భారతీయ ప్రముఖుల సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా దుబాయ్ కి చెందిన భారతీయ వ్యాపారవేత్త, రీగల్ గ్రూప్ చైర్మన్, ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ గ్రహీత వాసు ష్రాఫ్ (84) జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఓ బాధాకరమైన ఘటనను ఎదుర్కొన్నారు.
అవును... ఇటీవల ష్రాఫ్ ఓ ఫ్యామిలీ కార్యక్రమంతో పాటు, ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో ఆయన ధరించిన రోలెక్స్ వాచ్ విషయంలో కస్టమ్స్ అధికారులు ఆయనను వేధించారని అంటున్నారు. ఆ వాచ్ కు సంబంధించిన రసీదు, ధృవీకరణ పత్రం చూపించన్నపటికీ వదలలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీని విలువ సుమారు రూ.35.17 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో అతని న్యాయవాది, పలు మీడియా నివేదికల ప్రకారం.. జైపూర్ లోని కస్టమ్స్ అధికారులు ఆయనపై అక్రమ రవాణా ఆరోపణలు చేశారని.. ఈ క్రమంలో సుమారు నాలుగు గంటలకు పైగా ఆయనను వీల్ ఛైర్ లో నిర్భంధించారని అంటున్నారు.
ఆ సమయంలో ఆయనకు నీరు, మెడిసిన్స్, రెస్ట్ రూమ్ వంటి ప్రాథమిక అవసరాలను సైతం నిరాకరించారని చెబుతున్నారు. దీంతో ఆయన కుటుంబ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. ఇదే సమయంలో ఎన్నారై సమాజం ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. చట్టపరమైన జోక్యం తర్వాత ఏప్రిల్ 19న ఈ గడియారాన్ని తిరిగి ఆయనకు అధికారులు అందించారు.
దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇందులో భాగంగా ష్రాఫ్ పట్ల కస్టమ్స్ అధికారులు అమానవీయంగా ప్రవర్తించారని.. అందువల్ల వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్.ఎస్.యూ.ఐ. జాతీయ ప్రతినిధి నిఖిల్ రూపరేల్.. మహిళా కాంగ్రెస్ ముంబై జనరల్ సెక్రటరీ ప్రీతి చోక్సీ సంయుక్తంగా డిమాండ్ చేశారు.