మూడేళ్లలో 10లక్షల మంది రష్యా సైనికకులను అంతం చేశాం.. ఉక్రెయిన్ షాకింగ్ ప్రకటన
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది.;
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ భీకర పోరులో ఇరువైపులా భారీ నష్టం జరుగుతోంది. తాజాగా ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ కార్యాలయం ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ మూడేళ్ల యుద్ధంలో తమ సైన్యం దాదాపు 10 లక్షల మంది రష్యా సైనికులను మట్టుబెట్టిందని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ అంకెలు యుద్ధ తీవ్రతను, ఉక్రెయిన్ ప్రతిఘటనను స్పష్టం చేస్తున్నాయి.
ఉక్రెయిన్ సాయుధ దళాల నివేదిక ప్రకారం.. మొత్తం 9,90,800 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గత 24 గంటల్లోనే 1,100 మంది మరణించారు. సైనికుల నష్టంతో పాటు, రష్యాకు ఆస్తి నష్టం కూడా అపారంగా జరిగింది. ఉక్రెయిన్ దాడుల్లో రష్యా కోల్పోయిన కీలక సైనిక పరికరాలు, వాహనాల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ట్యాంకులు 10,881, సాయుధ పోరాట వాహనాలు - 22,671, ఇంధన ట్యాంకులు - 50,607, ఫిరంగి వ్యవస్థలు - 28,623, మల్టీ లాంట్ రాకెట్ సిస్టమ్స్ - 1,402, వైమానిక రక్షణ వ్యవస్థలు - 1,176, విమానాలు - 384, యుద్ధ విమానాలు - 41, హెలికాప్టర్లు - 336, డ్రోన్లు- 38,748, నౌకలు: 28, జలాంతర్గామి - 1. ఈ లెక్కలు ఉక్రెయిన్ యుద్ధభూమిలో రష్యాకు ఎంత భారీ నష్టాన్ని కలిగించిందో చూపుతున్నాయి.
సుమీ నగరంపై రష్యా దాడులు
మరోవైపు, రష్యా దాడులు కూడా కొనసాగుతున్నాయి. మంగళవారం రష్యా దళాలు ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై తీవ్రంగా దాడి చేశాయి. ఈ దాడుల్లో కనీసం ముగ్గురు పౌరులు మరణించారు. అపార్ట్‌మెంట్లు, వైద్య కేంద్రం సహా అనేక భవనాలపై రాకెట్లు వర్షంలా కురిశాయి. రష్యా ఈ యుద్ధాన్ని ఆపే ఉద్దేశం లేదని ఈ దాడులు స్పష్టం చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
కెర్చ్ వంతెనపై ఉక్రెయిన్ దాడి
ఉక్రెయిన్ భద్రతా బలగాలు రష్యాను, క్రిమియాను కలిపే కెర్చ్ వంతెన పునాదులకు 1,100 కిలోల పేలుడు పదార్థాలతో నష్టం కలిగించగలిగామని తెలిపాయి. ఇది రష్యాకు ఆర్థికంగా, సైనికంగా కీలకమైన వంతెన. ఈ దాడి రష్యాకు గణనీయమైన నష్టాన్ని కలిగించిందని ఉక్రెయిన్ బలగాలు పేర్కొన్నాయి.