ఇద్దరు భార్యలతో కొలువైన గణపతి ఆలయం ఎక్కడంటే ?

గణపతి రూపమే భక్తులకు ఆకర్షణగా ఉంటుంది. ఏనుగు తొండంతో అతి పెద్ద బొజ్జతో వినాయకుడు భక్తులను దీవిస్తారు.;

Update: 2025-08-27 09:44 GMT

గణపతి రూపమే భక్తులకు ఆకర్షణగా ఉంటుంది. ఏనుగు తొండంతో అతి పెద్ద బొజ్జతో వినాయకుడు భక్తులను దీవిస్తారు. అయితే గణపతి బహుముఖ రూపాలలో దర్శనం ఇస్తూంటారు. గణపతిని అనేక రూపాలలో ఊహించుకుని వాటిని ఆ విధంగా రూపమిచ్చి గణపతి మండపాలలో ఉంచి పూజలు చేయడం భక్తులకు కూడా ఎంతో సరదా. ఇదిలా ఉంటే తన బహు ముఖ రూపాలతో గణపతి కొలువు తీరిన ఆలయాలు ఎంతో ప్రసిద్ధమైనవి దేశంలో ఉన్నాయి. వాటి విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

సతులతో గణేషుడు :

సాధారణంగా గణపతి ఎపుడూ ఒంటరిగానే కనిపిస్తారు. ఏ ఫోటో చూసినా అలాగే ఉంటుంది. అయితే గణపతికి ఇద్దరు భార్యలు అని పురాణ గాధలు చెబుతాయి. వారి పేర్లు సిద్ధి బుద్ధిగా పేర్కొంటారు. మరి గణపతి తన సతులతో కలసి భక్తులను దీవించే ఒక ప్రసిద్ధ ఆలయం దేశంలో ఉంది. అది రాజస్థాన్ లోని స‌వాయ్ మ‌ధోపూర్ జిల్లా ర‌ణ‌థంబోర్ కోట‌లో ఉన్న త్రినేత్ర గ‌ణ‌ప‌తి ఆల‌యంగా చెబుతారు. ఇక్కడ కొలువు తీరిన వినాయకుడు అత్యంత శక్తిమంతుడు అని కూడా భక్తుల విశ్వాసంగా ఉంది.

13వ శతాబ్దంలో నిర్మాణం :

ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో ర‌ణ‌థంబోర్ రాజు హ‌మీర్‌ నిర్మించారు అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ రాజుకు ఢిల్లీ పాలకులతో యుద్ధం వచ్చినపుడు కలలో వినాయకుడు కనిపించి అభయం ఇచ్చారని ఆ మీదట ఆయన శత్రుమూకల నుంచి తన రాజ్యాన్ని కాపాడారని హమీర్ విశ్వసించి ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ ఆలయం నిర్మించారు అని పేర్కొంటారు.

అనేక రూపాలలో :

అదే విధంగా తమిళనాడులో నాగ‌ర్ కోయిల్ జిల్లా కేర‌ళ‌పురంలోని ఓ ఆల‌యంలో వినాయ‌కుడు ఏడాదికి రెండు రంగులలో భక్తులకు దర్శనం ఇస్తారు. ప్రతీ ఏటా జూలై నుని ఫిబ్రవరి వరకూ తెలుగు రంగులో దర్శనం ఇస్తారు మార్చి నుంచి జూన్ వరకూ నల్లని రంగులో భక్త జనాలను ఆశీర్వదిస్తారు. ఈ వినాయకుడికి ఎంతో మహిమ ఉందని భక్త జనులు విశ్వసిస్తారు.

వెన్నతో అలంకరణ :

వెన్నతోనే గణపతికి అలంకరించే సంప్రదాయం బెంగ‌ళూరులోని బ‌స‌వ‌న‌గుడి బుల్ ఆల‌యం పరిసరాలలో ఉంది. ఆ ఆలయం ప‌క్క‌నే దొడ్డ గ‌ణ‌ప‌తి ఆల‌యం ఉంది. ఇక ఈ ఆలయంలో ఉన్న గ‌ణ‌ప‌తి విగ్రహం 18 అడుగుల పొడ‌వు ఏకంగా పదహారు అడుగుల వెడ‌ల్పు ఉంటుంది ఈ గణపతికి దొడ్డ గణపతి అన్న పేరుతో పాటు స‌త్య గ‌ణ‌ప‌తి, శ‌క్తి గ‌ణ‌ప‌తి అని కూడా పేర్లు ఉన్నాయి. స్వామి వారిని ఇక్కడ వెన్న‌తో అలంక‌రించ‌డం అతి ముఖ్యమైన విశేషంగా పేర్కొంటారు. అందుకోసం ఏకంగా వందకు పైగా కేజీల వెన్నను వాడుతారు.

అక్కడ ఒక తొండంతో కాదు :

సాధారణంగా వినాయకుడు ఒకే తొండంతో కనిపిస్తారు. అలాగే భక్తులకు ఆయన దర్శనం ఇస్తారు కానీ మూడు తొండాలతో గణనాధుడు ఉన్నారు అంటే ఆశ్చర్యమే కదా. ఈ రూపంలో వినాయకుడు మ‌హారాష్ట్ర పుణేలోని సోమ్వార్ పేట్ జిల్లాలోని న‌జ‌గిరి న‌దీ తీరంలోని త్రిశుండ్ గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో స్వామి వారు కొలువు తీరారు. ఇక్కడ వినాయకుని వాహనం ఎలుక కాదు, నెమలిగా ఉంటుంది. ఇవన్నీ భక్తులకు ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉంటాయి.

వినాయకుడి మహిమలు :

ఈ విధంగా చూస్తే ఎన్నో ఆలయాలు దేశంలో వినాయకుడి మహిమలు తెలియచేస్తాయి దేశంలోని కొన్ని ప్రసిద్ధ గణపతి ఆలయాలలో ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయం ఒకటిగా ఉంది. అలాగే పూణేలోని దగ్దుషేత్ హల్వాయి గణపతి ఆలయం కూడా ప్రాముఖ్యత కలిగినది ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరులోని కాణిపాకం వినాయక ఆలయం చాలా ప్రాధాన్యత కలిగినదిగా ఉంది. తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని ఉచ్చి పిల్లయార్ ఆలయం ఒక కొండపై ఉన్న రాతితో చెక్కబడిన భారీ నిర్మాణంతో ఉంటుంది అలాగే పుదుచ్చేరి రాష్ట్రంలోని మనకులవినాయగర్ ఆలయం 500 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అతి పురాతనమైన ఆలయంగా ఉంది.

Tags:    

Similar News