ఫోటో స్టోరీ : యాక్షన్ లోకి షర్మిల.. ఇక రచ్చ రచ్చేనా?
ఏపీసీసీ చీఫ్ షర్మిల మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. ఈరోజు ఉదయమే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన షర్మిల.. ముందుగా ఏపీ మంత్రి నారా లోకేశ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.;
ఏపీసీసీ చీఫ్ షర్మిల మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. ఈ రోజు ఉదయమే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన షర్మిల.. ముందుగా ఏపీ మంత్రి నారా లోకేశ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గత కొంతకాలంగా షర్మిల అమెరికాలో ఉన్నారు. భర్త అనిల్ కుమార్ తో కలిసి శుక్రవారం ఉదయమే మళ్లీ దేశంలో ల్యాండ్ అయ్యారు. పదునైన విమర్శలు, వాగ్బాణాలకు షర్మిల పెట్టింది పేరు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మాజీ సీఎం జగన్ రెడ్డిపై షర్మిల సంధించే వ్యంగ్యస్త్రాలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్నాళ్లుగా షర్మిల నుంచి ఈ తరహా విమర్శలు లేకపోవడంతో రాజకీయం చప్పగా ఉందన్న వ్యాఖ్యానాలు వినిపించాయి.
అమెరికా నుంచి షర్మిల రావడంతో మళ్లీ పొలిటికల్ ఫైటింగ్ పీక్స్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. తొలుత తన సోదరుడు మాజీ సీఎం జగన్ రెడ్డి టార్గెట్ గా షర్మిల నడుచుకున్నా.. కొద్ది నెలల క్రితం ఆమె టార్గెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ ను చేర్చారు. అయితే ఎక్కువగా సోదరుడు జగన్ రెడ్డితో ఉన్న రాజకీయ, వ్యక్తిగత విభేదాల వల్ల షర్మిల ఏం మాట్లాడినా వైసీపీ అధినేత యాంగిల్ లో వైరల్ అవుతూ ఉంటుంది.
మాజీ సీఎం జగన్ రెడ్డిని విభేదించిన షర్మిల తొలుత తెలంగాణలో రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించారు. సుదీర్ఘ పాదయాత్ర చేసినా, ఆమెకు అక్కడ పెద్ద ఆదరణ కనిపించలేదని చెబుతున్నారు. దీంతో 2024 ఎన్నికల ముందు షర్మిల తెలంగాణ నుంచి ఏపీకి మారారు. తాను స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఏపీలో బాధ్యతలు చేపట్టి ఆ పార్టీకి ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
2014లో రాష్ట్ర విభజన కారణంగా ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. దాదాపు పదేళ్ల పాటు ఆ పార్టీ జెండా పట్టుకోడానికి సైతం పెద్ద పెద్ద నేతలు భయపడ్డారు. పదేళ్లు అలా నెట్టుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి షర్మిల రూపంలో మంచి వాయిస్ దొరికిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సీఎం జగన్ రెడ్డిపై ఘాటైన విమర్శలు గుప్పించి, సోదరుడిని గుక్క తిప్పుకోకుండా చేయడంలో షర్మిల సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా వరసకు సోదరుడైన కడప ఎంపీ అవినాశ్ రెడ్డిపై ప్రత్యర్థిగా పోటీ చేసి వైసీపీకి చుక్కలు చూపారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కడప పార్లమెంటు రాజకీయాలకు దూరంగా ఉంటున్నా, క్రమం తప్పకుండా రాష్ట్ర రాజకీయ అంశాలపై స్పందిస్తూ తన ఉనికి చాటుకుంటున్నారు షర్మిల.
అయితే విదేశీ పర్యటన కారణంగా షర్మిల నుంచి గత కొంతకాలంగా ఎలాంటి రాజకీయ ప్రకటనలు రాలేదు. దీంతో ఏపీలో ఒక విధమైన నిస్తేజం అలముకున్న పరిస్థితి కనిపించిందని అంటున్నారు. 2029 ఎన్నికల్లో విజయం కోసం మళ్లీ పాదయాత్ర చేస్తానంటూ మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ప్రకటించిన రెండు రోజులకే షర్మిల దేశంలో అడుగు పెట్టారు. దీంతో జగన్ రెడ్డి భవిష్యత్తు పాదయాత్రపై ఆమె ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. అదేసమయంలో కూటమి ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపైన షర్మిల వైఖరి ఎలా ఉండబోతోందన్న విషయంపైనా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.