వైసీపీలో చేరిక మీద రంగా కుమార్తె క్లారిటీ
ఏపీలో రాజకీయాలు వేడి గానే సాగుతున్నాయి. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి ఇరవై నెలలు దాటింది. అయినా ఎన్నికల హీట్ అయితే ఎక్కడా తగ్గలేదు.;
ఏపీలో రాజకీయాలు వేడి గానే సాగుతున్నాయి. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి ఇరవై నెలలు దాటింది. అయినా ఎన్నికల హీట్ అయితే ఎక్కడా తగ్గలేదు. మరో వైపు కొత్త తరం రాజకీయాల్లోకి రావాలని చూస్తోంది. పార్టీలు కూడా పెట్టేందుకు చాలా మంది నాయకులు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో దివంగత నేత వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
కార్తీక సమారాధనతో :
గత ఏడాది నవంబర్ లో జరిగిన కార్తీక సమారాధనలో ఆమె సడెన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సమావేశం కాస్తా రంగా ఆత్మీయుల భేటీగా మారింది. ఇక ఆనాడే ఆమె ఒక మాట చెప్పారు. రంగా రాధా ఆశయాలను తాను నెరవేరుస్తాను అని. రంగా రాధా మిత్ర మండలిని తిరిగి బలోపేతం చేయడం అందరినీ ఐక్యంగా ఉంచడం తన మొదటి లక్ష్యం అని అన్నారు. ఇక గత ఏడాది డిసెంబర్ 26న విశాఖలో రంగా నాడు పేరుతో ఒక భారీ సభను ఆమె నాయకత్వంలో నిర్వహించారు. రంగా ఆశయాలను సాధించాలంటే రంగా నాడు పార్టీగా మారాలని కొందరు అన్నారు కానీ ఆశాకిరణ్ మాత్రం రంగా ఆశయాలకే కట్టుబడి ఉంటామని చెప్పుకొచ్చారు.
వైసీపీ విషయంలో :
ఇదిలా ఉంటే ఆమె మీడియా ముందుకు వచ్చిన దగ్గర నుంచి వైసీపీలో చేరుతారు అన్న ప్రచారం అయితే సోషల్ మీడియాలో గట్టిగా ఊపందుకుంది. దానికి కారణం ఆమె సోదరుడు వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆమె ఆల్టర్నేషన్ వేదికను ఎంచుకుంటారు అని అంతా అనుకుని ఈ ప్రచారం మొదలెట్టారు. అయితే ఇది నెలలు గడచినా కూడా అలాగే సాగుతోంది కానీ ఎక్కడా ఆగడం లేదు. దాంతో వంగవీటి ఆశాకిరణ్ దీని మీద క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలో చేరడం లేదని అన్నారు. సోషల్ మీడియాలో ఈ విధంగా వస్తున్నవి పుకార్లు మాత్రమే అని ఆమె అన్నారు తన ఆలోచనలు రంగా రాధా మిత్రమండలిని ఒక్కటిగా చేయడం పటిష్టం చేయడం అని అన్నారు.
అన్ని వర్గాల కోసం :
రంగా అంటే అందరి వాడుగా ఆమె చెప్పారు. ఆయన ఒక వర్గానికి ఒక ప్రాంతానికి చెందిన వారు కారని ఆమె వివరించారు. రంగా అందరి కోసం పాటుపడ్డారు అని ఆమె చెప్పారు అందువల్ల తాను కూడా తన తండ్రి బాటలో అన్ని వర్గాలతో కలసి ప్రయాణం చేస్తాను అని చెప్పారు. తొందరలో తన రాష్ట్రవ్యాప్త పర్యటనలు ఉంటాయని ఆమె చెప్పారు. మొత్తం మీద చూస్తే ముందు రంగా మద్దతుదారులను అందరినీ ఒక్కటిగా చేయడం మీదనే ఆయన దృష్టి ఉందని అంటున్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉన్నందువల్ల ఆమె ఇప్పటి నుంచే భవిష్యత్తు ఆలోచనలు ప్రకటించరని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనతో పాటు అనేక మందిని కలుసుకోవడం వివిధ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను బట్టి ఆమె రాజకీయ భవిష్యత్తు ప్రకటనలు ఉండొచ్చు అని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే వైసీపీలో చేరడం మీద లేదు అని ఆమె క్లారిటీ అయితే ఇచ్చేశారు అని అంటున్నారు.