ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు ట్రంప్ షాక్... బ‌య‌టికొచ్చిన అమెరికా

అమెరికా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగింది. ఇక నుంచి డ‌బ్ల్యూహెచ్వోకు నిధులు ఆపేయ‌నుంది.;

Update: 2026-01-23 09:47 GMT

అమెరికా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగింది. ఇక నుంచి డ‌బ్ల్యూహెచ్వోకు నిధులు ఆపేయ‌నుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా ఉద్యోగుల‌ను వెన‌క్కి ర‌ప్పించ‌నుంది. డ‌బ్ల్యూహెచ్వో టెక్నాల‌జీ క‌మిటీలు, వ‌ర్కింగ్ గ్రూపుల నుంచి కూడా అమెరికా అధికారికంగా త‌ప్పుకున్నట్టు ప్ర‌క‌టించింది. ఇక నుంచి ప‌రిమిత ప‌రిధిలోనే డ‌బ్ల్యూహెచ్వోతో క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్టు అమెరికా వెల్ల‌డించింది. అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారం చేప‌ట్టిన రోజు నుంచి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతామ‌ని చెబుతూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అమెరికా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి బ‌య‌టికి వ‌చ్చింది.

కార‌ణం ఏమిటి ?

అమెరికా చెబుతున్న కార‌ణం.. కోవిడ్ సంద‌ర్భంగా మ‌హ‌మ్మారిని అదుపు చేయ‌డంలో, కీల‌క సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేయ‌డంలో డ‌బ్ల్యూహెచ్వో విఫ‌ల‌మైంద‌ని. కానీ ఇదే కార‌ణ‌మా ?. లేక వేరే కార‌ణం ఉందా అన్న చ‌ర్చ కూడా ఉంది. అయితే అమెరికా ప్ర‌క‌టించిన మాత్రాన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి బ‌య‌టికి వెళ్ల‌డం సులువు కాద‌ని డ‌బ్లూహెచ్వో ప్ర‌క‌టించింది. ఎందుకంటే అమెరికా డ‌బ్లూహెచ్వోకు దాదాపు రూ.2382 కోట్లు అప్పుగా ఉంది. ఇది చెల్లించాక అమెరికా బ‌య‌టికి వెళ్ల‌వ‌చ్చ‌ని డ‌బ్లూహెచ్వో స్ప‌ష్టం చేసింది. అయితే.. అప్పు చెల్లించాకే బ‌య‌టికి వెళ్లాల‌న్న నిబంధ‌న ఏమీ లేద‌ని అమెరికా స‌మాధానం ఇచ్చింది.

ఎవ‌రిపై ప్ర‌భావం ఉంటుంది ..

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు అమెరికా చాలా కాలంగా నిధుల‌ను ఇస్తోంది. ఇప్పుడు ఆ నిధులు ఆగిపోతాయి. ప్ర‌పంచంలోని ఒక అగ్ర‌రాజ్యం ప్ర‌పంచ ఆరోగ్యం సంస్థ నుంచి వైదొల‌గ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఆరోగ్య‌ రంగంలో సంక్షోభం ఏర్ప‌డిన స‌మ‌యంలో ప్ర‌పంచ దేశాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కొర‌వ‌డుతుంది. అదే స‌మ‌యంలో అమెరికా కూడా దీని వ‌ల్ల ఇబ్బంది ప‌డుతుంది. కోవిడ్ లాంటి కొత్త వైర‌స్ వ్యాప్తి జ‌రిగిన‌ప్పుడు , వాటిని నిరోధించే వ్యాక్సిన్ క‌నుగొన‌డానికి, మందులు క‌నుగొన‌డానికి అవ‌స‌ర‌మైన స‌మాచారం ప్ర‌పంచ ఆరోగ్యం సంస్థ నుంచి అమెరికాకు ల‌భించ‌దు. ప్ర‌పంచ వ్యాప్తంగా దేశాల మ‌ధ్య స‌మాచారాన్ని పంచుకోవ‌డంలో కూడా స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఒక‌రితో ఒక‌రు క‌లిసి ప‌నిచేయ‌డంలో ఇబ్బందులు వ‌స్తాయి. అమెరికా చ‌ర్య అటు దేశీయంగా, ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌భావం చూప‌నుంది. వ్యాధులు, వైర‌స్ లు వ్యాప్తి చెందిన స‌మ‌యంలో ఉమ్మ‌డిగా ఎదుర్కోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఈ ప‌రిణామాన్ని ప్రపంచ దేశాలు నిశితంగా గ‌మ‌నిస్తున్నాయి.

డ‌బ్లూహెచ్వో స్పంద‌న‌

ట్రంప్ నిర్ణ‌యం పై డ‌బ్లూహెచ్వో స్పందించింది. అమెరికాతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని సంర‌క్షించ‌డంలో డ‌బ్లూహెచ్వో కీల‌క పాత్ర పోషిస్తోంద‌ని ప్ర‌క‌టించింది. వ్యాధుల‌కు కార‌ణ‌మ‌వుతున్న అంశాల‌ను గుర్తిస్తూ, ప్ర‌స్తావిస్తూ.. బ‌ల‌మైన ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్మిస్తూ, ఎవరూ వెళ్ల‌ని చోటుకి కూడా డబ్లూహెచ్వో వెళ్లి సేవ‌లు అందించింద‌ని పేర్కొంది. అమెరికాతో క‌లిసి ఏడు ద‌శాబ్ధాలుగా కోట్లాది ప్రాణాల‌ను కాపాడింద‌ని, అమెరికాలో స్మాల్ ఫాక్స్ ను అరికట్టింద‌ని తెలిపింది. అమెరికా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు ఎంతో స‌హ‌క‌రిస్తూనే, అదేస్థాయిలో డ‌బ్ల్యూహెచ్వోలో స‌భ్య‌దేశంగా ఉండ‌టం వ‌ల్ల‌ ల‌బ్ధి కూడా పొందింద‌ని పేర్కొంది.

Tags:    

Similar News