జాహ్నవి మరణంపై రియాక్టు అయిన వర్సిటీ

ఆమెకుమరణానంతర డిగ్రీని ఇవ్వాలని నార్త్ ఈస్ట్రన్ వర్సిటీ నిర్ణయించింది. ఆమె మరణంపై వర్సిటీ ఛాన్సలర్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తూ.;

Update: 2023-09-16 04:37 GMT

ఉన్నత విద్య కోసం దేశం కాని దేశం వెళ్లి.. ఒక పొగరబోతు పోలీసు అధికారి మితిమీరిన వేగం.. నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన భారత విద్యార్థిని జాహ్నవి మరణానికి సంబంధించిన షాకింగ్ నిజాలు బయటకు రావటం.. అవి పెను సంచలనంగా మారటం తెలిసిందే. గంటకు 119 కి.మీ. వేగంతో పెట్రోలింగ్ వెహికిల్ ను నడిపిన సదరు అధికారి.. తన అతి వేగం కారణంగా ఒకరు మరణించటాన్ని పట్టించుకోకుండా.. ఆమె మరణాన్ని చులకనగా మాట్లాడటంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతడి మీద చర్యలకు ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతంపై భారత ప్రభుత్వం సైతం స్పందించి.. చర్యలకు పట్టుబట్టటం తెలిసిందే.

జాహ్నవి ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన విద్యార్థిని. ఎంఎస్ చేసేందుకు అమెరికాకు వెల్లిన ఆమె.. రాత్రి వేళ కాలేజీ నుంచి ఇంటికి వెళుతూ.. రోడ్డు దాటుతున్న వేళ.. దారుణ స్పీడ్ తో వెళుతున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొన్న ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి.. మరణించారు. ఆమె మరణం (జనవరిలో జరిగింది) తర్వాత కొద్ది నెలలకు (ఇటీవలే) పోలీసు అధికారి బాడీ కెమేరాలో పోలీసు అధికారి దారుణ వ్యాఖ్యలు రికార్డు కావటం.. దానికి సంబంధించిన వైరల్ వీడియో బయటకు రావటం తెలిసిందే.

సాటి మనిషి ప్రాణాలు పోయాయన్న వేదన లేకపోగా.. ఆమెను చులకన చేసేలా ఉన్న పోలీసు అధికారిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. జాహ్నవి మరణంపై ఆమె చదువుతున్న యూనివర్సిటీ తాజాగా స్పందించింది. ఆమెకుమరణానంతర డిగ్రీని ఇవ్వాలని నార్త్ ఈస్ట్రన్ వర్సిటీ నిర్ణయించింది. ఆమె మరణంపై వర్సిటీ ఛాన్సలర్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తూ.. ఈ ఘటన అనంతరం తమ క్యాంపస్ లోని భారత విద్యార్థులు తీవ్రంగా ప్రభావితం అయ్యారన్నారు. ఈ సమయంలో విద్యార్థులకు తాము అండగా ఉంటామన్నఆయన.. బాధ్యులకు శిక్ష పడుతుందని తాను ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయాలని తాము నిర్ణయించామని.. ఆమె కుటుంబ సభ్యులకు దాన్ని అందిస్తామని వెల్లడించారు.

Similar News