దేవినేని ఉమా...మౌనానికి అర్ధమేంటామ్మా ?
ఈ హామీతోనే ఉమా శాంతించి మైలవరంలో క్రిష్ణ ప్రసాద్ గెలుపు కోసం కృషి చేశారు అని అంటారు.;
దేవినేని ఉమా మహేశ్వరరావు. క్రిష్ణా జిల్లాకు చెందిన కీలక నేత. టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్. డైనమిక్ నేచర్ ఉన్న వారు. అనేక సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి వచ్చారు. అయితే 2014 నుంచి 2019 మధ్యలో ఆయన కీలకమైన జల వనరుల శాఖను చేపట్టారు. ఆయన మంత్రిగా ఉండగానే పోలవరం ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక విధంగా పోలవరం విషయంలో ఉమా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అనే చెప్పాలి.
ఆయన టీడీపీలో బలమైన వాయిస్. పార్టీ మీద చంద్రబాబు మీద ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు. వైసీపీని తనదైన పదునైన మాటలతో చీల్చి చెండాడే వారు. ఇక విపక్షంలోకి వచ్చాక కూడా ఉమా సౌండ్ ఏమీ తగ్గలేదు. ఆయన వైసీపీ మంత్రులుగా ఉన్న కొడాలి నాని పేర్ని నాని మీద సెటైర్లు పేల్చుతూ నిత్యం వార్తలలో నిలిచిన వ్యక్తి.
ఇక ఆయన 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి వైసీపీ నేత వసంత క్రిష్ణ ప్రసాద్ చేతిలో ఓటమి పాలు అయ్యారు అయిదేళ్ల పాటు వైసీపీలో ఉన్న వసంత క్రిష్ణ ప్రసాద్ సరిగ్గా ఎన్నికలకు ముందు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన మైలవరం సీటు అందుకున్నారు. దాంతో త్యాగం చేయడం ఉమాకు తప్పింది కాదు.
ఆ సమయంలో టీడీపీ అధినాయకత్వం ఆయనకు ఒక భారీ హామీ ఇచ్చిందని ప్రచారం సాగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే వచ్చే ఎమ్మెల్సీ ఖాళీలలో ఒక దానికి ఉమాకు ఇస్తామని స్పష్టం చేశారని చెప్పుకున్నారు. ఈ హామీతోనే ఉమా శాంతించి మైలవరంలో క్రిష్ణ ప్రసాద్ గెలుపు కోసం కృషి చేశారు అని అంటారు.
ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికి ఎనిమిది ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేశారు. అలాగే మూడు రాజ్యసభ సీట్లకు ఖాళీలను భర్తీ చేశారు. కానీ ఎక్కడా ఉమా పేరు పరిశీలనలోకి తీసుకోలేదు. దాంతో ఆయన వర్గీయులు పూర్తి అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఉమా అయితే పెద్దల సభలో సీటు కచ్చితంగా దక్కుతుందని ఆశించారని అంటారు.
అది దక్కకపోవడంతో పాటు 2027 దాకా మళ్ళీ మండలిలో ఖాళీలు లేకపోవడంతో ఉమా వర్గం డీలా పడిందని అంటున్నారు ఇక దేవినేని ఉమా అయితే ఈ మధ్య అంతా ఫుల్ సైలెంట్ గా ఉంటున్నారు అని అంటున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారన్నది కూడా తెలియదు అని అంటున్నారు. ఆయన హైదరాబాద్ కే పరిమితం అయ్యారని ఏపీ వైపు చూడడం మానేశారని కూడా ప్రచారం సాగుతోంది.
ఇక టీడీపీ ఆఫీసు వైపు కూడా చూడటం లేదని అంటున్నారు. తాజాగా చంద్రబాబు పోలవరం ప్రాంతాన్ని సందర్శించారు. బాబు వెంట ఎపుడూ కనిపించే ఉమా ఈసారి రాకపోవడం మీద కూడా చర్చ సాగింది. మాజీ జలవనరుల శాఖ మంత్రిగా ఉమా ఉండాల్సిన నేపథ్యంలో ఆయన గైర్ హాజరు కావడం మీడియాకు కూడా ఒక న్యూస్ అయింది అని అంటున్నారు.
ఈ మొత్తం పరిణామాలను చూస్తున్న వారు మాత్రం దేవినేని ఉమా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. కేవలం హైకమాండ్ మాట మేరకే ఆయన మైలవరం టికెట్ ని త్యాగం చేసి రాజకీయంగా తన ప్రత్యర్ధి అయిన వసంత క్రిష్ణ ప్రసాద్ గెలుపునకు కృషి చేశారని అంటున్నారు. ఇపుడు సీటూ లేకుండా పోయింది. హామీ ఏమవుతుందో తెలియదు అని అనుచరులు అంటున్నారు. మరి దేవినేని ఉమా భవిష్యత్తు ఏమిటి అన్న చర్చ సాగుతోంది.
ఆరు పదుల వయసులో ఉన్న ఉమా రాజకీయంగా చూస్తే సీనియర్ గానే ఉన్నారు. టీడీపీ ప్రస్తుతం కొత్త ఫిలాసఫీని ఫాలో అవుతోంది. దాని ప్రకారం చూస్తే సీనియర్లకు కేవలం గౌరవం మాత్రమే దక్కుతుంది అని అంటున్నారు. పదవుల విషయంలో కొత్త వారికే చాన్స్ అన్నది ఆచరణలో చూపుతున్నారు. అదే కనుక ఉమా విషయంలోనూ అప్లై అయితే ఆయన మాజీ మంత్రిగానే మిగిలిపోతారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది మరి.