పాన్ మసాలా కింగ్ కోడలి మృతి కేసులో షాకింగ్ ఆరోపణలు
ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ప్రముఖ పాన్ మసాలా బ్రాండ్ కమలా పసంద్‌కు చెందిన వ్యాపార కుటుంబంలో జరిగిన కోడలి ఆత్మహత్య కేసు ఇప్పుడు ఊహించని మలుపులు తిరిగింది.;
ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ప్రముఖ పాన్ మసాలా బ్రాండ్ కమలా పసంద్‌కు చెందిన వ్యాపార కుటుంబంలో జరిగిన కోడలి ఆత్మహత్య కేసు ఇప్పుడు ఊహించని మలుపులు తిరిగింది. మొదట్లో సాధారణ భార్యాభర్తల గొడవల ఫలితంగా భావించిన ఈ ఘటన తాజాగా మృతురాలి సోదరుడు చేసిన సంచలన ఆరోపణలతో మరింత క్లిష్టంగా మారింది.
అత్తింటి వేధింపులు.. శారీరక హింస ఆరోపణలు
మృతురాలి సోదరుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ తన సోదరిని ఆమె అత్తింటివారు తీవ్రంగా వేధించేవారని ఆరోపించారు. మాటలతో పాటు శారీరకంగా కూడా హింసించేవారని ఆయన వెల్లడించారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమెను కోల్‌కతాలోని పుట్టింటికి తీసుకెళ్లినా "ఇకపై ఇలా జరగదు" అని నమ్మబలికి అత్తింటివారు మళ్లీ ఢిల్లీకి తీసుకెళ్లారని, అయితే పరిస్థితి మారలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భర్తపై కీలక ఆరోపణలు: అక్రమ సంబంధం.. రహస్య రెండో పెళ్లి
ఈ కేసులో అత్యంత షాకింగ్ అంశం ఏమిటంటే.. మృతురాలి భర్తపై ఆమె సోదరుడు చేసిన ఆరోపణలు. భర్తకు ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని మాత్రమే కాక, రహస్యంగా రెండో పెళ్లి కూడా చేసుకున్నాడని, అంతేకాక ముంబైలో ఒక బిడ్డ కూడా ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. భర్త వ్యక్తిగత జీవితం, ఇంట్లో ఎదుర్కొంటున్న హింస ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయని సోదరుడు తెలిపారు.
లాయర్ ఖండన: 'నిరాధార ఆరోపణలు'
మరోవైపు, పాన్ మసాలా వ్యాపారి కుటుంబానికి చెందిన న్యాయవాది రాజేందర్ సింగ్ ఈ ఆరోపణలన్నింటినీ పూర్తిగా ఖండించారు. ఇవన్నీ కేవలం నిరాధార ఆరోపణలు మాత్రమేనని, రెండు కుటుంబాలు బాధలో ఉన్న సమయంలో ఇలాంటి నిందలు వేయడం సరికాదని ఆయన అన్నారు. మృతురాలు రాసిన నోట్‌లో ఎవరి పేరూ ప్రస్తావించకపోవడాన్ని, ఎవరినీ లక్ష్యంగా చేసుకోకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు.
దర్యాప్తులో కొత్త కోణం: డైరీ కీలకం
మృతురాలు ఆత్మహత్య చేసుకునే సమయంలో భర్త జిమ్‌కు, పిల్లలు స్కూల్‌కు వెళ్లారని తెలిసింది. ఘటనా స్థలంలో దొరికిన ఆమె డైరీలో 'రిలేషన్‌షిప్ ఇష్యూస్' అని రాసి ఉండటం, తాజాగా కుటుంబ సభ్యులు చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు దర్యాప్తును మరింత సీరియస్‌గా చేపట్టారు.పోస్ట్‌మార్టం నివేదిక, అత్తింటి, పుట్టింటి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, డైరీ వివరాలు..వీటన్నింటిని పరిశీలించి పోలీసులు త్వరలోనే అసలు నిజాలను వెలుగులోకి తీసుకురానున్నారు. ఈ హై ప్రొఫైల్ కేసులో అసలు దోషులు ఎవరో తేలాలంటే ఇప్పుడు పోలీసుల లోతైన దర్యాప్తుపైనే అందరి చూపు నిలిచింది. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.