పంచాయతీ ఫలితం తర్వాత.. రేవంత్ 'కీలక' నిర్ణయాలు!
ముఖ్యంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంది. దీనిలో భాగంగా ఫ్యూచర్ సిటీనుంచి అమరావతి వరకు నిర్మించనున్న ప్రధాన రహదారి పనులకు భూ సేకరణ చేయాల్సి ఉంది.;
ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 11 నుంచి మూడు విడతల్లో గ్రామ పంచాయతీలకు, మండలస్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఎన్నికలను ప్రాణ ప్రదంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ వీటిలో వచ్చే ఫలితాలను అధ్యయనం చేయడం ద్వారా తదుపరి కార్యాచరణకు రెడీ అవుతుందన్న చర్చ జరుగుతోంది.
దీనిలో ప్రధానంగా ప్రాజెక్టులు, బీఆర్ ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల రాజీనామాలు వంటి కీలక నిర్ణయా లు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి సానుకూలంగానే రాష్ట్ర ప్రజలు ఉన్నారన్న చర్చ జరుగుతోంది. అయితే.. దీనికి ప్రాతిపదిక కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు జరగనున్న పంచాయతీ ఎన్నికల తర్వాత.. ఆ పార్టీకి మద్దతు ఏ రేంజ్‌లో ఉందో తెలుసుకుంటారు. అనంతరం.. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తారన్న చర్చ సాగుతోంది.
ముఖ్యంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంది. దీనిలో భాగంగా ఫ్యూచర్ సిటీనుంచి అమరావతి వరకు నిర్మించనున్న ప్రధాన రహదారి పనులకు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇది ఇప్పటికిప్పుడు చేయడం ద్వారా ఇబ్బందులు వస్తాయని గ్రహించిన సర్కారు వాయిదా వేస్తోంది. అదేవిధంగా జంపింగు నాయకులతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే.. ఈ విషయంలోనూ ప్రజానాడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీంతో పంచాయతీ ఎన్నికలను ప్రాతిపదికగా తీసుకుని తర్వాత నిర్ణయాలు ఉంటాయన్న చర్చ ఉంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో జెండా, అజెండా ఉండవు. అయినా.. పార్టీల మద్దతు దారులు రంగంలోకి దిగుతున్నారు. దీంతో కాంగ్రెస్ హవా గ్రామ పంచాయతీల స్థాయిలో భారీగా కనిపిస్తే.. అప్పుడు రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ దిశగానే సీఎం రేవంత్ రెడ్డి.. వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. పంచాయతీ ఎన్నికలను కీలకంగా భావిస్తున్నారు.