షట్‌డౌన్ ఎఫెక్ట్ : రూ. 62 వేల కోట్లు ఆవిరి.. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమా?

కీలకమైన బిల్లుల విషయంలో అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లో చిక్కుకుని, ఇప్పటికే 31 రోజులు పూర్తి చేసుకుంది.;

Update: 2025-11-01 19:30 GMT

అమెరికాలో రాజకీయ పీటముడి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదాన్ని సృష్టిస్తోంది. కీలకమైన బిల్లుల విషయంలో అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లో చిక్కుకుని, ఇప్పటికే 31 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ మూసివేత కారణంగా అగ్రరాజ్యానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.

భారీ నష్టం అంచనా

కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (CBO) తాజా అంచనాల ప్రకారం, 31 రోజుల షట్‌డౌన్ ఫలితంగా అమెరికా సంపదలో ఏకంగా 7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 62,149 కోట్లు) శాశ్వతంగా ఆవిరయ్యాయి. ఈ మూసివేత గనుక మరింత కాలం కొనసాగితే, ఆరు వారాలకు $11 బిలియన్లు.. ఎనిమిది వారాలకు $14 బిలియన్ల వరకు నష్టం ఏర్పడే అవకాశం ఉందని CBO హెచ్చరించింది.

ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేపీఎంజీ చీఫ్ ఎకానమిస్ట్ డయాన్ స్వాంక్ మాట్లాడుతూ "ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉంది. షట్‌డౌన్ వంటి అంశాలు ఊహించిన దానికంటే పెద్ద ప్రమాదంగా మారవచ్చు" అని హెచ్చరించారు.

మూడీస్ అనలిటిక్స్‌కు చెందిన మార్క్ జాండీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ పరిస్థితి వినియోగదారులు, వ్యాపారాలు.. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

బహుళ రంగాలపై తీవ్ర ప్రభావం

ఈ రాజకీయ ప్రతిష్టంభన పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న జాబ్ మార్కెట్‌పై షట్‌డౌన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థిక అనిశ్చితి కారణంగా పలు కంపెనీలు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు కృత్రిమ మేధ (AI) , ఆటోమేషన్ వైపు దృష్టి సారించడంతో ఉద్యోగావకాశాలు తగ్గుతున్నాయి. ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు ఆగిపోవడం వల్ల వినియోగదారుల ఖర్చు తగ్గడం, తద్వారా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

డేటా కొరత: షట్‌డౌన్ కారణంగా ఉపాధి

గణాంకాలు, జీడీపీ కొలతలు వంటి కీలకమైన ఫెడరల్ ఆర్థిక గణాంకాల విడుదల నిలిచిపోయింది. ఈ సమాచార లోపం వల్ల వ్యాపార నిర్ణయాలు, పెట్టుబడులు మరియు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రభావితమవుతున్నాయి.

ప్రజా సంక్షేమంపై దెబ్బ

నిధుల కొరత కారణంగా సుమారు 42 మిలియన్ల కుటుంబాలు ఆధారపడే ఫుడ్ ఎయిడ్ ప్రోగ్రామ్ (SNAP) వంటి కీలక సంక్షేమ కార్యక్రమాలకు నిధులు నిలిపివేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే, అందుబాటు ధరల ఆరోగ్య సంరక్షణ చట్టం (ACA) కింద పెంచిన సబ్సిడీల గడువు కూడా ముగియనుండడంతో, 22 మిలియన్ల మంది అమెరికన్లకు ఆరోగ్య బీమా ప్రీమియంలు సగటున 26% పెరిగే ప్రమాదం ఉంది.

విమానయానానికి అంతరాయం

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు జీతాలు లేకుండా పనిచేస్తుండటంతో, వారి కొరత కారణంగా ప్రధాన విమానాశ్రయాలలో విమానాల ఆలస్యం పెరుగుతోంది. ఇది పండుగ సీజన్‌కు ముందు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

మునుపటి రికార్డు దాటే ప్రమాదం

1981 నుండి అమెరికా ప్రభుత్వం మొత్తం 15 సార్లు మూసివేయబడింది. 2018-19లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో జరిగిన 35 రోజుల షట్‌డౌన్ ఇప్పటివరకు అతి దీర్ఘమైనదిగా ఉంది. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజీ సూచనలు కనిపించకపోవడంతో, ఈసారి ఆ రికార్డు కూడా దాటే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీర్ఘకాలికంగా కొనసాగితే, ఈ ప్రభుత్వ మూసివేత అమెరికా ఆర్థిక వృద్ధిని మరింత మందగింపజేసి, ప్రతి వారం సగటున 0.1 నుంచి 0.2 శాతం పాయింట్ల తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ నాయకుల మొండి వైఖరిని వీడకపోతే, అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థకు మరింత నష్టం తప్పదని నిపుణుల హెచ్చరిక.

Tags:    

Similar News