వంశీ యాక్టివ్.. 'జీరో' నుంచి స్టార్ట్ చేయాల్సిందేనా.. !
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. మళ్లీ యాక్టివ్ అయ్యారు. దాదాపు 18 మాసాల తర్వాత..;
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. మళ్లీ యాక్టివ్ అయ్యారు. దాదాపు 18 మాసాల తర్వాత.. ఆయన ప్రజల మధ్యకు వచ్చారు. వరుస విజయాలతో గన్నవరంలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న వంశీ.. టీడీపీ నాయకుడిగానే గుర్తింపు పొందారు. తర్వాత.. 2019లో విజయం దక్కించుకున్నాక.. ఆయన వైసీపీ బాట పట్టారు. ఇక, అప్పటి నుంచి ఆయన గ్రాఫ్ పెరిగిందా? అంటే.. సందేహమే. వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రజల మధ్య ఓటమి వంశీని కుంగదీసింది.
నిజానికి ఒక పడవ నుంచి మరో పడవ ఎక్కితే.. వేగం పుంజుకోవాలి. గ్రాఫ్ పెరగాలి. ఇది రాజకీయాల్లో ఉన్న నాయకులు ఆశించేది కూడా. కానీ, వంశీ వ్యవహారం మాత్రం డౌన్ ట్రెండ్‌నే తాకింది. ఇక, టీడీపీ సానుభూతి పరుడి అపహరణ, బెదిరింపుల కేసులో అరెస్టయి.. దాదాపు 11 మాసాలు విజయవాడ జైలుకే పరిమితం అయ్యారు. అతి కష్టం మీద బెయిల్ తెచ్చుకున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు మరోసారి తన హవాను పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
గత రెండు రోజులుగా యాక్టివ్ అయ్యారు. వివాహ కార్యక్రమాలకు హాజరు కావడంతో పాటు.. నియోజకవర్గంలో ప్రజలను కలుసుకునేందుకు రెడీ అయ్యారు. దీంతో గన్నవరం రాజకీయాలు ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ఇప్పుడు వేడెక్కనున్నాయన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. అయితే.. వంశీ ఏం చేస్తారన్నది చూడాలి. మరోవైపు.. వంశీ ఎలాంటి విమర్శలు చేసినా.. ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రెడీగా ఉన్నారు. వంశీ రాజకీయ అడుగులపై ఆయన నిశితంగా దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు.
ఏం చేసినా..
వంశీ ఏం చేసినా.. పోయిన ఇమేజ్ దక్కుతుందా? అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చాలా మంది ఆయన సామాజిక వర్గానికి చెందిన తటస్థులు.. వైసీపీలో ఉండడాన్ని సహించలేక పోతున్నారన్నది వాస్తవం. ''ఏదో ఒకరకంగా.. ఆయన మళ్లీ సైకిల్ ఎక్కాలని మేం కోరుకుంటున్నాం.'' అని ఒకప్పుడు వంశీకి.. అన్ని విధాలా సహకరించిన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యాపార వేత్త చెప్పడం గమనార్హం. అయితే.. దీనికి అవకాశం లేదు. చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించిన వారిలో వంశీ ఒకరు. సో.. ఇప్పుడు జీరో నుంచి ప్రారంభించి.. అడుగులు వేస్తే తప్ప.. వంశీ పుంజుకోవడం కష్టమన్నది కూడా.. ఆయన మాటే. మరి ఏం చేస్తారో చూడాలి.