దేశీయ ఈ-కామర్స్ పై అగ్రరాజ్యం కన్ను?

ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు ఏ దేశం మీద ప్రత్యేకంగా అభిమానం.. ప్రేమ ఉండదు. ఆ దేశం ఏం చేసినా అదంతా కూడా తన ప్రయోజనాలకు అనుగుణంగానే స్పందిస్తుంది తప్పించి.. భావోద్వేగాలు.. పాత స్నేహం.. అనుబంధం లాంటి సెంటిమెంట్లు ఏవీ ఉండవు.;

Update: 2025-04-23 11:30 GMT

ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు ఏ దేశం మీద ప్రత్యేకంగా అభిమానం.. ప్రేమ ఉండదు. ఆ దేశం ఏం చేసినా అదంతా కూడా తన ప్రయోజనాలకు అనుగుణంగానే స్పందిస్తుంది తప్పించి.. భావోద్వేగాలు.. పాత స్నేహం.. అనుబంధం లాంటి సెంటిమెంట్లు ఏవీ ఉండవు. పక్కా వ్యాపారిగా వ్యవహరిస్తూ తనకు మేలు చేకూరే అంశాల్ని సాధించుకోవటం కోసం ఏ మంత్రాన్ని అయినా పఠించేందుకు సిద్ధమవుతారు. తాము అనుకున్నది సాధించేందుకు అవసరమైన అస్త్రాల్ని అమ్ముల పొదిలో సిద్ధంగా ఉంచుకుంటారు. అవసరానికి తగ్గట్లు వాటిని బయటకు తీస్తారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భారత్ పర్యటనలో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కావటం తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా తన రహస్య ఎజెండాను తెర మీదకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. భారీగా దూసుకెళుతున్న దేశీయ ఈ-కామర్స్ మీద అగ్రరాజ్యం కన్ను పడినట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకుంటే.. దేశీయ ఈ-కామర్స్ రంగం విలువ రూ.10.65 లక్షల కోట్లు. ఇప్పటికే జోరుగా ఉన్న ఈ వ్యాపారంపై పట్టు సాధించేందుకు.. తమ దేశానికి చెందిన దిగ్గజ సంస్థలైన అమెజాన్.. వాల్ మార్ట్ లకు మేలు కలిగించేలా చేయటమే అమెరికా ఉద్దేశంగా చెబుతున్నారు.

ఈ-కామర్స్ మార్కెట్ తలుపులు బార్లా తీయాలన్న ఒత్తిడిని ప్రధాని మోడీ మీద పెట్టినట్లుగా తెలుస్తోంది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించటంతో పాటు.. వివక్షాపూరితమైన ఆంక్షల తొలగింపుపైనా ఒత్తిడి తెస్తున్నట్లుగా చెబుతున్నారు. దేశంలో ఈ-కామర్స్ మార్కెట్ శరవేగంగా విస్తరించటం.. క్విక్ కామర్స్ కంపెనీలైతే దేశంలోని దాదాపు వంద ప్రధాన నగరాల్లో చొచ్చుకు వెళ్లటం తెలిసిందే. ఈ మార్కెట్ లో ప్రస్తుతం అమెరికా రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్.. భారత అనుబంధ సంస్థ ఫ్లిప్ కార్ట్ దే. అమెరికాకు చెందిన మరో దిగ్గజ సంస్థ అమెజాన్ కూడా ఈ రంగంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఇవ్వటం తెలిసిందే.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం విదేశీ ఈ-కామర్స్ సంస్థలు ఇతర సంస్థల వస్తు.. సేవలకు మార్కెట్ వేదికలుగా మాత్రమే ఉండాల్సి ఉంటుంది. అంతే తప్పించి వస్తువుల్ని తయారు చేసి.. స్టోర్ చేసి తమ ప్లాట్ ఫామ్స్ మీద అమ్మేందుకు వీల్లేదు. ఈ ఆంక్షను ఎత్తి వేయాలన్న ఎజెండాను తీసుకొచ్చి ప్రధాని మోడీ మీద ఒత్తిడి పెడుతున్నట్లు చెబుతున్నారు. ఈ విసయంలో అమెరికా ఒత్తిడికి మోడీ సర్కారు లొంగితే దేశంలోని కిరాణా దుకాణాలకు అదో ఉరితాడుగా మారుతుందని చెబుతున్నారు.

ఈ-కామర్స్ సంస్థలు అడ్డగోలు ధరలు.. డిస్కౌంట్లనను తట్టుకోలేక ఇప్పటికే దేశంలోని 10 లక్షల కిరాణా దుకాణాలు మూతపడిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అమెరికా ఒత్తిళ్లకు ఓకే చెబితే దేశీయంగా దిగ్గజ సంస్థలైన రిలయన్స్.. డిమార్టు సంస్థలకు ముప్పుగా మారుతుందన్న హెచ్చరిక కూడా వినిపిస్తోంది. మరి.. ఈ ఒత్తిడిని ప్రదాని మోడీ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News