ట్రంప్ కి జీసస్ చెప్పాడు అంట కలలో.. ఇరాన్ తో యుద్ధం చేయమని..
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధ చర్యలకు అమెరికా సైన్యంలో కొందరు కమాండర్లు మతపరమైన కారణాలను చూపుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.;
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధ చర్యలకు అమెరికా సైన్యంలో కొందరు కమాండర్లు మతపరమైన కారణాలను చూపుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యేసు క్రీస్తు కలలో సందేశం ఇచ్చి ఇరాన్‌పై యుద్ధం చేయాలని సూచించాడని కొందరు కమాండర్లు సైనికులకు చెప్పినట్లు వచ్చిన రిపోర్టులు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. దీనిపై మిలిటరీలోనే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
అమెరికా సైన్యంలో మత స్వేచ్ఛను పరిరక్షించే వాచ్‌డాగ్ సంస్థ మిలిటరీ రిలిజియస్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (ఎంఆర్ఎఫ్.ఎఫ్) వెల్లడించిన వివరాలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి. అమెరికా సైన్యంలో దాదాపు 40 యూనిట్ల నుంచి 110కి పైగా ఫిర్యాదులు తమకు అందాయని సంస్థ తెలిపింది. ఈ ఫిర్యాదుల్లో ముఖ్యంగా కొందరు కమాండర్లు సైనికులకు మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ యుద్ధాన్ని దేవుడి సంకల్పంగా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు.
రిపోర్టుల ప్రకారం కొందరు సైనిక కమాండర్లు తమ బ్రీఫింగ్‌లలో బైబిల్‌లో పేర్కొన్న అర్మాగెడ్డాన్ (చెడుపై దేవుడి తుదిపోరు) గురించి ప్రస్తావించారు. ప్రపంచంలో చెడును అంతమొందించేందుకు దేవుడు నిర్ణయించిన యుద్ధమే ఇది అని.. ఆ ప్రక్రియలో భాగంగానే ఇరాన్‌పై పోరు జరుగుతోందని వారు చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా “ట్రంప్ దేవుని ఎంపిక చేసిన నాయకుడు”, “ఇరాన్‌పై యుద్ధం దేవుడి నిర్ణయం”, “మనమందరం దేవుడి కోసం పోరాడాలి” వంటి వ్యాఖ్యలు కూడా చేసినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అమెరికా సైన్యంలో ఉన్న భిన్న మతాలకు చెందిన సైనికుల్లో అసౌకర్యాన్ని కలిగించాయని తెలుస్తోంది. అమెరికా సైన్యంలో క్రైస్తవులు, ముస్లింలు, యూదులు, నాస్తికులు సహా అనేక మతాలకు చెందినవారు ఉన్నారు. ఒకే మతాన్ని ఆధారంగా చేసుకుని యుద్ధాన్ని న్యాయపరచడం సైన్యంలో విభేదాలను పెంచుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్రీఫింగ్‌కు హాజరైన ఒక నాన్ కమిషన్డ్ ఆఫీసర్ (ఎన్.సీఓ) 15 మంది సైనికుల తరపున ఎంఆర్ఎఫ్.ఎఫ్ కు అధికారిక ఫిర్యాదు చేశారు. వీరిలో 11 మంది క్రైస్తవులు, ఒక ముస్లిం, ఒక యూదు, ఇద్దరు నాస్తికులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తొలుత ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ జోనాథన్ లార్సెన్ తన సబ్‌స్టాక్ ప్లాట్‌ఫారంలో రిపోర్ట్ చేశారు. అనంతరం ఈ అంశం అమెరికా మీడియా, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎంఆర్ఎఫ్.ఎఫ్ ప్రకారం అమెరికా సైన్యంలో ఉన్న వివిధ స్థావరాల నుంచి మొత్తం 30కి పైగా బేస్‌లలోని 40 యూనిట్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. కమాండర్లు మతపరమైన భావజాలాన్ని సైనికులకు బలవంతంగా రుద్దుతున్నారని..ఇది సైన్యంలో ఉన్న మత స్వేచ్ఛకు విరుద్ధమని ఫిర్యాదులు పేర్కొంటున్నాయి. ఫిర్యాదు చేసిన సైనికులు మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. కమాండర్ల ఈ వ్యాఖ్యలు సైనికుల మధ్య ఐక్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. అమెరికా రాజ్యాంగాన్ని రక్షించేందుకు మేము ప్రమాణం చేశామని, కానీ మతపరమైన యుద్ధంగా ఈ పోరును చూపించడం ఆ ప్రమాణాలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ వ్యవస్థలు మతపరమైన తటస్థతను పాటించాలి. సైన్యంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్న ఆరోపణలు ఈ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మతం పేరుతో యుద్ధాన్ని న్యాయపరచడం సైన్యంలో ఉన్న మత వైవిధ్యానికి ముప్పుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త చర్యలు కొనసాగుతున్న సమయంలో ఈ వివాదం బయటపడటం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకవైపు యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతుండగా.. మరోవైపు అమెరికా సైన్యంలో మతపరమైన వ్యాఖ్యలు కొత్త రాజకీయ–సామాజిక చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఫిర్యాదులపై అమెరికా రక్షణ శాఖ ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.