H1B వీసా 2025 న్యూ రూల్స్ : అమెరికాలోని విద్యార్థులకు $100,000 రుసుము మినహాయింపుతో పెద్ద ఉపశమనం

అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ శాఖ (DHS) తాజాగా H-1B వీసా ఫీజు చెల్లింపులకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను ప్రకటించింది.;

Update: 2025-10-21 05:30 GMT

H1B వీసాపై $100,000 రుసుము అనగానే అందరి గుండెలు గుభేలుమన్నాయి. ఇండియన్ కరెన్సీలో 83 లక్షల రూపాయలు చెల్లించాలనే సరికి చాలా కంపెనీలు ఇక హెచ్1 బీ ఉద్యోగులను నియమించుకోమని డిసైడ్ అయ్యాయి. కొత్తగా వెళ్లేవారు.. అమెరికాలో ఉన్న వారు అసలు రూల్స్ ఏంటన్నవి తెలియక.. అర్థం కాక భయపడ్డారు. అయితే తాజాగా వచ్చిన రూల్స్ గైడ్ లైన్స్ ఈరోజు వచ్చినవి కావు. జనాలకు అర్థం కాక ఈ గందరగోళం నెలకొంది. అక్కడున్న వారికి డే 1 నుంచి ఇది ఉంది. కన్ఫ్యూజన్ లో ఈ హెచ్1బీపై $100,000 రుసుము విషయం ఆందోళన పెంచింది. ఇప్పుడు కొందరు దీనిపై కోర్టుకెక్కడంతో అమెరికా ప్రభుత్వం క్లియర్ గా గైడ్ లైన్స్ వివరించడంతో అందరికీ అలెర్ట్ వచ్చింది. కొత్తగా అమెరికా వచ్చేవారికే ఈ రూల్స్ అని .. పాత వారికి లేదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ శాఖ (DHS) తాజాగా H-1B వీసా ఫీజు చెల్లింపులకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా అమెరికాలో ఇప్పటికే పనిచేస్తున్న H-1B వీసాదారులు, ముఖ్యంగా భారతీయ టెకీలకు, భారీ ఆర్థిక భారం నుంచి ఊరట లభించింది.

* ఎవరికి మినహాయింపు లభించింది?

DHS మార్గదర్శకాల ప్రకారం, వివాదాస్పదంగా మారిన 100,000 డాలర్ల (సుమారు ₹83 లక్షలు) భారీ H-1B వీసా ఫీజు చెల్లింపు నుంచి కింది అభ్యర్థులకు మినహాయింపు లభించింది

ప్రస్తుత H-1B వీసా ఉద్యోగులు: అమెరికాలో ఇప్పటికే H-1B వీసాపై పనిచేస్తున్న ఉద్యోగులు.

వీసాలో మార్పులు కోరేవారు: తమ వీసాలో సవరణ, పొడిగింపు (రీన్యువల్) లేదా స్థితి మార్పు కోసం దరఖాస్తు చేసుకునేవారు.

F-1 నుంచి H-1B కి మారేవారు: విద్యార్థి వీసా (F-1) నుంచి H-1B స్థితికి మారేందుకు దరఖాస్తు చేసుకునే విదేశీ అభ్యర్థులు.

* ప్రయాణాలపై స్పష్టత

ప్రస్తుతం H-1B వీసా కలిగి ఉన్న ఉద్యోగుల అమెరికా ప్రవేశం లేదా బయటకు వెళ్లేవారిపై ఎటువంటి ఆటంకాలు ఉండవని కూడా DHS స్పష్టం చేసింది. ఈ స్పష్టత ఉద్యోగులకు వారి ప్రయాణ ప్రణాళికలలో స్థిరత్వాన్ని ఇస్తుంది.

* కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తింపు

అయితే, ఈ కొత్త నిబంధన కేవలం అమెరికా వెలుపల ఉండి, కొత్తగా H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని DHS పేర్కొంది. ఈ అభ్యర్థుల కోసం ఆన్‌లైన్‌ చెల్లింపు లింక్‌ను కూడా అందుబాటులో ఉంచారు.

* ట్రంప్ నిర్ణయంపై న్యాయ పోరాటం

ఈ స్పష్టత వెలువడటానికి ముందు, ట్రంప్‌ పరిపాలన విధించిన ఈ భారీ ఫీజు నిర్ణయంపై అమెరికాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అమెరికా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించింది. ఈ ఫీజు అమెరికా వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, నిపుణులైన సిబ్బంది కొరత ఏర్పడే ప్రమాదముందని సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. సెప్టెంబర్‌ 19న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేసిన ఈ ప్రకటనను పిటిషనర్లు “పూర్తిగా చట్టవిరుద్ధమైన నిర్ణయం”గా అభివర్ణించారు.

రెండో పెద్ద న్యాయపోరాటం

కొత్త H-1B నియమాలకు వ్యతిరేకంగా జరిగిన న్యాయ పోరాటాలలో ఇది రెండోది. అంతకుముందు ఉపాధ్యాయులు, మత సంస్థలు, కార్మిక సంఘాలు కూడా ట్రంప్‌ పరిపాలనను కోర్టులో సవాల్‌ చేశాయి.

అయితే ఈ ఫీజు ఒకే సారి చెల్లించాల్సినది మాత్రమేనని.. పాత వీసాలు లేదా రీన్యువల్‌ దరఖాస్తులకు వర్తించదని వైట్‌ హౌస్‌ గతంలోనే మీడియాకు స్పష్టం చేసింది.

* భారతీయులకు అధిక ప్రాధాన్యత

2024లో మొత్తం H-1B వీసా మంజూరుల్లో భారతీయుల వాటా 70 శాతానికి పైగా ఉండటం గమనార్హం. అమెరికా టెక్నాలజీ రంగంలో భారతదేశం నుంచి వచ్చిన నైపుణ్య కార్మికుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న భారతీయులకు ఈ తాజా మార్గదర్శకాలు ఆర్థికంగా, మానసికంగా పెద్ద ఉపశమనం అందించాయి.

Tags:    

Similar News