డిప్యూటీ సీఎం సలహాలు తీసుకుంటున్నా: నారా లోకేష్
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని.. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ క్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనలు, సలహాలు కూడా తీసుకుంటున్నట్టు చెప్పారు.;
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని.. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ క్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనలు, సలహాలు కూడా తీసుకుంటున్నట్టు చెప్పా రు. తరచుగా విద్యావ్యవస్థపై తాను-పవన్ కల్యాణ్ చర్చించుకుంటున్నామని.. జరగాల్సిన మార్పులు.. తీసుకురావాల్సిన సంస్కరణలపై దృష్టి పెడుతున్నట్టు వివరించారు.
శుక్రవారం పార్వతిపూరం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ -టీచర్ మీటింగ్ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడారు. విద్య వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలని, ఈ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడానికి అందరూ కలిసి పని చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఆయన... దీనికి విద్యా విధానం మెరుగవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
పిల్లల కోసం... పిల్లలకు అర్థమయ్యే విధంగా బాలల రాజ్యాంగం రూపొందించామన్నారు. పిల్లలతో మాక్ అసెంబ్లీని నిర్వహించామని, ఎమ్మెల్యేల కంటే అద్భుతంగా సమస్యలపై చర్చించారని లోకేష్ అన్నారు. మహిళలను కించపరిచే విధంగా కొన్ని వాడుక పదాలు ఉన్నాయని, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. గతంలో ఇంటి పనులు మహిళలే చేసే విధంగా పాఠ్యాంశాల్లో ఫొటోలు ఉండేవన్న ఆయన.. ఇప్పుడు ఇంటి పనులు మహిళలతో పాటు మగవారు కూడా చేస్తున్నట్టుగా ఫొటోలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
క్లిక్కర్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నట్టు లోకేష్ చెప్పారు. ఫిన్లాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో విద్యా విధానాన్ని పరిశీలించేందుకు టీచర్లను, విద్యార్థులను పంపుతామన్నారు. పిల్లలు ఎలా చదువు కుంటున్నారనే విషయం ఇప్పుడు తల్లిదండ్రులకు అందుబాటులో ఉందని తెలిపారు. దేశంలో ఆంధ్ర మోడల్ విద్యా విధానాన్ని రెండేళ్లల్లో తీసుకురానున్నట్టు చెప్పారు. ``డిప్యూటీ సీఎం నా వెనుకుండి.. సలహలు ఇస్తున్నారు. విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలు, పిల్లలకు అందించే భోజనం వంటి అంశాల్లో నిత్యం చర్చించుకుంటాం`` అని తెలిపారు.