పెద్దన్న డేగకళ్ల నుంచి ఎవరూ తప్పించుకోలేరా?
టార్గెట్ చేస్తే సరి.. లక్ష్యం ఎంత పెద్దదైనా.. క్లిష్టమైనదైనా సరే.. దాని అంతు చూసే వరకు వదలని తత్త్వం అగ్రరాజ్యం అమెరికా సొంతం.;
టార్గెట్ చేస్తే సరి.. లక్ష్యం ఎంత పెద్దదైనా.. క్లిష్టమైనదైనా సరే.. దాని అంతు చూసే వరకు వదలని తత్త్వం అగ్రరాజ్యం అమెరికా సొంతం. ఈ విషయం మరోసారి ప్రపంచానికి అర్థమయ్యేలా చేసింది తన యాక్షన్ తో. ఇరాన్ సుప్రీంను ఇట్టే లేపేసిన వైనం చూసినప్పుడు.. తన టార్గెట్ విషయంలో అమెరికా ఎంత కచ్ఛితత్వంతో ఉంటుందన్న విషయం మరోసారి నిరూపితమైంది. యుద్ధం ఆరంభమైన మొదటి రోజే ఇరాన్ సుప్రీంను.. కీలకమైన పలువురు నేతల్ని అంతం చేసిన వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సందర్భంగా అంత పెద్ద టార్గెట్ అంత సులువుగా ఎలా సాధ్యమైందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అప్పుడు తన సాంకేతికత.. తామేం చేశామన్న విషయాన్ని చెప్పటం ద్వారా.. అమెరికా తన అగ్రరాజ్య హోదాకు ఎంత అర్హురాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లైందని చెప్పాలి.
ఇరాన్ సుప్రీం ఉదంతం తరవాత.. అగ్రరాజ్యం తాను ఎవరిపైనైనా టార్గెట్ చేస్తే.. అందుకు తగ్గట్లే ఆ దేశ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఏఐ) ఎలా పని చేస్తుందో అర్థమైంది. ప్రపంచ స్థాయి నేతలపై నిఘా పెట్టటం.. తన శత్రువుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. అనుక్షణం అప్డేట్ అవుతూ ఉండే తీరు.. మరోసారి అమెరికా అంటేనే హడలిపోయేలా చేస్తుందని చెప్పాలి. ఈ ఏడాది ఆరంభంలో వెనెజువెలా అధినేత నివాస భవనంలోకి వెళ్లి మరీ.. ఆయన్ను.. ఆయన భార్యను బంధీగా తరలించిన వైనం చూస్తే.. అమెరికా నిఘా వ్యవస్థ ప్లానింగ్ ఎంత పక్కాగా ఉంటుందో అర్థమవుతుంది.
ఆయన్ను అదుపులోకి తీసుకునే క్రమంలో ముదురో తిరిగే ప్రదేశాలపై స్పష్టమైన మ్యాప్ ను తయారు చేయటమేకాదు..ఆయన ఇంటి నమూనాను క్రియేట్ చేసి.. తలుపుల్ని ఎలా బద్ధలు కొట్టాలన్న దానిపైనా అమెరికా దళాలు ప్రాక్టీస్ చేయటం దీనికి మంచి ఉదాహరణ. అంతేకాదు.. ఇరాన్ సుప్రీం విషయంలోనూ ఆ దేశ అధ్యక్షుడు చేసిన హెచ్చరికను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. గత ఏడాది జూన్ లో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ గగనతలం పూర్తిగా తమ నియంత్రణలో ఉందని.. సుప్రీం లీడర్ ఉన్న కచ్ఛితమైన లొకేషన్ తమకు తెలుసని పేర్కన్నారు. ఖమైనీ తమకు సలువైన టార్గెట్ గా పేర్కొన్న ట్రంప్.. ‘‘అతన్ని ప్రస్తుతానికి చంపాలనుకోవటం లేదు. లొంగిపోయే అవకాశం ఇస్తున్నాం’’ అని పేర్కొనటాన్ని ఇప్పుడు పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
అయితే.. ఈ వార్నింగ్ ను ఇరాన్ కానీ.. ఖమేనీ కానీ పట్టించుకోలేదు. అందుకు ఆయన తన ప్రాణాల్ని మూల్యంగా చెల్లించాల్సిన పరిస్థితి. టెహ్రాన్ లోని ట్రాఫిక్ కెమెరాలు.. ఫోన్ నెట్ వర్కును ట్రాక్ చేసి ఖమేనీ కదలికలపై అమెరికా నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28న ఖమేనీ తన అధికార నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉన్నప్పుడే.. అమెరికా నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు చేసి.. ఆయన ప్రాణాల్ని తీసింది. దీంతో.. ప్రపంచంలో ఏ అధినేతను అయినా తాము టార్గెట్ చేయాలే కానీ.. అంతు చూసే వరకు వదలమన్న విషయాన్ని అగ్రరాజ్యం మరోసారి నిరూపించిందని చెప్పక తప్పదు.