చైనా రివర్సు టారిఫ్ తో అమెరికా ఉక్కిరిబిక్కిరి ఎందుకు?

నువ్వు నాలుగు దెబ్బలు కొడితే నేను ఒక్క దెబ్బైనా కొట్టలేనా? అంటూ బలవంతుడి ఈగో మీద బలహీనుడు దెబ్బ కొట్టటం అప్పుడప్పుడు చూస్తుంటాం.;

Update: 2025-04-05 14:30 GMT

నువ్వు నాలుగు దెబ్బలు కొడితే నేను ఒక్క దెబ్బైనా కొట్టలేనా? అంటూ బలవంతుడి ఈగో మీద బలహీనుడు దెబ్బ కొట్టటం అప్పుడప్పుడు చూస్తుంటాం. అలాంటిది నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత? అనుకునే రెండు ఆర్థిక మదగజాల మధ్య పోరు మొదలైతే సీన్ ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా అమెరికా - చైనా మధ్య నడుస్తున్న టారిఫ్ వార్ ఉందని చెప్పాలి. తమకు అన్యాయం చేస్తుందంటూ డ్రాగన్ దేశంపై నిప్పులు చెరిగిన ట్రంప్.. ప్రతీకార సుంకాన్ని చైనా మీద భారీగా విధిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

తెంపరితనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే చైనా.. ట్రంప్ నిర్ణయానికి ధీటుగా నిలిచింది. అమెరికా తమ మీద 34 శాతం సుంకాలు విధిస్తున్నట్లుగా చేసిన ప్రకటనకు ధీటుగా తాము కూడా అమెరికాపై 34 శాతం అదనపు సుంకాల్ని విధిస్తున్నట్లుగా చెప్పి సై అంటే సై అన్నట్లుగా రియాక్టు అయ్యింది. చైనా ఇప్పటివరకు విధించే సుంకాలకు.. తాజాగా ప్రకటించిన 34 శాతం సుంకం అదనం. చైనా మీద తాము విధించిన సుంకం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తుందని ట్రంప్ చెబితే.. అందుకు బదులుగా అంతే తెంపరితనంతో చైనా స్పందిస్తూ.. తాము ప్రకటించిన తాజా సుంకాలు.. ఖనిజ ఎగుమతులపై ఆంక్షల్ని ఏప్రిల్ 4 నుంచే (ఈ రోజు) అమల్లోకి రానున్నట్లుగా ప్రకటించింది.

ఇక్కడో విషయాన్ని చెప్పాలి. అగ్రరాజ్యం అమెరికాకు అత్యవసరమైన పలు అరుదైన ఖనిజాల్ని చైనా ఎగుమతి చేస్తుంటుంది. తమపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకానికి బదులుగా తాము సుంకాన్ని వేయటమే కాదు.. తాము ఎగుమతి చేసే అరుదైన ఖనిజాల ఎగుమతులపైనా నియంత్రణను ప్రకటించింది. దీంతో.. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతుల నియంత్రణ షురు అవుతుంది.

సమారియం.. గాడోలినియం.. డైస్పోరియం.. లుటేటియం.. స్కాండియం.. ఇత్రియం లాంటి పలు ఖనిజాలు చైనా విధించిన ఆంక్షల జాబితాలో ఉన్నాయి. చైనా తాజా నిర్ణయం అమెరికాకు చెందిన రక్షణ.. కంప్యూటర్.. స్మార్ట్ ఫోన్ పరిశ్రమలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ ఖనిజాల మీద అమెరికా భారీగా ఆధారపడటమే. అంతేకాదు.. 16 అమెరికా కంపెనీలకు పలు డ్యూయల్ యూజ్ వస్తువుల ఎగుమతుల్ని పూర్తిగా నిలిపివేయాలని కూడా చైనా నిర్ణయం తీసుకుంది.

చైనా తీసుకున్న నిర్ణయంతో ట్రంప్ గగ్గోలు పెడుతున్న పరిస్థితి. పైకి బింకంగా కనిపించినప్పటికీ.. చైనా స్పందన ఇంత తీవ్రంగా ఉంటుందని ట్రంప్ అంచనా వేయలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన సోషల్ మీడియాలో ట్రంప్ స్పందన చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ‘‘చైనాది తొండాట. మా దెబ్బతో వారు గాబరా పడిపోయారు. దాంతో చేయకూడని పనులు చేస్తున్నారు. చైనా తీరుతో మా నిర్ణయాలు.. విధానాలు మారవు’’ అని చెప్పినప్పటికి.. ఆచరణలో అంత సీన్ లేదన్న మాట వినిపిస్తోంది. అందుకే అంటారు.. ఇద్దరు బలవంతుల మధ్య పోరు వారిద్దరికి నష్టం చేస్తుందని. అయితే.. తాజా ఎపిసోడ్ లో అమెరికా ప్రతీకార సుంకం ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా.. ప్రపంచంలోని పలు దేశాలపైన కావటంతో.. ఈ ఇష్యూలో అగ్రరాజ్యం ఒంటరిగా చెప్పక తప్పదు. అందరూ కత్తి కడితే.. అదెంత అగ్రరాజ్యమైతే మాత్రం ఆగమాగం కాకుండా ఉంటుందా?

Tags:    

Similar News