వంగవీటి పేరు మారుమోగనుందా ?
వంగవీటి మోహన రంగా ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంది. ఆయన ఉద్యమ నాయకుడు.;
వంగవీటి మోహన రంగా ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంది. ఆయన ఉద్యమ నాయకుడు. కార్మికుల పేద వర్గాల నాయకుడు తరువాత ఎమ్మెల్యే. అది కూడా కేవలం మూడున్నరేళ్ళు మాత్రమే. అయితేనేమి ఆయన గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు వాకిట ఒక బలమైన ముద్ర వేసుకున్నారు. ఆయనని కోస్తా తలవని రోజు లేదు అన్నట్లుగా ఉంటుంది. ఆయన నాలుగు పదుల వయసులో మరణించారు. దివంగతులు అయి నాలుగు దశాబ్దాలకు దగ్గర పడుతోంది. కానీ వంగవీటి అంటే చాలు కోస్తా అంతా ఒక్క లెక్క లేస్తుంది. ఆ ఊపూ హుషారూ వేరు. అది సామాజిక బలం రాజకీయ బలగం కాదు, అంతకంటే ఎక్కువే అని అంటారు.
ఆయన పేరుతో జిల్లా :
నిజానికి ఈ ప్రతిపాదన వైసీపీ హయాంలో వచ్చింది. వైసీపీ ప్రభుత్వం 2022లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో విజయవాడకు ఆయన పేరు పెట్టాలని ఒక ప్రతిపాదన బలంగా వచ్చింది. అయితే ఎందుకో అది సాకారం కాలేదు. దాని మీద ఒక సామాజిక వర్గంలో అసంతృప్తిగానే ఉంది. ఇన్నాళ్ళకు ఆయన పేరుని ఒక జిల్లకౌ పెడతారు అని అంటున్నారు. అదే క్రిష్ణా జిల్లా అని చెబుతున్నారు.
జిల్లాల మార్పు చేర్పులు :
జిల్లాలలో మార్పులు చేర్పులు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఈ మంత్రివర్గ ఉప సంఘం అనేక రకాలైన ప్రతిపాదనలు పరిశీలించనుంది. జిల్లాలలో పర్యటనలు చేయనుంది. అయితే ఇప్పటికే చాలా ప్రతిపాదనలు ఉన్నాయని అంటున్నారు. అందులోని భాగమే వంగవీటి పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడం అని అంటున్నారు
క్రిష్ణా జిల్లాకు ఆ పేరు :
ఇక క్రిష్ణా జిల్లాకు వంగవీటి పేరుని పెడతారు అని అంటున్నారు. వంగవీటి మోహనరంగా క్రిష్ణా జిల్లా అని పెడతారా లేక క్రిష్ణా జిల్లాను పక్కనపెట్టి వంగవీటి జిల్లాగా పేర్కొంటారా అన్నది ఒక చర్చగా ఉంది అయితే ఆయన పేరు పెట్టాలని ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని చెబుతున్నారు.
పల్నాడుకు జాషువా పేరు:
మరో వైపు చూస్తె పల్నాడు జిల్లాకు జాషువా పేరుని పెడతారు అని అంటున్నారు. ఆయన అక్కడ వాసి పైగా గుర్రం జాషువా చరిత్రలో నిలిచిన మహా కవి. అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఆకాశానికి ఎగిసిన మహా కవి. అందుకే ఆయన పేరుని పల్నాడుకు పెడతారు అని అంటున్నారు. అలాగే బాపట్లకు స్వాతంత్ర్య సమర యోధుడు దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య పేరు పెడతారు అని అంటున్నారు. మొత్తం మీద భారీ మార్పులు చేర్పులు జరుగుతాయని అంటున్నారు. కొత్త ఏడాది సంక్రాంతి పండుగకు కొత్త జిల్లాలు కొత్త పేర్లతో జనం ముందు ఉంచుతారని అంటున్నారు.