ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ ఇలా.. ఎందుకీ మార్పు!

ఈ రోజు 43వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న మంత్రి నారా లోకేశ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అనేక మంది ట్వీట్స్, పోస్టు రాస్తున్నారు.;

Update: 2026-01-23 08:21 GMT

ఈ రోజు 43వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న మంత్రి నారా లోకేశ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అనేక మంది ట్వీట్స్, పోస్టు రాస్తున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఓ సెలబ్రెటీ నుంచి విషెస్ రావడమే ఈ ఏడాది స్పెషల్ అంటున్నారు. మంత్రి లోకేశ్ కు స్వయాన బావ మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. జూనియర్, లోకేశ్ స్వయాన బావబామ్మర్దులు అన్న విషయం తెలిసిందే. జూనియర్ భార్య కూడా లోకేశ్ కు దగ్గర బంధువు. కానీ, ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని బలపరిచే విధంగానే ఇన్నాళ్లు జూనియర్ వ్యవహరించేవారని చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ భావినేతగా లోకేశ్ ఎదగడం, రాష్ట్ర,జాతీయ స్థాయిలో ఆయన నాయకత్వానికి ఎంతో మద్దుతు వస్తోంది. టీడీపీ శ్రేణులు అన్నీ ఒకప్పుడు పార్టీ భావినేతగా జూనియర్ ఎన్టీఆర్ వస్తారని భావించేవారు. అయితే లోకేశ్ ఎంట్రీ తర్వాత ఈ భావనలో మార్పు వచ్చింది. ఈ కారణంగానే తారక్ కూడా లోకేశ్ తో గ్యాప్ మెంటైన్ చేస్తూ వచ్చారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరు దగ్గర బంధువులు అయినప్పటికీ బహిరంగంగా ఎప్పుడూ కలుసుకోలేదని కూడా గుర్తు చేస్తున్నారు. తారక్ పుట్టిన రోజు సమయంలో లోకేశ్ క్రమం తప్పకుండా శుభాకాంక్షలు చెబుతున్నా, అటు నుంచి ఎప్పుడూ రియాక్షన్ లేదని అంటున్నారు.

ఇక లోకేశ్ పుట్టిన రోజు పురస్కరించుకుని గతంలో ఎప్పుడూ తారక్ శుభాకాంక్షలు చెప్పలేదు. కానీ, ఈ సారి ఉదయం 10 గంటలకే లోకేశ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దాదాపు ఐదు లక్షల మంది ఈ ట్వీట్ ను వీక్షించగా, వందల మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ ను ఊహించలేదని కొందరు, అన్నా మన పార్టీలోకి ఎప్పుడొస్తావు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్టు తప్పకుండా వైరల్ అవుతుందని ముందే ఊహించినట్లు ఒక అభిమాని కామెంట్ చేశాడు.

నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియాను ఎక్కువగా వాడరని అంటున్నారు. ఆయన అధికారిక ఎక్స్ పేజీలో తన సినిమా సంగతులతోపాటు ప్రత్యేక పర్వదినాల్లో ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఉన్న పోస్టులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా రాజకీయంగా ఎలాంటి పోస్టులు, కామెంట్లు కూడా ఆయన నుంచి కనిపించవని అంటున్నారు. ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ లో జూనియర్ శుభాకాంక్షలు చెప్పారు. అదేసమయంలో ఏపీకి చెందిన ఏ నేతకు ఆయన విష్ చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజున సైతం జూనియర్ ట్వీట్ చేయలేదు.

అయితే ఈ సారి ఎవరూ ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ మంత్రి నారా లోకేశ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది లోకేశ్ తో మంచి సంబంధాలు కోరుకోవడంలో పడిన తొలి అడుగుగా అభివర్ణిస్తున్నారు. ఈ ఇద్దరు టీడీపీ వారసులు కలిసి పనిచేస్తే తిరుగు ఉండదని పార్టీ కార్యకర్తలు, అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. కారణం ఏదైనా ఇన్నాళ్లు ఏవేవో భేదాభిప్రాయాలతో చెరో దారిలో ఉన్నట్లు కనిపించే వారని, ఇప్పుడు ఈ ట్వీట్ ద్వారా అయినా కలిసిపనిచేసేలా అడుగులు వేయాలని తెలుగుదేశం క్యాడర్ ఆకాంక్షిస్తోందని చెబుతున్నారు.

Tags:    

Similar News