‘సనాతనం’పై మళ్లీ ఉదయనిధి వ్యాఖ్యలు.. తమిళనాడు అసెంబ్లీలో కలకలం

ఎన్నికల్లో డీఎంకే ఓడిపోవడానికి గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా ఓ కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.;

Update: 2026-05-12 08:12 GMT

సనాతనం ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి గతంలో కోర్టు నుంచి మొట్టికాయలు తిన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మళ్లీ అదే రకమైన ప్రకటనతో దుమారం రేపారు. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక సందర్భంగా మాట్లాడిన ఉదయనిధి సనాతన ధర్మాం రూపు మాపాలని పిలుపునిచ్చారు. 2023లో జాతీయ స్థాయిలో పెను వివాదానికి దారితీసిన ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అనే తన పాత ప్రకటనను ఆయన అసెంబ్లీ సాక్షిగా మళ్లీ పునరుద్ఘాటించడం విశేషంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి విజయ్ సభలో ఉండగానే ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి జరుగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధాన ప్రతిపక్ష నేతగా మాట్లాడిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై తన పాత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే తన పాత మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తుండగా, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఎదురుగా కూర్చుని ఉన్నారు. గతంలో ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. పలు న్యాయపరమైన చిక్కులు సైతం ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఫ్లోర్ పై అదే అంశాన్ని లేవనెత్తడంతో చర్చకు తావిచ్చారని అంటున్నారు.

ఎన్నికల్లో డీఎంకే ఓడిపోవడానికి గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా ఓ కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వల్లే హిందూ ఓటర్లకు డీఎంకే దూరమైనట్లు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓడినా ఉదయనిధిలో ఎలాంటి మార్పు రాకపోవడం పరిశీలకులను విస్మయానికి గురిచేస్తోందని చెబుతున్నారు. మనుషుల మధ్య దూరాన్ని పెంచే సనాతన ధర్మాన్ని అంతం చేయాలంటూ అసెంబ్లీ సాక్షిగా ఆయన పిలుపునివ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉదయనిధి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి విజయ్ ఎలా స్పందిస్తారని అంతా ఎదురుచూశారు.

ఇక ఉదయనిధి స్టాలిన్ ప్రసంగం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడారు. అయితే చాలా తెలివిగా ఆయన ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందించారని అంటున్నారు. "రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంది. కానీ ఒకరి నమ్మకాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదు. ప్రభుత్వం అన్ని మతాలను, నమ్మకాలను సమానంగా గౌరవిస్తుంది" అని ముఖ్యమంత్రి విజయ్ స్పష్టం చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలపై మౌనంగా ఉండకుండా, చాలా హుందాగా స్పందిస్తూ విభజన రాజకీయాలు కంటే తమకు ప్రజా సంక్షేమమే ముఖ్యమని సీఎం స్పష్టత ఇచ్చారని అంటున్నారు.

Tags:    

Similar News