లోకేశ్ బర్త్ డే.. టీడీపీ స్పెషల్ సెలబ్రేషన్స్

టీడీపీ భావి నాయకుడు.. మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలను అధికార తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది.;

Update: 2026-01-23 07:57 GMT

టీడీపీ భావి నాయకుడు.. మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలను అధికార తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ ఏడాది లోకేశ్ పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు చేశారు. పదుల కొద్ది ప్రత్యేక వీడియోలు విడుదల చేయడమే కాకుండా, లోకేశ్ పనితీరుపై విశ్లేషణలతో ప్రత్యేక కథనాలను ప్రసారం చేసేలా టీడీపీ ప్లాన్ చేసింది. గత ఏడాది కూడా లోకేశ్ మంత్రిగా ఉండగానే పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే ఈ ఏడాది గతేడాదికి మించిన స్థాయిలో చరిత్రలో నెవ్వర్ బిఫోర్ అన్నట్లు సెలబ్రేట్ చేస్తున్నారు.

1983 జనవరి 23న పుట్టిన లోకేశ్ విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని 2017లో రాజకీయాల్లో ప్రవేశించారు. అప్పటికే ఆయన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అప్పటికి రెండు సార్లు సీఎంగా చంద్రబాబు పనిచేసినా, లోకేశ్ రాజకీయాల్లోకి రాలేదు. 1996 నుంచి 2004 వరకు చంద్రబాబు రాష్ట్రానికి సీఎంగా ఉన్న చదువు కారణంగా లోకేశ్ రాష్ట్రానికి దూరంగా ఉండేవారు. 2004లో బీఎస్సీ, 2008లో స్టాన్ ఫోర్డ్ లో ఎంబీఏ పూర్తి చేసిన లోకేశ్ ఆ తర్వాత రెండేళ్లు ఉద్యోగం చేశారు. 2014 ఎన్నికలకు ముందు తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్న టీడీపీ కోసం తెరవెనుక పనిచేశారు. 2014లో టీడీపీ గెలిచినా, లోకేశ్ వెంటనే రాజకీయాల్లోకి రాలేదు.

కొంతకాలం గ్యాప్ తీసుకున్న తర్వాత 2017లో ఎమ్మెల్సీగా పదవిని స్వీకరించి మంత్రి అయ్యారు. ఆ సమయంలో 24 వేల కి.మీ.మేర గ్రామీణ రహదారులు నిర్మించినా, ప్రజల్లో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఈ సమయంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు లోకేశ్ ను అన్నివిధాల టార్గెట్ చేశారు. టీడీపీ భావినేత ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ట్రోల్స్ కు దిగారు. బాడీ షేమింగ్ తోపాటు ఆయనకు ఎలాంటి సామర్థ్యం లేదని చాటిచెప్పేలా విమర్శలు, ఆరోపణలు గుప్పించేవారు. సుదీర్ఘ కాలం విదేశాల్లో ఉండటంతో అప్పట్లో లోకేశ్ తెలుగు కూడా సరిగా మాట్లాడలేకపోయేవారు. ఇది కూడా ప్రత్యర్థులకు ఆయుధంగా పనికొచ్చింది. దీంతో 2019 ఎన్నికల్లో లోకేశ్ స్వయంగా ఓటమి పాలయ్యారు.

అయితే 2019 ఎన్నికల్లో ఓటమి ఓ విధంగా లోకేశ్ కు మంచిది అయిందని అంటున్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టిన లోకేశ్.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని ప్రస్థానం ప్రారంభించారు. తనను ఓడించిన మంగళగిరిలో రికార్డు స్థాయిలో గెలిచేలా పునాదులు నిర్మించుకున్నారు. అదేసమయంలో పార్టీకి భావి నాయకుడిగా ఎదగాలనే ధృడ సంకల్పంతోపాటు చంద్రబాబుకు తానే ప్రత్యామ్నాయం అని నిరూపించుకునేలా, ప్రజల అభిమానాన్ని చూరగొనే విధంగా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. యువగళం పాదయాత్రలో లోకేశ్ ను నిలువరించేందుకు అప్పటి పాలకపక్షం వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, మొక్కవోని దీక్షతో లోకేశ్ ముందుకు కదిలారు.

ఒకానొక సమయంలో తండ్రి చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రను మధ్యలోనే ఆపాల్సివచ్చినా కుంగిపోలేదు. న్యాయపోరాటం ద్వారా తండ్రిని విడిపించిన తర్వాత మళ్లీ పాదయాత్ర కొనసాగించారు. ఇక 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోకేశ్ తీరులో పూర్తి మార్పు కనిపిస్తోందని అంటున్నారు. పార్టీలో ప్రభుత్వంలో కేంద్ర బిందువుగా పనిచేస్తున్నా మిత్రపక్షాలతో చక్కని సమన్వయం పాటించేలా ఎక్కడా ఎలాంటి విభేదాలకు ఆస్కారం ఇవ్వకుండా పనిచేసుకుపోతున్నారు.

క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మమేకమవుతూనే తాను పర్యవేక్షిస్తున్న విద్యా, ఐటీ శాఖల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు. క్లిష్టమైన విద్యాశాఖలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన మంత్రి లోకేశ్ పాఠశాలలు రాజకీయాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చి విద్యార్థుల తల్లిదండ్రుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అదే సమయంలో 2024 ఎన్నికల హామీ అయిన నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల సాధనకు శ్రమిస్తున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మిట్టల్ స్టీల్, అదానీ గ్రూప్, టీసీఎస్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతోనూ భేటీ అవుతూ రాష్ట్రానికి పెట్టుబడులు సాధిస్తున్నారు.

ఇలా రాష్ట్రాన్ని అగ్రపథాన నిలపాలనే లోకేశ్ ప్రయత్నాన్ని వివరిస్తూ, ఆయన పడిన కష్టాన్ని చూపుతూ ప్రత్యేక వీడియోలు విడుదల చేసింది టీడీపీ. ఈ వీడియోలను టీడీపీ అభిమానులు, కార్యకర్తలు తమ సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో షేర్ చేస్తున్నారు. మరోవైపు జనసేన సైతం ఈ సారి లోకేశ్ బర్త్ డేను స్పెషల్ గా సెలబ్రేట్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం జనసేనాని పవన్ విషయంలో లోకేశ్ చూపుతున్న కేరింగే అని అంటున్నారు. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలనే సూత్రం ఆధారంగా చేసుకుని లోకేశ్ పనిచేయడం వల్లే ఆయన నాయకత్వానికి ఇంత మద్దతు లభిస్తోందని, ఆ విషయం ఈ పుట్టిన రోజు సందర్భంగా బయటపడిందని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News