భారీ అధికార బృందంతో ఇండియా వచ్చిన బ్రిటన్ ప్రధాని స్టార్మర్.. ఈ పర్యటన ప్రత్యేకత ఏంటంటే?

భారత్ తో జులైలో అతిపెద్ద ఒప్పందం కుదిరిందని, ఇంతవరకు ఏ దేశం కూడా అలాంటి ఒప్పందం చేసుకోలేదని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ చెప్పారు.;

Update: 2025-10-09 07:19 GMT

బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మన దేశానికి వచ్చారు. ముంబైలో తొలిరోజు గడిపిన బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఈ రోజు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం ఆయన పర్యటిస్తున్నారు. మొత్తం 125 మంది ప్రతినిధుల బృందంతో ముంబైలో అడుగుపెట్టారు. ఈ బృందంలో రోల్స్ రాయిస్, బ్రిటిష్ టెలికం, బ్రిటిష్ ఎయిర్వేస్, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజి ప్రతినిధులు ఉన్నారు. ప్రధానిగా స్మార్టర్ తొలిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా దేశంలో పర్యటిస్తున్నారు. ఇక ముంబైలోని యష్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోను ఆయన సందర్శించగా, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ ఘన స్వాగతం పలికారు.

మరో రెండు ఏళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్న భారత్ తో బ్రిటన్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం అత్యంత కీలకమని ప్రధాని స్టార్మర్ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల అపార అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. బ్రిటన్ పురోభివృద్ధికి ఈ ఒప్పందం ఒక లాంచ్ పాడ్ మాదిరిగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి తాము వైదొలగిన తర్వాత భారత్ తో కుదిరిన ఒప్పందం చాలా కీలకమైనదన్నారు. దీనివల్ల ఈయూపై బ్రిటన్ ఆధారపడటం తగ్గుతుందని తెలిపారు.

బ్రిటిష్ ప్రజలకు మరిన్ని అవకాశాలు

భారత్ తో జులైలో అతిపెద్ద ఒప్పందం కుదిరిందని, ఇంతవరకు ఏ దేశం కూడా అలాంటి ఒప్పందం చేసుకోలేదని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ చెప్పారు. భారత్ తో వృద్ధి అంటే బ్రిటిష్ ప్రజలకు మరిన్ని అవకాశాలు, స్థిరత్వం, ఉద్యోగాలు అని అర్థమని ఆయన విశ్లేషించారు. భారత్ తో వ్యాపారానికి బ్రిటిష్ వాణిజ్య వర్గాలకు తలుపులు తెరచుకున్నాయని ప్రధాని కార్యాలయం ప్రకటనలో పేర్కొన్నారు. బ్రిటిష్ ఉత్పత్తులపై భారత్ సగటు టారిఫ్ 15% నుంచి మూడు % తగ్గనుందని తెలిపింది. దీనివల్ల శీతల పానీయాలు, సౌందర్య సాధనాలు, కార్లు, వైద్య పరికరాలు వంటివి భారత మార్కెట్లో సులభంగా విక్రయించుకోవచ్చని వివరించింది. ద్వైపాక్షిక బంధాలను మరింత విస్త్రుతం చేయడంపై భారత ప్రధాని మోదీతో ఈ రోజు చర్చలు జరగనున్నాయి.

చరిత్రాత్మక పర్యటన

బ్రిటన్ ప్రధాని స్టార్మర్ టీం పర్యటనను ప్రధాని మోదీ స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్టు చేశారు. స్టార్మర్ పర్యటన చరిత్రాత్మకం అంటూ అభివర్ణించారు. తనతో జరగనున్న చర్చల్లో దార్శనికతను పంచుకుని బలమైన పరస్సర పురోగమనదాయక భవితవ్యాన్ని మున్ముందుకు తీసుకువెళ్లేందుకు ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News